Lic: సరికొత్త చరిత్ర సృష్టించిన ఎల్‌ఐసీ

Lic: భారత ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.23,420 కోట్ల నికర లాభంతో సరికొత్త రికార్డు సృష్టించింది.

Naresh.k
Published on: 25 May 2026 11:05 AM IST
Lic
X

Lic: సరికొత్త చరిత్ర సృష్టించిన ఎల్‌ఐసీ

Q4 Net Profits: భారత ప్రభుత్వరంగ బీమా దిగ్గజం లైఫ్‌ ఇన్సూరెన్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా దేశీయ కార్పొరేట్ చరిత్రలోనే సరికొత్త రికార్డును లిఖించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో ఎల్‌ఐసీ లాభాల పంట పండించింది. అటు ప్రభుత్వరంగ సంస్థలలోనే కాకుండా, ఇటు దేశీయ ఫైనాన్షియల్ సెక్టార్‌లోనే ఒకే ఒక్క త్రైమాసికంలో అత్యధిక లాభాలు గడించిన నంబర్ వన్ కంపెనీగా ఎల్‌ఐసీ సరికొత్త అవతారమెత్తింది.

క్యూ4లో 23 శాతం లాభాల వృద్ధి

గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో ఎల్‌ఐసీ ఏకంగా 23,420 కోట్ల రూపాయల భారీ నికర లాభాన్ని ఆర్జించింది. అంతకుముందు ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన 19,013 కోట్ల రూపాయల లాభంతో పోలిస్తే.. ఇది ఏకంగా 23 శాతం వృద్ధి కావడం విశేషం. ఎల్‌ఐసీ కనబరిచిన ఈ అద్భుతమైన ప్రదర్శనతో మార్కెట్ విశ్లేషకులు సైతం ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా త్రైమాసిక లాభాల రేసులో ఎప్పుడూ దేశీయ బ్యాంకింగ్ దిగ్గజాలైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకుల మధ్యే ప్రధాన పోటీ నెలకొంటుంది. కానీ ఈసారి క్యూ4లో ఎల్‌ఐసీ ఆ రెండు బ్యాంకింగ్ దిగ్గజాలకు భారీ షాక్ ఇస్తూ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ రేసులో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 19,684 కోట్ల రూపాయల నికర లాభంతో రెండో స్థానంలో నిలవగా.. ప్రైవేట్ రంగ బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 19,221 కోట్ల రూపాయల నికర లాభంతో ఎల్‌ఐసీ తర్వాతి స్థానాల్లో నిలిచాయి.

ఎస్‌బీఐదే హవా

ఒక్క త్రైమాసిక (క్యూ4) లాభాల పరంగా ఎల్‌ఐసీ నంబర్ వన్‌గా నిలిచినప్పటికీ.. పూర్తి ఆర్థిక సంవత్సర వార్షిక లాభాల పరంగా మాత్రం బ్యాంకింగ్ దిగ్గజాలు తమ ఆధిక్యాన్ని నిలబెట్టుకున్నాయి. పూర్తి ఏడాదికి ఎల్‌ఐసీ 57,419 కోట్ల రూపాయల నికర లాభాన్ని నమోదు చేయగా.. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏకంగా 80,032 కోట్ల రూపాయల వార్షిక లాభంతో దేశంలోనే అగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. అలాగే హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 74,670 కోట్ల రూపాయల వార్షిక లాభాలతో రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది. ఈ క్రమంలో పూర్తి ఏడాది లాభాల్లో ఎల్‌ఐసీ మూడో స్థానానికి పరిమితమైంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story