Milk Prices: సామాన్యుడిపై మరో పిడుగు..ఇలా అయితే బ్రతికేది ఎలా..?

Milk Prices: పెరుగుతున్న సేకరణ ఖర్చుల కారణంగా అముల్, మదర్ డెయిరీ పాల ధరలను లీటరుకు రూ. 2 చొప్పున పెంచాయి.

Naresh.k
Published on: 14 May 2026 7:31 AM IST
Milk Prices
X

Milk Prices: సామాన్యుడిపై మరో పిడుగు..ఇలా అయితే బ్రతికేది ఎలా..?

Milk Prices Hike: పెరుగుతున్న నిత్యావసరాల భారంతో సతమతమవుతున్న సామాన్యుడికి మరో చేదు వార్త అందింది. వంటింట్లో అత్యంత కీలకమైన పాల ధరలు ఒక్కసారిగా పెరగడం ఇప్పుడు గృహిణుల బడ్జెట్‌ను తలకిందులు చేస్తోంది. దేశీయ డెయిరీ దిగ్గజాలైన మదర్ డెయిరీ , అముల్ తమ పాల ధరలను లీటరుకు 2 రూపాయల చొప్పున పెంచుతూ నిర్ణయం తీసుకోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ కొత్త ధరలు 2026 మే 14, గురువారం నుండే అమలులోకి వచ్చాయి.

ఎందుకు ఈ ధరల పెంపు?

గత ఏడాది కాలంగా రైతుల వద్ద నుండి పాలను సేకరించే ఖర్చు గణనీయంగా పెరిగిందని కంపెనీలు వివరిస్తున్నాయి. ముఖ్యంగా పశుగ్రాసం ధరలు ఆకాశాన్ని తాకడం, రవాణా ఖర్చులు పెరగడం వంటి కారణాలతో పాలను సేకరించడం కంపెనీలకు భారంగా మారింది. గత ఏడాది కాలంలో సేకరణ ఖర్చులు సుమారు 6 శాతం పెరిగాయని, వినియోగదారులపై భారం పడకూడదనే ఉద్దేశంతో ఇన్నాళ్లూ ధరలను స్థిరంగా ఉంచామని మదర్ డెయిరీ పేర్కొంది. అయితే ఇక తప్పనిసరి పరిస్థితుల్లోనే ఈ స్వల్ప పెంపును చేపట్టినట్లు వెల్లడించింది. అముల్ సంస్థ సైతం ఇదే బాటలో పయనిస్తూ, తాము ఆర్జించే ఆదాయంలో సుమారు 80 శాతం వరకు రైతులకు తిరిగి చెల్లిస్తున్నామని, వారి సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోక తప్పలేదని స్పష్టం చేసింది.

కొత్త ధరల వివరాలు ఇలా ఉన్నాయి

ఈ తాజా మార్పుల వల్ల ఢిల్లీ-ఎన్‌సిఆర్ వంటి మెట్రో నగరాల్లో పాలు కొనుగోలు చేయడం మరింత ఖరీదైన వ్యవహారంగా మారింది. గతంలో 56 రూపాయలుగా ఉన్న లూజ్ టోన్డ్ మిల్క్ ధర ఇప్పుడు 58 రూపాయలకు చేరింది. అతి ఎక్కువగా వాడే ఫుల్-క్రీమ్ మిల్క్ పౌచ్ ధర ఏకంగా 72 రూపాయలకు పెరిగింది.సాధారణ టోన్డ్ మిల్క్ 60 రూపాయలకు, ఆవు పాలు 62 రూపాయలకు అందుబాటులో ఉండనున్నాయి. డబుల్ టోన్డ్ మిల్క్ ధర మాత్రం ఇప్పుడు 54 రూపాయలుగా నిర్ణయించబడింది.

సామాన్యుడిపై ప్రభావం

పాలనేవి కేవలం టీ, కాఫీలకు మాత్రమే పరిమితం కావు. పిల్లల పెరుగుదలకు, పెరుగు, నెయ్యి వంటి ఇతర పాల ఉత్పత్తుల తయారీకి ఇవి నిత్యావసరం. పాలు లేని ఇల్లు ఊహించుకోవడం కష్టం. ఇప్పటికే వంట నూనెలు, పప్పు ధాన్యాల ధరలు ఆకాశంలో ఉన్న తరుణంలో, పాల ధర పెరగడం మధ్యతరగతి, దిగువ తరగతి ప్రజల నెలవారీ ఖర్చులపై నేరుగా ప్రభావం చూపుతుంది. మదర్ డెయిరీ రోజుకు సుమారు 35 లక్షల లీటర్ల పాలను విక్రయిస్తూ వేల కోట్ల టర్నోవర్‌ను సాధిస్తోంది. కంపెనీల ఆదాయం పెరుగుతున్నప్పటికీ, సామాన్యుడు మాత్రం ప్రతి లీటరుపై అదనంగా రెండు రూపాయలు వెచ్చించాల్సి రావడం గమనార్హం. ఒకవైపు రైతులకు మేలు జరుగుతుందని కంపెనీలు వాదిస్తున్నా, సామాన్య వినియోగదారుడికి మాత్రం ఇది మోయలేని భారమే.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story