Layoffs: మీ సేవలు ఇక చాలు.. తట్టా బుట్టా సర్దుకోండి.. మరో 8,000 మంది ఉద్యోగులపై వేటు

Layoffs: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోసం మెటా సంస్థ 8,000 మంది ఉద్యోగులపై వేటు వేసింది.

Naresh.k
Published on: 13 May 2026 11:59 AM IST
Layoffs
X

Layoffs: మీ సేవలు ఇక చాలు.. తట్టా బుట్టా సర్దుకోండి.. మరో 8,000 మంది ఉద్యోగులపై వేటు

Meta Layoffs: సోషల్ మీడియా దిగ్గజం మెటా తన సంస్థాగత నిర్మాణంలో భారీ మార్పులు చేస్తోంది. పెరుగుతున్న పోటీని తట్టుకునేందుకు, ముఖ్యంగా ఏఐ రంగంలో పట్టు సాధించేందుకు కంపెనీ తన ఖర్చులను తగ్గించుకోవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా పనిచేస్తున్న ఉద్యోగుల్లో 10 శాతం మందిని, అంటే సుమారు 8,000 మందిని తొలగించడానికి రెడీ అయింది.

ఈ లేఆఫ్స్ ప్రక్రియ మే 20 నుంచి అధికారికంగా ప్రారంభం కానుంది. కేవలం ఉద్యోగులను తొలగించడమే కాకుండా, కొత్తగా చేపట్టాల్సిన 6,000 పోస్టుల నియామకాలను కూడా మెటా రద్దు చేసింది. కృత్రిమ మేధ ఆధారిత కార్యకలాపాలకు ప్రాధాన్యత ఇస్తూ, సంస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దడమే కంపెనీ లక్ష్యం. ఉద్యోగం కోల్పోయిన వారికి మెటా కొంతవరకు మానవీయ కోణంలో సహాయం చేస్తోంది. ప్రభావితమైన ఉద్యోగులకు నిర్దేశించిన కాలానికి జీతాల చెల్లింపుతో పాటు, వారి కుటుంబ సభ్యులకు 18 నెలల పాటు ఆరోగ్య బీమా వంటి ప్రయోజనాలను అందించనున్నట్లు మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ వెల్లడించారు.

ఈ మేరకు ఉద్యోగులకు ఇప్పటికే అంతర్గత మెమోలు పంపారు. మెటా తీసుకున్న ఈ నిర్ణయం భారత్‌లోని ఐటీ నిపుణులను కలవరానికి గురిచేస్తోంది. దేశీయంగా మెటాకు ఉన్న ఇంజినీరింగ్, ఆపరేషన్స్ , కంటెంట్ మోడరేషన్ విభాగాల్లోని వందలాది మంది ఉద్యోగులు ఈ లేఆఫ్స్ బారిన పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

టెక్ రంగంలో ఏఐ విప్లవం వస్తున్న తరుణంలో కంపెనీలు తమ ప్రాధాన్యతలను మార్చుకుంటున్నాయి. మానవ వనరుల కంటే సాంకేతికతకే ఎక్కువ మొగ్గు చూపుతుండటంతో టెక్ నిపుణులలో ఆందోళన నెలకొంది. మెటా తన ఇయర్ ఆఫ్ ఎఫిషియన్సీని కొనసాగిస్తూ తీసుకున్న ఈ నిర్ణయం భవిష్యత్తులో ఇంకెన్ని మార్పులకు దారితీస్తుందో చూడాలి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story