IPO: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్
IPO: న్యాక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ ఐపీఓ జులై 1, 2026 నుండి ప్రారంభం కానుంది.
IPO: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అదిరిపోయే గుడ్ న్యూస్
Knack Packaging IPO: స్టాక్ మార్కెట్ ద్వారా తక్కువ సమయంలోనే లాభాలు సొంతం చేసుకోవాలని చూస్తున్న ఇన్వెస్టర్లకు మరో మంచి అవకాశం అందుబాటులోకి రాబోతోంది. ప్రస్తుతం మార్కెట్‌లో కొంత అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లను ఆకట్టుకునేందుకు ప్యాకేజింగ్ రంగంలోని ఒక ప్రముఖ కంపెనీ తన తొలి పబ్లిక్ ఇష్యూతో మన ముందుకు వస్తోంది. అదే న్యాక్ ప్యాకేజింగ్ లిమిటెడ్. ప్రాథమిక మార్కెట్ నుంచి దాదాపు రూ.440 కోట్లు సమీకరించడమే లక్ష్యంగా వస్తున్న ఈ ఐపీఓకు సంబంధించిన తేదీలు, షేరు ధర, కనీస పెట్టుబడి వంటి ఆసక్తికరమైన పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
ప్యాకేజింగ్ సొల్యూషన్స్ అందించడంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న న్యాక్ ప్యాకేజింగ్ లిమిటెడ్ ఐపీఓ వచ్చే వారం, అంటే జులై 1, 2026 నుంచి ప్రారంభం కానుంది. ఈ సబ్‌స్క్రిప్షన్ ప్రక్రియ జులై 3, 2026 వరకు కొనసాగుతుంది. అయితే సాధారణ ఇన్వెస్టర్ల కంటే ఒక రోజు ముందుగానే, అంటే జూన్ 30వ తేదీనే యాంకర్ ఇన్వెస్టర్ల కోసం బిడ్డింగ్ విండో తెరుచుకోనుంది.
ఈ పబ్లిక్ ఇష్యూ కోసం కంపెనీ ఒక్కో షేరు ధరను రూ.161 నుంచి రూ.170గా నిర్ణయించింది. గరిష్ఠ ధర అయిన రూ.170 వద్ద కంపెనీ మొత్తం రూ.440 కోట్లను మార్కెట్ నుంచి సేకరించనుంది. ఈ ఇష్యూ ద్వారా కంపెనీ మొత్తం మార్కెట్ విలువ దాదాపు రూ.2080 కోట్లుగా ఉండబోతోంది. కంపెనీ తీసుకువస్తున్న ఈ రూ.440 కోట్ల ఇష్యూలో రెండు భాగాలు ఉన్నాయి.
మొదటిది, ఫ్రెష్ ఇష్యూ ద్వారా రూ.380 కోట్ల విలువైన సరికొత్త షేర్లను కంపెనీ జారీ చేస్తోంది.రెండవది, ఆఫర్ ఫర్ సే ద్వారా కంపెనీకి చెందిన ప్రస్తుత వాటాదారులు రూ.58.5 కోట్ల విలువైన తమ పాత షేర్లను విక్రయానికి ఉంచుతున్నారు. ఈ రెండు కలిపి మొత్తంగా రూ.439.5 కోట్ల విలువైన షేర్లు ఇన్వెస్టర్లకు అందుబాటులో ఉంటాయి.
సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లు ఈ ఐపీఓలో పాల్గొనాలంటే కనీసం ఒక లాట్ కు బిడ్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఒక లాట్ లో 88 షేర్లు ఉంటాయి. అంటే, గరిష్ఠ ధర రూ.170 చొప్పున లెక్కగడితే ఒక లాట్ కోసం ఇన్వెస్టర్లు కనీసం రూ.14,960 పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ఇక కేటాయింపుల విషయానికి వస్తే.. మొత్తం షేర్లలో 50 శాతం షేర్లను క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు, 15 శాతం షేర్లను నాన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లకు మిగిలిన 35 శాతం షేర్లను సాధారణ రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయించారు.
ఐపీఓ ప్రక్రియ అంతా ముగిసిన తర్వాత, జులై 8, 2026వ తేదీన ఈ కంపెనీ షేర్లు స్టాక్ మార్కెట్లో అధికారికంగా లిస్టింగ్ కానున్నాయి. ఈ ఇష్యూకు సిస్టమాటిక్స్ కార్పొరేట్ సర్వీసెస్, ఐడీబీఐ క్యాపిటల్, పాంటో మ్యాథ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంస్థలు లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఫ్రెష్ ఇష్యూ ద్వారా సేకరించిన నిధులను కంపెనీ తన కొత్త తయారీ కేంద్రాలలో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు, అలాగే మిగిలిన మొత్తాన్ని కంపెనీ రోజువారీ సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నట్లు స్పష్టం చేసింది.
అహ్మదాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న న్యాక్ ప్యాకేజింగ్ కంపెనీ ప్యాకేజింగ్ రంగంలో లీడర్‌గా ఎదుగుతోంది. ఈ సంస్థ ముఖ్యంగా ప్రింటెడ్ , లామినేటెడ్ వోవెన్ పాలిప్రోఫైలిన్ బ్యాగులు, అలాగే పీఎల్ డబ్ల్యూపీపీ పించ్ బాటమ్ బ్యాగుల తయారీలో ప్రత్యేకత కలిగి ఉంది. ప్యాకేజింగ్ రంగానికి మార్కెట్లో ఎప్పుడూ మంచి డిమాండ్ ఉంటుంది కాబట్టి, లిస్టింగ్ గెయిన్స్ ఆశించే ఇన్వెస్టర్లకు ఇది ఒక మంచి ఆప్షన్‌గా నిలిచే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు.




