Jio : అంబానీయా మజాకా.. రూ.30,000 కోట్ల లాభంతో సరికొత్త రికార్డు..!

Jio : రిలయన్స్ జియో రూ.30,000 కోట్ల నికర లాభంతో సరికొత్త చరిత్ర సృష్టించింది.

Naresh.k
Published on: 20 Jun 2026 8:43 AM IST
Jio
X

Jio : అంబానీయా మజాకా.. రూ.30,000 కోట్ల లాభంతో సరికొత్త రికార్డు..!

Akash Ambani : భారతీయ టెలికాం రంగంలో మునుపెన్నడూ లేని విధంగా రిలయన్స్ జియో సరికొత్త చరిత్ర సృష్టించింది. కేవలం ఒక నెట్‌వర్క్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించి, నేడు గ్లోబల్ డిజిటల్ లీడర్‌గా దూసుకుపోతోంది. శనివారం జరిగిన రిలయన్స్ 49వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్ ఆకాష్ అంబానీ ప్రకటించిన వివరాలు షేర్‌హోల్డర్లలో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలో జియో ఏకంగా రూ. 30,000 కోట్ల నికర లాభాన్ని ఆర్జించి, సరికొత్త మైలురాయిని అందుకుంది.

దేశంలో జియో హవా ఏ రేంజ్‌లో ఉందో చెప్పడానికి ఈ గణాంకాలే నిదర్శనం. ప్రస్తుతం జియో నెట్‌వర్క్‌ను వినియోగిస్తున్న వారి సంఖ్య 52.4 కోట్లకు చేరింది. దేశంలోనే అత్యంత పెద్ద టెలికాం ఆపరేటర్‌గా జియో తన అగ్రస్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. చైనా వెలుపల, ఒకే దేశంలో అత్యంత వేగంగా, భారీ స్థాయిలో 5G సేవలను విస్తరించిన ఏకైక గ్లోబల్ ఆపరేటర్‌గా జియో సరికొత్త రికార్డు సృష్టించింది. భారతదేశాన్ని వంద శాతం 5G దేశంగా మార్చడమే తమ అంతిమ లక్ష్యమని ఆకాష్ అంబానీ స్పష్టం చేశారు. ఇందుకోసం 2030 నాటికి జియో కస్టమర్లందరినీ పూర్తిగా 5G నెట్‌వర్క్‌కు మార్చనున్నట్లు ప్రకటించారు.

ప్రస్తుతం జియో 5G వినియోగదారుల సంఖ్య 26.8 కోట్లకు చేరింది. గత ఏడాది కాలంలోనే కొత్తగా 7.7 కోట్ల మంది 5G క్లబ్‌లోకి చేరారు. జియో నెట్‌వర్క్‌లో ఒక్కో యూజర్ సగటున నెలకు 42.3 GB డేటాను వాడుతున్నారు. ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగం జరుగుతున్న నెట్‌వర్క్‌లలో జియో ఒకటిగా నిలిచింది. భారతదేశంలోని ప్రతి మూలకూ హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను తీసుకెళ్లేందుకు జియో ఎయిర్‌ఫైబర్ రాకెట్ వేగంతో దూసుకుపోతోంది. ఇప్పటివరకు 1.3 కోట్లకు పైగా ఇళ్లకు జియో ఎయిర్‌ఫైబర్ కనెక్టివిటీ లభించింది. ప్రస్తుతం ఈ నెట్‌వర్క్ ఎంత వేగంగా విస్తరిస్తోందంటే.. ప్రతిరోజూ సగటున 60,000 కొత్త ఇళ్లు ఈ సేవల పరిధిలోకి వస్తున్నాయి.

భారతీయ కార్పొరేట్ సంస్థలతో పాటు, దేశంలోని చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపారాలను డిజిటలైజ్ చేయడమే జియో మూడవ ప్రాధాన్యత అని ఆకాష్ అంబానీ తెలిపారు. దీనికి తోడు, కస్టమర్లకు మరింత స్మార్ట్, పర్సనలైజ్డ్ అనుభవాన్ని అందించడానికి జియో అప్పుడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను రంగంలోకి దించింది.

ఒకప్పుడు కేవలం వాయిస్ కాల్స్, డేటా అందించే సంస్థగా ప్రయాణం మొదలుపెట్టిన జియో.. నేడు సరిహద్దులు దాటి గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజంగా రూపాంతరం చెందుతోంది. ఆకాష్ అంబానీ నాయకత్వంలో జియో సాధిస్తున్న ఈ విజయాలు డిజిటల్ ఇండియా స్వప్నాన్ని మరింత వేగంగా సాకారం చేస్తున్నాయి.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story