Loan: లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. మిగతా ఈఎంఐల ప‌రిస్థితి ఏంటి.?

Loan: బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ తర్వాత రుణం పరిస్థితి ఏంటనే సందేహం చాలా మందిలో ఉంటుంది.

Mokshith
Published on: 17 Aug 2026 1:52 PM IST
Loan
X

Loan: లోన్ తీసుకున్న వ్యక్తి మరణిస్తే.. మిగతా ఈఎంఐల ప‌రిస్థితి ఏంటి.?

Loan: బ్యాంకు నుంచి రుణం తీసుకున్న వ్యక్తి అనుకోకుండా మరణిస్తే ఆ తర్వాత రుణం పరిస్థితి ఏంటనే సందేహం చాలా మందిలో ఉంటుంది. మిగిలిన ఈఎంఐలను కుటుంబ సభ్యులు చెల్లించాలా? బ్యాంకు రుణాన్ని మాఫీ చేస్తుందా? లేక ఆస్తిని స్వాధీనం చేసుకుంటుందా?

క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్ల పరిస్థితి

క్రెడిట్ కార్డు బకాయిలు, చాలా పర్సనల్ లోన్లు ఎలాంటి తాకట్టు లేకుండా ఇచ్చే రుణాలు. రుణగ్రహీత మరణించిన తర్వాత కుటుంబ సభ్యులు ఆ బకాయిలు చెల్లించాల్సిన చట్టపరమైన బాధ్యత సాధారణంగా ఉండదు. అయితే లోన్‌కు గ్యారెంటర్ లేదా కో-అప్లికెంట్ ఉంటే, ఒప్పందంలోని షరతుల ప్రకారం వారికి బాధ్యత రావచ్చు. అలాగే మరణించిన వ్యక్తి పేరుపై అదే బ్యాంకులో డిపాజిట్లు లేదా పొదుపు ఖాతాల్లో నిధులు ఉంటే, చట్టబద్ధమైన ప్రక్రియ ద్వారా బ్యాంకు బకాయిలను సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుంది.

హోమ్ లోన్, వాహన లోన్లలో ఏమవుతుంది?

ఇల్లు, వాహన రుణాలు తాకట్టు ఆధారంగా ఇచ్చే సెక్యూర్డ్ లోన్లు. రుణగ్రహీత మరణిస్తే ముందుగా కో-అప్లికెంట్ లేదా సహ రుణగ్రహీతను బ్యాంకు సంప్రదిస్తుంది. వారు చెల్లించలేని పరిస్థితిలో గ్యారెంటర్‌పై బాధ్యత పడుతుంది. ఒకవేళ లోన్‌తో పాటు ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే, పాలసీ నిబంధనలకు అనుగుణంగా బీమా సంస్థ మిగిలిన రుణాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. దీంతో కుటుంబానికి అదనపు ఆర్థిక భారం తప్పుతుంది.

బీమా లేకపోతే బ్యాంకు చర్యలు

రుణ బకాయిలు చెల్లించకపోతే బ్యాంకు ముందుగా నోటీసులు జారీ చేస్తుంది. అయినప్పటికీ బకాయి చెల్లించకపోతే, నిబంధనల ప్రకారం రుణ ఖాతాను నిరర్థక ఆస్తి (ఎన్‌పీఏ)గా ప్రకటించవచ్చు. అనంతరం సర్ఫేసీ చట్టం ప్రకారం తాకట్టు పెట్టిన ఆస్తిని స్వాధీనం చేసుకుని, అవసరమైతే వేలం వేసి బకాయిలను రికవరీ చేసుకునే హక్కు బ్యాంకుకు ఉంటుంది.

ఆర్బీఐ నిబంధనలు తెలుసుకోవాల్సిందే

రిజర్వ్ బ్యాంక్ మార్గదర్శకాల ప్రకారం రుణగ్రహీత మరణించిన తర్వాత కుటుంబ సభ్యులను అక్రమంగా వేధించడం లేదా ఒత్తిడి చేయడం బ్యాంకులు, రికవరీ ఏజెంట్లకు అనుమ‌తి ఉండ‌దు. ప్రతి రుణానికి ఒకే నిబంధన వర్తించదు. లోన్ రకం, కో-అప్లికెంట్, గ్యారెంటర్, తాకట్టు, ఇన్సూరెన్స్ వంటి అంశాల ఆధారంగా బాధ్యతలు నిర్ణ‌యిస్తారు. అందుకే రుణం తీసుకునే సమయంలో ఒప్పందంలోని ప్రతి షరతును జాగ్రత్తగా చదవడం, సాధ్యమైనంత వరకు లోన్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మంచిది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story