Layoffs: వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి.. తెల్లవారేసరికి 8,000 తొలగించిన ప్రముఖ దిగ్గజ కంపెనీ

సోషల్ మీడియా దిగ్గజం మెటా (ఫేస్‌బుక్) మరోసారి భారీ లేఆఫ్స్‌తో షాకిచ్చింది.

Naresh.k
Published on: 21 May 2026 7:49 AM IST
Layoffs
X

Layoffs: వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి.. తెల్లవారేసరికి 8,000 తొలగించిన ప్రముఖ దిగ్గజ కంపెనీ

Meta: సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ మరోసారి ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించింది. ఎప్పుడు ఎవరి ఉద్యోగం ఊడుతుందో తెలియక ఉద్యోగులు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్న తరుణంలో, మెటా యాజమాన్యం తీసుకున్న ఈ అర్ధరాత్రి నిర్ణయం కార్పొరేట్ ప్రపంచంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా ఉద్యోగం తీసేయాలంటే ఆఫీసుకు పిలిచి మాట్లాడటమో, లేదా పద్ధతిగా చెప్పడమో చూస్తుంటాం. కానీ మెటా మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన, కాస్త విచిత్రమైన వ్యూహాన్ని ఎంచుకుంది. మొదట ఉద్యోగులందరికీ ఆఫీసులకు రానవసరం లేదని, హ్యాపీగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలని పురమాయించింది. అబ్బా.. కంపెనీ ఎంత మంచిదో అని ఉద్యోగులు మురిసిపోయేలోపే అసలు షాక్ ఇచ్చింది.

అమెరికా, బ్రిటన్, సింగపూర్ వంటి దేశాల్లోని వేర్వేరు టైమ్ జోన్లను లెక్కగట్టి.. ఉద్యోగులు నిద్ర లేచే సమయానికల్లా వారి వ్యక్తిగత ఈమెయిల్ ఐడీలకు పింక్ స్లిప్స్ పంపేసింది. సింగపూర్ హబ్ విషయానికొస్తే.. తెల్లవారుజామున సరిగ్గా 4 గంటలకు ఉద్యోగుల ఫోన్లు యు ఆర్ ఫైర్డ్ అనే మెయిల్స్ తో మోగాయి. నిద్రమత్తులో లేచి మెయిల్ చూసుకున్న ఉద్యోగులకు ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయింది. ఈ దెబ్బకు మెటా తన మొత్తం సిబ్బందిలో ఏకంగా 10 శాతం మందిని.. అంటే సుమారు 8,000 మంది ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా ఇంటికి సాగనంపింది. ఈ లేఆఫ్స్ కు ముందు సంస్థలో 78,000 మంది పనిచేస్తుండగా, తాజా కోతలతో ఆ సంఖ్య భారీగా పడిపోయింది.

అయితే మెటా కేవలం ఉద్యోగులను తీసేయడమే కాదు, లోపల ఉన్న ఊడ్చేసి సరికొత్తగా రీ-డిజైన్ చేస్తోంది. మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ పంపిన అంతర్గత సమాచారం ప్రకారం.. సంస్థాగతంగా పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. దాదాపు 6,000 ఖాళీ పోస్టులను శాశ్వతంగా రద్దు చేయడమే కాకుండా, మేనేజర్ల స్థాయిలను భారీగా తగ్గించేశారు. కంపెనీని మరింత వేగంగా, తక్కువ మందితో, అత్యంత సమర్థవంతంగా నడిపించడమే తమ లక్ష్యమని సంస్థ ప్రకటించింది. ఈ లేఆఫ్స్ దెబ్బ ఎక్కువగా ఇంజనీరింగ్, ప్రొడక్ట్ విభాగాలపై పడింది.

మరి ఇంత మందిని తీసేసి మెటా ఏం చేయబోతోంది? దీని వెనుక ఉన్న అసలు మాస్టర్ ప్లాన్ ఏంటి? అంటే.. సమాధానం ఒక్కటే.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రస్తుతం మెటా అధినేత మార్క్ జుకర్‌బర్గ్ మైండ్ అంతా ఏఐ సాంకేతికత చుట్టూనే తిరుగుతోంది. అందుకే సాధారణ ఉద్యోగులను తగ్గించి, ఏఐకి పెద్దపీట వేస్తున్నారు. ఇందులో భాగంగానే మరో 7,000 మంది పాత ఉద్యోగులను కొత్తగా ఏర్పాటు చేసిన ఏఐ-నేటివ్ బృందాల్లోకి బదిలీ చేస్తున్నారు. అంతేకాదు, ఈ ఏడాది కేవలం ఏఐ సాంకేతికత అభివృద్ధి కోసమే మెటా ఏకంగా 125 నుండి 145 బిలియన్ డాలర్ల భారీ బడ్జెట్‌ను కేటాయించింది. ఉద్యోగుల జీతాలు కట్ చేసి.. ఆ డబ్బును రోబోలు, ఏఐ టెక్నాలజీపై కుమ్మరిస్తున్న జుకర్‌బర్గ్ వ్యూహం ఎలాంటి ఫలితాలనిస్తుందో చూడాలి. కానీ, అర్ధరాత్రి వేళ మెటా పంపిన ఈ లేఆఫ్ ఈమెయిల్స్ మాత్రం బాధితులకు జీవితాంతం గుర్తిండిపోయే చేదు జ్ఞాపకంగా మిగిలిపోతాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story