Onion Price Hike : ఉల్లి రైతులకు కేంద్రం బంపర్ ఆఫర్.. కొనుగోలు ధరలు భారీగా పెంపు
Onion Price Hike : ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. బఫర్ స్టాక్ కోసం సేకరించే ఉల్లిపాయల కొనుగోలు ధరను క్వింటాల్‌కు 2,125 రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది.
Onion Price Hike
Onion Price Hike : దేశంలోని ఉల్లి రైతులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. మార్కెట్లో ఉల్లిపాయల ధరలు పతనం కాకుండా చూడటంతో పాటు రైతులకు లాభసాటి ధర కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బఫర్ స్టాక్ (అత్యవసర నిల్వలు) కోసం సేకరించే ఉల్లిపాయల కొనుగోలు ధరను ఏకంగా 13 శాతం మేర పెంచుతున్నట్లు ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పటివరకు క్వింటాల్‌కు రూ.1,875 గా ఉన్న కొనుగోలు ధర, ఇకపై రూ.2,125 కు చేరనుంది. ప్రభుత్వ ప్రైస్ స్టెబిలైజేషన్ ఫండ్ కింద సేకరించే ఈ కొత్త రేట్లు జూలై 4 నుంచే అమల్లోకి వచ్చాయి. ప్రస్తుత సీజన్లో ఉల్లి కొనుగోలు ధరలను ప్రభుత్వం సవరించడం ఇది ఐదోసారి కావడం గమనార్హం.
ధరలు పెంచినా మందకొడిగానే ఉల్లి సేకరణ
ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతో ధరలను పదే పదే పెంచుతున్నప్పటికీ, అధికారికంగా ఉల్లి సేకరణ మాత్రం చాలా మందకొడిగా సాగుతోంది. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటివరకు కేవలం 2,000 టన్నుల ఉల్లిని మాత్రమే ప్రభుత్వం సేకరించగలిగింది. ఈ సీజన్ ప్రారంభంలో కేజీ ఉల్లి కొనుగోలు ధర కేవలం రూ.12.70 పైసలుగా ఉండేది. ఆ తర్వాత మే 22న రూ.15.80 పైసలకు, జూన్ 13న రూ.16.50 పైసలకు, జూన్ 20న రూ.17.30 పైసలకు పెంచారు. ఆ తర్వాత కొద్దిరోజులకే రూ.18.75 పైసలు చేసిన ప్రభుత్వం, ఇప్పుడు ఏకంగా కేజీకి రూ.21.25 పైసలు (క్వింటాల్‌కు రూ.2,125)గా ఖరారు చేసింది. ఇక అంచనాల ప్రకారం ఈ ఏడాది దేశంలో ఉల్లి సాగు 307.37 లక్షల టన్నులుగా ఉండే అవకాశం ఉంది. ఇది గతేడాది దిగుబడికి సమానంగా ఉండటం విశేషం.
దేశంలో ఉల్లిపాయల కొరత లేదు
దేశంలో ఉల్లిపాయల సరఫరాకు సంబంధించి ఎలాంటి ఆందోళనలు అవసరం లేదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అయితే ప్రతి ఏటా సీజన్ ముగిసే సమయంలో వచ్చే మార్పుల వల్ల రిటైల్ మార్కెట్లో ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ప్రస్తుతం మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ వంటి ప్రధాన రాష్ట్రాల్లో ఉల్లి నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న వివిధ మార్కెట్లకు రోజుకు 50,000 టన్నులకు పైగా ఉల్లి వస్తోంది. ఇందులో ఒక్క మహారాష్ట్ర నుంచే 30,000 టన్నుల ఉల్లి సరఫరా అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లలో ఉల్లి సగటు హోల్ సేల్ ధర కేజీ రూ.18 గా ఉండగా, దేశవ్యాప్తంగా రిటైల్ మార్కెట్లో సగటున రూ.31 కి విక్రయిస్తున్నారు.
స్టోరేజీలకే పరిమితమైన నాణ్యమైన ఉల్లి
ప్రస్తుతం మార్కెట్లోకి వస్తున్న ఉల్లిపాయల్లో మంచి నాణ్యత కలిగిన పంటను రైతులు, పెద్ద వ్యాపారులు కోల్డ్ స్టోరేజీల్లో దాస్తున్నారు. రాబోయే రోజుల్లో కొరత ఏర్పడినప్పుడు మంచి లాభాలకు అమ్ముకోవచ్చనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం వర్షాలు ఆలస్యం కావడం, కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో వ్యాపారులు ముందస్తుగా భారీగా స్టాక్ కొనుగోలు చేస్తున్నారు. దీంతో నాసిక్, మధ్యప్రదేశ్ వంటి ప్రధాన ఉల్లి ఉత్పత్తి కేంద్రాలలో వ్యాపారుల మధ్య పోటీ పెరిగి ధరలు ఊహాజనితంగా మారుతున్నాయి. అయినప్పటికీ నగరాల్లో అసలైన వినియోగదారుల నుంచి డిమాండ్ ఇంకా కాస్త బలహీనంగానే ఉంది.
పాకిస్తాన్, చైనా నుంచి గట్టి పోటీ
గత జూన్ నెలలో భారతదేశం నుంచి ఉల్లి ఎగుమతులు సాధారణంగానే సాగాయి. దాదాపు 1.50 లక్షల టన్నుల ఉల్లిని విదేశాలకు పంపించారు. అయితే రాబోయే రోజుల్లో భారత ఉల్లి ఎగుమతుల వేగం తగ్గే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. గల్ఫ్ దేశాలు, శ్రీలంక, ఆసియా మార్కెట్లలో పాకిస్తాన్, చైనా దేశాల నుంచి కొత్త ఉల్లి పంట తక్కువ ధరలకే అందుబాటులోకి రావడమే దీనికి ప్రధాన కారణం. దీంతో భారత ఉల్లికి అంతర్జాతీయంగా గట్టి పోటీ ఎదురవుతోంది. మరోవైపు దేశీయంగా చూస్తే, మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతంలో ఉల్లి సాగు పనులు 15 రోజులు ఆలస్యమవగా, కర్ణాటకలోని చిత్రదుర్గ, చల్లాకెరె బెల్టులో సాధారణ సాగు కంటే కేవలం 60 శాతం మాత్రమే విత్తనాలు నాటడం ఆందోళన కలిగిస్తోంది.




