Medicines: కేంద్ర ప్రభుత్వ కఠిన నిర్ణయం.. ఇకపై ఈ మందులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే
Medicines: కొన్ని ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
Medicines: కేంద్ర ప్రభుత్వ కఠిన నిర్ణయం.. ఇకపై ఈ మందులకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉండాల్సిందే
Medicines: కొన్ని ఔషధాల దుర్వినియోగాన్ని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 12 శాతానికి మించి ఇథైల్ ఆల్కహాల్ ఉన్న కొన్ని సిరప్‌లు, టానిక్‌లను వైద్యుడి ప్రిస్క్రిప్షన్ ఉంటేనే విక్రయించాలి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమల్లోకి తీసుకొచ్చింది.
ఏ మందులపై కొత్త నిబంధనలు వర్తిస్తాయి?
కొత్త మార్గదర్శకాల ప్రకారం, 12 శాతానికి పైగా ఇథైల్ ఆల్కహాల్ కలిగి, 30 మిల్లీలీటర్ల కంటే ఎక్కువ పరిమాణంలో విక్రయించే సిరప్‌లు, టానిక్‌లు ఇకపై షెడ్యూల్ H1 కేటగిరీలోకి వస్తాయి. అంటే ఈ మందులను ఎవరైనా నేరుగా కొనుగోలు చేయలేరు. రిజిస్టర్డ్ వైద్యుడు ఇచ్చిన చెల్లుబాటు అయ్యే ప్రిస్క్రిప్షన్ ఉంటేనే మెడికల్ షాపులు వాటిని విక్రయించాల్సి ఉంటుంది.
ప్రభుత్వం ఈ నిర్ణయం ఎందుకు తీసుకుంది?
కొన్ని దగ్గు సిరప్‌లు, టానిక్‌లలో ఆల్కహాల్ శాతం అధికంగా ఉండటంతో వాటిని చికిత్స కోసం కాకుండా మత్తు కోసం ఉపయోగిస్తున్నట్లు పలు రాష్ట్రాల నుంచి కేంద్రానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ అంశాన్ని పరిశీలించిన డ్రగ్స్ టెక్నికల్ అడ్వైజరీ బోర్డ్ (DTAB), డ్రగ్స్ కన్సల్టేటివ్ కమిటీ (DCC) కఠిన నియంత్రణలు అవసరమని సిఫార్సు చేశాయి. వాటి సూచనల మేరకే కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
మెడికల్ షాపులకు కొత్త బాధ్యతలు
ఈ మందులను విక్రయించే ప్రతి మెడికల్ షాప్ కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ప్రతి విక్రయానికి సంబంధించిన వివరాలను ప్రత్యేక రిజిస్టర్‌లో నమోదు చేయాలి. అలాగే రోగి సమర్పించిన ప్రిస్క్రిప్షన్ కాపీతో పాటు విక్రయ వివరాలను కనీసం మూడు సంవత్సరాల పాటు భద్రపరచాలి. డ్రగ్స్ కంట్రోల్ అధికారులు తనిఖీలు నిర్వహించినప్పుడు ఈ రికార్డులను చూపించాల్సి ఉంటుంది.
రోగులకు ఇబ్బందులు ఉండవా?
ఈ కొత్త నిబంధనల వల్ల నిజంగా వైద్య అవసరాల కోసం ఈ మందులు ఉపయోగించే రోగులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. చెల్లుబాటు అయ్యే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ఉంటే ఎప్పటిలాగే మందులు అందుబాటులో ఉంటాయి. అయితే, ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆల్కహాల్ అధికంగా ఉన్న మందులను కొనుగోలు చేసే అవకాశం ఇకపై ఉండదు. ఈ చర్యతో మందుల దుర్వినియోగాన్ని తగ్గించి, ప్రజారోగ్యాన్ని మరింత మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.




