Fastag Reward: రూ.1,000 ఉచిత ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్.. NHAI బంపర్ ఆఫర్!
Fastag Reward: NHAI టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్ర టాయిలెట్ల ఫోటోలు రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో పంపితే రూ.1000 ఉచిత ఫాస్ట్‌ట్యాగ్ పొందే అవకాశం.
Fastag Reward: రూ.1,000 ఉచిత ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్.. NHAI బంపర్ ఆఫర్!
Fastag Reward: నేషనల్ హైవేస్‌పై ప్రయాణించే వారికి నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) గుడ్‌న్యూస్ చెప్పింది. హైవేపై NHAI నిర్వహించే టోల్ ప్లాజాల వద్ద అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లను ఫొటో తీసి ఫిర్యాదు చేస్తే రూ.1,000 విలువైన FASTag రివార్డ్ పొందే అవకాశం ఉంది. ఇందుకోసం NHAI ‘Clean Toilet Picture Challenge’ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.
2027 జూన్ 30 వరకు అవకాశం
‘Clean Toilet Picture Challenge’ను 2025 సెప్టెంబర్‌లో ప్రారంభించారు. హైవే ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ కార్యక్రమాన్ని 2027 జూన్ 30 వరకు పొడిగించారు. 2026లో ఇప్పటివరకు సుమారు 429 మంది ప్రయాణికులు అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లపై ఫిర్యాదులు చేసినట్లు NHAI వెల్లడించింది. నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఫిర్యాదుదారులకు రూ.1,000 FASTag రీచార్జ్ రివార్డ్ అందింది.
రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో ఫిర్యాదు
అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్ కనిపిస్తే Rajmargyatra యాప్ తాజా వెర్షన్ ద్వారా ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు సమయంలో టాయిలెట్‌కు సంబంధించిన స్పష్టంగా కనిపించే జియో-ట్యాగ్డ్, టైమ్‌స్టాంప్ ఉన్న ఫొటోను అప్‌లోడ్ చేయాలి. దీంతో పాటు పేరు, లొకేషన్, వాహనం రిజిస్ట్రేషన్ నంబర్ (VRN), మొబైల్ నంబర్ వంటి వివరాలను నమోదు చేయాల్సి ఉంటుంది.
సమర్పించిన ఫొటో, వివరాలను తొలుత ఏఐ సాయంతో స్క్రీనింగ్ చేస్తారు. అనంతరం మాన్యువల్‌గా కూడా పరిశీలిస్తారు. ఫొటో, వివరాలు నిబంధనలకు అనుగుణంగా ఉన్నట్లు నిర్ధారణ అయితే.. ఇచ్చిన VRNకు అనుసంధానమైన FASTagలో రూ.1,000 క్రెడిట్ చేస్తారు.
రివార్డ్‌కు కొన్ని నిబంధనలు
ఈ కార్యక్రమంలో ఒక వాహనం రిజిస్ట్రేషన్ నంబర్‌కు మొత్తం ఛాలెంజ్ వ్యవధిలో ఒక్కసారి మాత్రమే రూ.1,000 రివార్డ్ లభిస్తుంది. ఈ రివార్డ్‌ను ఇతరులకు బదిలీ చేయడం లేదా నగదుగా మార్చుకోవడం సాధ్యం కాదు.
అదే టాయిలెట్‌పై ఒకే రోజు పలువురు ఫిర్యాదు చేస్తే.. రాజ్‌మార్గ్‌యాత్ర యాప్‌లో ముందుగా నమోదైన చెల్లుబాటు అయ్యే ఫిర్యాదును మాత్రమే పరిగణనలోకి తీసుకుంటారు.
ఏ టాయిలెట్లకు వర్తిస్తుంది?
NHAI నేరుగా నిర్మించిన, నిర్వహిస్తున్న లేదా మెయింటెయిన్ చేస్తున్న టాయిలెట్లకు మాత్రమే ఈ రివార్డ్ పథకం వర్తిస్తుంది. పెట్రోల్ పంపులు, ధాబాలు, ఇతర పబ్లిక్ ప్రదేశాల్లో ఉన్న టాయిలెట్లు ఈ కార్యక్రమం పరిధిలోకి రావు.
అంటే హైవేపై ప్రయాణిస్తున్నప్పుడు NHAI పరిధిలోని టోల్ ప్లాజా వద్ద అపరిశుభ్రమైన టాయిలెట్ కనిపిస్తే.. సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, నిబంధనలు పాటించినట్లయితే FASTagలో రూ.1,000 రివార్డ్ పొందే అవకాశం ఉంటుంది.




