LPG Connection Alert : గ్యాస్ కంపెనీల మాస్టర్ ప్లాన్.. అలాంటి వారి కనెక్షన్ కట్

LPG Connection Alert : తొమ్మిది నెలలుగా సిలిండర్ బుక్ చేయని గ్యాస్ కనెక్షన్లు సస్పెండ్ అవుతాయి. మీ ఎల్పీజీ కనెక్షన్ తిరిగి పొందడానికి కేవైసీ ఎలా పూర్తి చేయాలో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానాలు తెలుసుకుందాం.

CR Reddy
Published on: 26 March 2026 8:02 AM IST
Gas Cylinder
X

 Gas Cylinder

LPG Connection Alert : ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, ముఖ్యంగా గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం సామాన్యుడి వంటగదిపై ప్రభావం చూపుతోంది. ఎల్పీజీ సరఫరాలో తలెత్తే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం గ్యాస్ వినియోగంపై నిఘాను కఠినతరం చేసింది. ఇందులో భాగంగా గ్యాస్ ఏజెన్సీలు కొత్త నిబంధనలను అమల్లోకి తెచ్చాయి. చాలా కాలంగా గ్యాస్ సిలిండర్లు బుక్ చేయని వినియోగదారుల కనెక్షన్లు కట్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. అసలు ఎవరి కనెక్షన్లు ఆగిపోతాయి? వాటిని మళ్ళీ ఎలా యాక్టివేట్ చేసుకోవాలో వివరంగా తెలుసుకుందాం.

ఎవరి కనెక్షన్లు సస్పెండ్ అవుతాయి?

గ్యాస్ కంపెనీల తాజా నిబంధనల ప్రకారం.. ఎవరైతే వరుసగా తొమ్మిది నెలలు అంతకంటే ఎక్కువ కాలం పాటు ఒక్క సిలిండర్ కూడా బుక్ చేయలేదో, అటువంటి కనెక్షన్లను సస్పెండెడ్ కేటగిరీలోకి మారుస్తున్నారు. నకిలీ కనెక్షన్లను ఏరివేయడానికి, అలాగే అర్హులైన యాక్టివ్ వినియోగదారులకు మాత్రమే సబ్సిడీ ప్రయోజనాలు అందేలా చూడటానికి ఈ నిర్ణయం తీసుకున్నారు. వనరుల కొరత ఉన్న ప్రస్తుత సమయంలో నిష్క్రియ కనెక్షన్ల వల్ల కంపెనీలకు భారం పెరుగుతోందని, అందుకే ఈ కఠిన చర్యలు చేపడుతున్నారు. ఒకవేళ మీ కనెక్షన్ గనుక ఈ జాబితాలో ఉంటే, మీరు వెంటనే స్పందించాల్సి ఉంటుంది.

కనెక్షన్‌ను తిరిగి పొందడం ఎలా?

ఒకవేళ మీ గ్యాస్ కనెక్షన్ నిష్క్రియంగా మారితే కంగారు పడాల్సిన పనిలేదు. మీరు మీ కేవైసీ ప్రక్రియను పూర్తి చేయడం ద్వారా దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేసుకోవచ్చు. దీని కోసం మీరు నేరుగా మీ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లాలి. అక్కడ కేవైసీ ఫారమ్‌ను నింపి, దానితో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, బ్యాంక్ పాస్‌బుక్ కాపీని అందజేయాలి. అక్కడ మీ వేలిముద్ర లేదా ఫేస్ రికగ్నిషన్ ద్వారా ధృవీకరణ చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తయిన 24 నుంచి 48 గంటల లోపు మీ కనెక్షన్ తిరిగి పనిచేయడం ప్రారంభిస్తుంది.

ఇంటి నుంచే ఆన్‌లైన్‌లో కేవైసీ అప్‌డేట్

ఏజెన్సీల చుట్టూ తిరిగే పని లేకుండా, మీరు ఇంట్లోనే కూర్చుని ఆన్‌లైన్ ద్వారా కూడా ఈ పనిని పూర్తి చేయవచ్చు. ఇండేన్, హెచ్‌పీ , లేదా భారత్ గ్యాస్ వినియోగదారులు వారి అధికారిక వెబ్‌సైట్‌లు లేదా మొబైల్ యాప్‌ల ద్వారా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. వెబ్‌సైట్‌లో KYC Update విభాగానికి వెళ్లి, మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చే ఓటీపీ ద్వారా వివరాలను ధృవీకరించుకోవాలి. ఈ పద్ధతి చాలా సులభం, వేగంగా పూర్తవుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నవారు లేదా ఉద్యోగస్తులకు ఇది ఒక గొప్ప అవకాశం.

UMANG యాప్ ద్వారా కూడా..

కేంద్ర ప్రభుత్వానికి చెందిన UMANG యాప్ ద్వారా కూడా మీరు గ్యాస్ కేవైసీని పూర్తి చేయవచ్చు. ముందుగా యాప్‌లో లాగిన్ అయ్యి, ఇండియన్ ఆయిల్ సర్వీసెస్ లేదా మీ సంబంధిత గ్యాస్ కంపెనీని ఎంచుకోవాలి. అక్కడ eKYC అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ మొబైల్ నంబర్, MPIN ద్వారా వివరాలను నమోదు చేయాలి. అక్కడ అడిగిన సూచనల ప్రకారం ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే మీ ఆన్‌లైన్ దరఖాస్తు సబ్మిట్ అవుతుంది. ఇది పూర్తైన వెంటనే మీ కనెక్షన్ యాక్టివ్ మోడ్‌లోకి వస్తుంది.

CR Reddy

CR Reddy

Next Story