Recharge Plan: మొబైల్ యూజ‌ర్ల‌కు షాకింగ్ న్యూస్‌.. మ‌రో 3 నెల‌ల్లో భారీ దెబ్బ ఖాయం

Recharge Plan: దేశంలో మరోసారి మొబైల్ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది.

Mokshith
Published on: 8 July 2026 11:54 AM IST
Recharge Plan
X

Recharge Plan: మొబైల్ యూజ‌ర్ల‌కు షాకింగ్ న్యూస్‌.. మ‌రో 3 నెల‌ల్లో భారీ దెబ్బ ఖాయం

Recharge Plan: దేశంలో మరోసారి మొబైల్ రీచార్జ్ ప్లాన్‌ల ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. టెలికాం కంపెనీలు వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో టారిఫ్‌లను పెంచవచ్చని సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ నివేదిక అంచనా వేసింది. దీంతో జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులపై అదనపు భారం పడే అవకాశం ఉంది.

మరో 3-4 నెలల్లో రీచార్జ్ ధరలు పెరగొచ్చు

సెంట్రమ్ ఇన్‌స్టిట్యూషనల్ రీసెర్చ్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, భారత టెలికాం కంపెనీలు వచ్చే మూడు నుంచి నాలుగు నెలల్లో మొబైల్ టారిఫ్‌లను 12-15 శాతం వరకు పెంచే అవకాశం ఉంది. ఈ ధరల పెంపు వల్ల ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ వినియోగదారుల నెలవారీ ఖర్చు పెరగనుంది. నివేదికలో మరో అంచనా కూడా వెల్లడైంది. రానున్న రోజుల్లో భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ జియో వినియోగదారుల సంఖ్య మరింత పెరుగుతుందని, అదే సమయంలో వొడాఫోన్ ఐడియా తన 5జీ నెట్‌వర్క్ విస్తరణపై దృష్టి పెట్టనున్నట్లు పేర్కొంది.

రీచార్జ్ ప్లాన్‌ల ధరలు ఎంత పెరగొచ్చు?

టెలికాం కంపెనీలు 15 శాతం వరకు ధరలు పెంచితే ప్రస్తుతం ఉన్న ప్రస్తుతం రూ.199 ఉన్న ప్లాన్ ధర సుమారు రూ.229కు చేరొచ్చు. అలాగే రూ.299 ప్లాన్ ధర రూ.344 నుంచి రూ.359 మధ్య ఉండొచ్చు. ఇక రూ.999 దీర్ఘకాలిక ప్లాన్ ధర సుమారు రూ.1,149కు పెరిగే అవకాశం ఉంది.

టెలికాం కంపెనీలు ధరలు ఎందుకు పెంచుతున్నాయి?

దేశవ్యాప్తంగా 5జీ సేవలను మరింత విస్తరించేందుకు రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. కొత్త టవర్లు, నెట్‌వర్క్ పరికరాలు, సేవల మెరుగుదల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఈ పెట్టుబడులను కొంత మేర తిరిగి పొందేందుకు కంపెనీలు టారిఫ్‌లను పెంచాలని భావిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

ARPU పెంచుకోవడమే కంపెనీల లక్ష్యం

టెలికాం సంస్థలు ARPU (యావ‌రేజ్ రెవెన్యూ ప‌ర్ యూజ‌ర్‌)ను పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాయి. అంటే ఒక యాక్టివ్ వినియోగదారుడి నుంచి సగటున ఎంత ఆదాయం వస్తుందో దానినే ARPU అంటారు. ప్రతి కస్టమర్ నుంచి వచ్చే ఆదాయం పెరిగితే కంపెనీల లాభాలు కూడా పెరుగుతాయి. అందుకే టారిఫ్‌ల పెంపు ద్వారా ARPUని మెరుగుపరచాలని టెలికాం సంస్థలు చూస్తున్నాయి.

జియో, ఎయిర్‌టెల్ ఆధిపత్యం కూడా ధరల పెంపునకు కారణమే

ప్రస్తుతం భారత టెలికాం రంగంలో రిలయన్స్ జియో, భారతి ఎయిర్‌టెల్ ప్రధాన సంస్థలుగా కొనసాగుతున్నాయి. మార్కెట్‌లో పోటీ గతంతో పోలిస్తే తగ్గడంతో ధరలు పెంచడం కంపెనీలకు సులభంగా మారిందని నివేదిక పేర్కొంది. అలాగే రాబోయే రోజుల్లో కూడా ఈ రెండు కంపెనీలకు కొత్త వినియోగదారులు పెద్ద సంఖ్యలో చేరే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రతి త్రైమాసికంలో రిలయన్స్ జియోకు సుమారు 70 లక్షల మంది, భారతి ఎయిర్‌టెల్‌కు 50 లక్షల మంది కొత్త సబ్‌స్క్రైబర్లు చేరే అవకాశం ఉందని నివేదిక వెల్లడించింది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story