Gas Cylinder : మూడు నెలల్లోగా మారాల్సిందే.. గ్యాస్ వినియోగదారులకు కేంద్రం డెడ్ లైన్

Gas Cylinder : ప్రభుత్వం ఎల్‌పీజీ సిలిండర్ల స్థానంలో పీఎన్‌జీ వాడకాన్ని తప్పనిసరి చేస్తోంది. పీఎన్‌జీ కనెక్షన్ తీసుకునే వారికి డిపాజిట్ రద్దుతో పాటు రూ. 500 ఉచిత గ్యాస్ అందిస్తోంది.

CR Reddy
Published on: 27 March 2026 9:34 AM IST
Gas Cylinder
X

Gas Cylinder

Gas Cylinder : మన వంటింట్లో వాడే గ్యాస్ సిలిండర్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎల్‌పీజీ సిలిండర్ల మోతకు స్వస్తి పలికి, పైపుల ద్వారా వచ్చే గ్యాస్ వైపు మళ్లాలని కస్టమర్లను కోరుతోంది. ముఖ్యంగా మీ ఏరియాలో పైప్‌లైన్ గ్యాస్ కనెక్షన్ అందుబాటులో ఉంటే, మీరు ఖచ్చితంగా ఆ కనెక్షన్ తీసుకోవాలని, ఇందుకోసం మూడు నెలల గడువు కూడా విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

ఏమిటి ఈ కొత్త రూల్? ఎందుకు మారాలి?

దేశవ్యాప్తంగా ఇంధన వినియోగంలో ఆధునికతను తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగానే పర్యావరణానికి మేలు చేసే, సురక్షితమైన పైపుడ్ నేచురల్ గ్యాస్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఎక్కడైతే గ్యాస్ పైప్‌లైన్ మౌలిక సదుపాయాలు పూర్తయ్యాయో, ఆ ప్రాంతాల్లోని ఎల్‌పీజీ కస్టమర్లు తప్పనిసరిగా పీఎన్‌జీకి మారాలని పెట్రోలియం శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ వెల్లడించారు. ఇందుకోసం వినియోగదారులకు 3 నెలల సమయం ఇస్తున్నట్లు, సంబంధిత కస్టమర్లకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా సమాచారం అందిస్తామని ఆమె పేర్కొన్నారు. ఇప్పటికే సుమారు 2.2 లక్షల మంది పైపుడ్ గ్యాస్ కనెక్షన్‌కు మారిపోయారు.

ప్రభుత్వం ఇస్తున్న భారీ రాయితీలు

వినియోగదారులు సిలిండర్ వదిలి పైపుడ్ గ్యాస్‌కు మారడానికి ప్రభుత్వం ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తోంది. కొత్తగా పీఎన్‌జీ కనెక్షన్ తీసుకునే వారు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించాల్సిన అవసరం లేదు. దీనిని పూర్తిగా రద్దు చేశారు. అంతటితో ఆగకుండా, మీరు కనెక్షన్ తీసుకున్న తర్వాత వచ్చే మొదటి గ్యాస్ బిల్లులో రూ.500 వరకు ఉచితంగా అందిస్తున్నారు. అంటే తొలి నెలలో మీరు వాడే గ్యాస్ దాదాపు ఫ్రీ అన్నమాట. ఢిల్లీ వంటి నగరాల్లో రోడ్డు పునరుద్ధరణ ఛార్జీలను కూడా మాఫీ చేయడంతో పాటు, కేవలం 24 గంటల్లోనే కనెక్షన్ ఇచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారు.

ఎల్‌పీజీ కంటే పీఎన్‌జీ ఎందుకు బెస్ట్?

పీఎన్‌జీ వాడకం వల్ల మీకు ఆర్థికంగానే కాకుండా సౌకర్యం పరంగా కూడా చాలా లాభాలు ఉన్నాయి. ఎల్‌పీజీ సిలిండర్‌తో పోలిస్తే పీఎన్‌జీ ధర దాదాపు 10 శాతం నుంచి 15 శాతం వరకు తక్కువగా ఉంటుంది. భద్రత పరంగా చూస్తే, పైపుల ద్వారా వచ్చే గ్యాస్ తక్కువ ఒత్తిడితో సరఫరా అవుతుంది కాబట్టి ప్రమాదాల భయం ఉండదు. ఇక సిలిండర్ అయిపోతుందనే టెన్షన్ లేదు, బుకింగ్ చేయాల్సిన పని లేదు. కరెంటు లాగే 24 గంటలు గ్యాస్ అందుబాటులో ఉంటుంది. మీరు ఎంత వాడుకుంటే అంతకే బిల్లు వస్తుంది. దాన్ని ఫోన్ పే, గూగుల్ పే వంటి యాప్స్ ద్వారా సులభంగా కట్టుకోవచ్చు.

సిలిండర్ల కొరత ఉందా? ప్రభుత్వం ఏమంటోంది?

మరోవైపు, సోషల్ మీడియాలో ఎల్‌పీజీ సిలిండర్ల కొరత ఏర్పడిందని వస్తున్న వార్తలను ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని సుజాత శర్మ స్పష్టం చేశారు. కేవలం పర్యావరణ హితం కోసం, వినియోగదారుల సౌకర్యం కోసమే పీఎన్‌జీని ప్రోత్సహిస్తున్నామని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె భరోసా ఇచ్చారు. వదంతులు నమ్మి కంగారు పడవద్దని, సరఫరా యధావిధిగా కొనసాగుతుందని వివరించారు.

CR Reddy

CR Reddy

Next Story