SemIndia Projects: మార్కెట్ మునిగినా.. దూసుకెళ్లిన స్టాక్..ఇన్వెస్టర్లకు కాసుల వర్షం

SemIndia Projects: అంతర్జాతీయ ఉద్రిక్తతల వల్ల సెన్సెక్స్ 1200 పాయింట్లు పతనమైనప్పటికీ, సెమ్‌ఇండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్ షేరు 20% లాభంతో అప్పర్ సర్క్యూట్ తాకింది.

Naresh.k
Published on: 1 May 2026 7:41 AM IST
SemIndia Projects
X

SemIndia Projects: మార్కెట్ మునిగినా.. దూసుకెళ్లిన స్టాక్..ఇన్వెస్టర్లకు కాసుల వర్షం

Stock Market: భారత స్టాక్ మార్కెట్ నేడు యుద్ధ మేఘాల నీడలో చిక్కుకుంది. అంతర్జాతీయంగా చమురు సెగలు, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు దలాల్ స్ట్రీట్‌ను వణికించాయి. ఒకానొక దశలో కుప్పకూలుతుందేమో అన్నట్లుగా 1200 పాయింట్లు పతనమైన సెన్సెక్స్, ఇన్వెస్టర్ల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. కానీ, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఒక షేరు మాత్రం రాకెట్‌లా దూసుకెళ్లి మార్కెట్ వర్గాలను ఆశ్చర్యపరిచింది. అదే సెమ్‌ఇండియా ప్రాజెక్ట్స్ లిమిటెడ్.

చమురు సెగ.. మార్కెట్ విలవిల

పశ్చిమాసియాలో ఇరాన్ - అమెరికా మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు ప్రపంచ దేశాలను కలవరపెడుతున్నాయి. ఇరాన్ ఓడరేవులపై ఆంక్షలు, హార్ముజ్ జలసంధి మూసివేత వంటి పరిణామాలు ముడి చమురు ధరలను మండిస్తున్నాయి. బ్యారెల్ ధర ఒక్కసారిగా 125 డాలర్లకు చేరడంతో భారత మార్కెట్లు కుదేలయ్యాయి. సెన్సెక్స్ 450 పాయింట్ల నష్టంతో 77,030 వద్ద ట్రేడ్ అయింది. నిఫ్టీ 150 పాయింట్లు కోల్పోయి 24,000 మార్కు వద్ద ఊగిసలాడింది. ఎల్ఐసీ, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ వంటి బ్లూచిప్ షేర్లు నష్టాల్లో కూరుకుపోయాయి.

సెమ్‌ఇండియా రికార్డు

మార్కెట్ మొత్తం నష్టాల్లో ఉంటే, సెమ్‌ఇండియా మాత్రం పచ్చని లాభాలతో మెరిసిపోయింది. ఏప్రిల్ 29న రూ. 679.40 వద్ద ముగిసిన ఈ షేరు, భారీ గ్యాప్-అప్‌తో ప్రారంభమై ఏకంగా 20 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. ప్రస్తుతం ధర రూ. 815.25 (ఒక్కరోజే రూ. 135 పెరిగింది). నెల రోజుల్లోనే 53 శాతం, గడచిన ఐదేళ్లలో ఏకంగా 1000 శాతానికి పైగా మల్టీబ్యాగర్ రిటర్న్స్ ఇచ్చింది. మార్కెట్ క్యాప్ సుమారు రూ. 14,000 కోట్లకు చేరింది.

అసలు కారణం ఇదే

సెమ్‌ఇండియా షేరు ఇలా లాభాల బాట పట్టడానికి ప్రధాన కారణం ఆ కంపెనీ ప్రకటించిన అద్భుతమైన క్యూ4 (Q4) ఫలితాలు. గత ఏడాదితో పోలిస్తే నికర లాభం 113 శాతం వృద్ధి చెంది రూ. 314.9 కోట్లుగా నమోదైంది.కంపెనీ రెవెన్యూ 17.4 శాతం పెరిగి రూ. 2,973.49 కోట్లకు చేరింది. ఈ బంపర్ ప్రాఫిట్స్ చూసిన ఇన్వెస్టర్లు, మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పటికీ ఈ షేరును కొనేందుకు ఎగబడ్డారు. ఫలితంగా సెమ్‌ఇండియా ఇన్వెస్టర్ల పోర్ట్‌ఫోలియోలో సిరులు కురిపించింది.

యుద్ధ భయాలు మార్కెట్‌ను భయపెడుతున్నా, బలమైన పునాదులు ఉన్న కంపెనీలు ఎప్పుడూ రాణిస్తాయని సెమ్‌ఇండియా నిరూపించింది. ఐదేళ్లలో 1000 శాతం అంటే.. ఇన్వెస్టర్ల సంపదను పదింతలు చేసిన ఈ కంపెనీ మున్ముందు ఇంకెన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story