New Labour Code: మీ బాస్ సెలవు ఇవ్వలేదా..? అయితే అదృష్టమే..!
New Labour Code: కొత్త లేబర్ కోడ్ 2025తో ఉద్యోగుల సెలవుల కష్టాలకు చెక్.
New Labour Code: మీ బాస్ సెలవు ఇవ్వలేదా..? అయితే అదృష్టమే..!
Leave Encashment: ఆఫీసుల్లో అర్ధరాత్రి వరకు ఫైళ్లతో కుస్తీ పడుతూ, ప్రాజెక్టు డెడ్‌లైన్ల కోసం సొంత పనులను వాయిదా వేసుకునే ఉద్యోగులకు ఒక తీపి కబురు. మీరు వాడకుండా మిగిలిపోయిన సెలవులు ఇకపై కేవలం కాగితాలకే పరిమితం కావు; అవి మీ బ్యాంక్ బ్యాలెన్స్‌ను పెంచబోతున్నాయి.
సెలవుల డబ్బులు
పాత నిబంధనల ప్రకారం, సెలవుల డబ్బులు రావాలంటే ఉద్యోగం వదిలేయాలి లేదా రిటైర్ అవ్వాలి. కానీ, కొత్త లేబర్ కోడ్ ప్రకారం.. ప్రతి ఏడాది చివరలో మీ ఖాతాలో ఉన్న అదనపు సెలవులను నగదుగా మార్చుకోవచ్చు. అంటే, పండగకో లేదా పబ్బానికో అదనపు ఆదాయం కావాలనుకునే వారికి ఇది ఒక గొప్ప వెసులుబాటు.
భారీ ఉపశమనం
గతంలో (1948 ఫ్యాక్టరీల చట్టం ప్రకారం) వేతనంతో కూడిన సెలవులు పొందాలంటే ఒక సంవత్సరంలో కనీసం 240 రోజులు పనిచేయాల్సి ఉండేది. ఈ పరిమితిని 180 రోజులకు తగ్గించారు. అంటే, కేవలం 6 నెలలు పని పూర్తి చేసిన ఉద్యోగి సెలవులకు అర్హత సాధిస్తారు.
బాస్ సెలవు ఇవ్వకపోతే.. అదృష్టమే
సాధారణంగా మేనేజర్లు పని ఒత్తిడి సాకుతో సెలవులను తిరస్కరిస్తుంటారు. గతంలో అలా వాడుకోని సెలవులు వృధా అయిపోయేవి. కానీ కొత్త నిబంధనల ప్రకారం.. కంపెనీ సెలవును నిరాకరిస్తే, ఆ సెలవు రద్దు అవ్వదు.వాటిని ఎటువంటి పరిమితి లేకుండా వచ్చే ఏడాదికి 'క్యారీ ఫార్వర్డ్' చేసుకోవచ్చు.
30 రోజుల పరిమితి
ఒక ఉద్యోగి గరిష్టంగా 30 రోజుల సెలవులను మాత్రమే మరుసటి ఏడాదికి తీసుకెళ్లగలరు. ఒకవేళ మీ ఖాతాలో 31వ రోజు సెలవు వచ్చి చేరితే, ఆ అదనపు రోజుకు బదులుగా మీరు నగదును క్లెయిమ్ చేయవచ్చు. ఏడాది చివరలో మొత్తం సెలవులను డబ్బుగా మార్చుకునే స్వేచ్ఛ కూడా ఉద్యోగికి ఉంటుంది. ఈ కొత్త చట్టం ప్రధానంగా కింది కేటగిరీల వారికి రక్షణ కల్పిస్తుంది.నైపుణ్యం కలిగిన వారు, టెక్నికల్, క్లరికల్, ఆపరేషనల్ సిబ్బంది. నెలకు రూ. 18,000 కంటే తక్కువ వేతనం తీసుకునే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది.
నెలకు రూ. 18,000 కంటే ఎక్కువ జీతం తీసుకునే మేనేజర్లు, సూపర్ వైజర్లు , అడ్మినిస్ట్రేటివ్ అధికారులకు ఈ నిబంధనలు నేరుగా వర్తించకపోవచ్చు. అలాగే, ఈ చట్టం పూర్తిస్థాయిలో అమలులోకి రావాలంటే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు నోటిఫికేషన్ విడుదల చేయాల్సి ఉంటుంది. కొత్త లేబర్ కోడ్ అమలులోకి వస్తే, ఉద్యోగుల పని-జీవిత సమతుల్యత మెరుగుపడటమే కాకుండా, వారి హక్కులకు చట్టబద్ధమైన రక్షణ లభిస్తుంది. పని చేస్తే జీతం.. సెలవు తీసుకోకపోతే నగదు. ఇదీ ఈ కొత్త చట్టం సారాంశం.




