ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్‌కు దగ్గర పడుతోన్న గడువు.. ఆలస్యమైతే ఏం జరుగుతుందో తెలుసా.?
ITR Filing: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (ITR) దాఖలు చేయడానికి గడువు దగ్గరపడుతోంది.
ITR Filing: ఐటీఆర్ ఫైలింగ్‌కు దగ్గర పడుతోన్న గడువు.. ఆలస్యమైతే ఏం జరుగుతుందో తెలుసా.?
ITR Filing: 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆదాయపు పన్ను (ITR) దాఖలు చేయడానికి గడువు దగ్గరపడుతోంది. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులు జూలై 31, 2026లోగా తమ ఐటీఆర్‌ను తప్పనిసరిగా ఫైల్ చేయాలి. గడువు దాటితే ఏం జరుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎవరు తప్పనిసరిగా ITR ఫైల్ చేయాలి?
కొత్త పన్ను విధానం (New Tax Regime) ప్రకారం రూ.4 లక్షల వరకు ఆదాయం పన్ను మినహాయింపు పరిధిలో ఉంటుంది. పాత పన్ను విధానం (Old Tax Regime)లో ఈ పరిమితి రూ.2.5 లక్షలు. ఈ పరిమితిని మించిన పన్ను విధించదగిన ఆదాయం ఉంటే ఐటీఆర్ తప్పనిసరిగా దాఖలు చేయాలి. సెక్షన్ 87A కింద పన్ను రాయితీ కారణంగా చివరకు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకపోయినా కూడా రిటర్న్ ఫైల్ చేయాల్సిందే.
అంతేకాదు, ఆదాయం తక్కువగా ఉన్నా కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో కూడా ఐటీఆర్ దాఖలు తప్పనిసరి అవుతుంది. ఉదాహరణకు.. ఏడాదికి రూ.1 లక్ష లేదా అంతకంటే ఎక్కువ విద్యుత్ బిల్లు చెల్లించినా, రూ.2 లక్షలకు పైగా విదేశీ ప్రయాణాలపై ఖర్చు చేసినా, చట్టంలో పేర్కొన్న ఇతర అధిక విలువ గల ఆర్థిక లావాదేవీలు చేసినా ఐటీఆర్ ఫైల్ చేయాల్సి ఉంటుంది. ఐటీఆర్ కేవలం పన్ను చెల్లించడానికి మాత్రమే కాదు. బ్యాంకు రుణాలు, వీసా దరఖాస్తులు, విదేశాల్లో ఉద్యోగాలు, విదేశీ పన్ను క్రెడిట్ (Foreign Tax Credit) పొందేందుకు కూడా ఇది ముఖ్యమైన ఆదాయ ధ్రువీకరణ పత్రంగా ఉపయోగపడుతుంది.
జూలై 31 గడువు మిస్ అయితే ఏమవుతుంది?
జూలై 31లోగా రిటర్న్ దాఖలు చేయకపోయినా పూర్తిగా అవకాశం ముగిసిపోదు. డిసెంబర్ 31, 2026 వరకు బిలేటెడ్ రిటర్న్ (Belated Return) దాఖలు చేయవచ్చు. అయితే ఇందుకు ఆలస్య రుసుము చెల్లించాల్సి ఉంటుంది. మొత్తం ఆదాయం రూ.5 లక్షల వరకు ఉంటే రూ.1,000 జరిమానా, రూ.5 లక్షలకు మించి ఉంటే గరిష్టంగా రూ.5,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఇవి కాకుండా చెల్లించాల్సిన పన్ను బకాయి ఉంటే, అసలు గడువు నుంచి రిటర్న్ దాఖలు చేసే తేదీ వరకు నెలకు 1 శాతం వడ్డీ కూడా చెల్లించాల్సి ఉంటుంది.
ఆలస్యంగా ఫైల్ చేస్తే కోల్పోయే ప్రయోజనాలు ఇవే
ఐటీఆర్ ఆలస్యంగా దాఖలు చేస్తే కేవలం జరిమానా మాత్రమే కాదు, కొన్ని ముఖ్యమైన పన్ను ప్రయోజనాలు కూడా కోల్పోతారు. ఇంటి ఆస్తి నష్టాన్ని మినహాయించి మిగిలిన నష్టాలను (Losses) తర్వాతి సంవత్సరాలకు బదిలీ చేసుకునే అవకాశం ఉండదు. తర్వాత అవసరమైతే పాత పన్ను విధానం, కొత్త పన్ను విధానం మధ్య మారే అవకాశం కోల్పోతారు. గడువు దాటిన తర్వాత దాఖలు చేసే రిటర్న్స్ సాధారణంగా కొత్త పన్ను విధానం కింద పరిగణనలోకి వస్తాయి. రిటర్న్‌లో తప్పులు ఉంటే సవరించుకునే అవకాశం ఉంది. ఫైనాన్స్ యాక్ట్ 2026 ప్రకారం, ఇప్పటికే దాఖలు చేసిన అసలు రిటర్న్ లేదా బిలేటెడ్ రిటర్న్‌లో తప్పులు ఉంటే వాటిని మార్చి 31, 2027 వరకు సవరించుకునే అవకాశం ఉంది.
దీనికి కూడా ఆదాయాన్ని బట్టి రూ.1,000 లేదా రూ.5,000 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఇంకా తర్వాత కూడా అవసరమైతే అప్‌డేటెడ్ ఐటీఆర్ (ITR-U) దాఖలు చేసే అవకాశం ఉంది. అయితే అదనపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. దాఖలు చేసే గడువు 12 నెలలు అయితే 25 శాతం, 12-24 నెలల మధ్య అయితే 50%, 24-36 నెలల మధ్య అయితే 60%, 36-48 నెలల మధ్య అయితే 70% చెల్లించాల్సి ఉంటుంది. అయితే అప్డేట్ ఐటీఆర్ ద్వారా రీఫండ్ క్లెయిమ్ చేయలేరు. గతంలో చూపిన నష్టాలను తగ్గించడానికి మాత్రమే ఉపయోగించుకోవచ్చు.
ITR అసలు దాఖలు చేయకపోతే ఎదురయ్యే సమస్యలు
చట్టం ప్రకారం తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాల్సి ఉండి కూడా చేయకపోతే పలు ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మీ అధిక విలువ గల ఆర్థిక లావాదేవీల ఆధారంగా ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసులు రావచ్చు. టిడిఎస్ (TDS) ద్వారా ఎక్కువగా కట్ అయిన పన్ను రీఫండ్ పొందే అవకాశాన్ని కోల్పోతారు.
గత సంవత్సరాల ఆదాయాన్ని కూడా అధికారులు తిరిగి పరిశీలించే అవకాశం ఉంటుంది.
అవసరమైతే అందుబాటులో ఉన్న సమాచారంతో అధికారులు స్వయంగా పన్ను అంచనా వేయవచ్చు.
ఉద్దేశపూర్వకంగా ఐటీఆర్ దాఖలు చేయకుండా ఉంటే 6 నెలల నుంచి 2 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉంది. అయితే ఆలస్యంగా అయినా రిటర్న్ దాఖలు చేస్తే లేదా బకాయి పన్ను రూ.10,000లోపు ఉంటే సాధారణంగా ఈ చర్యలు వర్తించవు.
విదేశీ ఆస్తులు లేదా విదేశీ కంపెనీల షేర్లు కలిగిన భారతీయ నివాసితులు, పన్ను చెల్లించాల్సిన ఆదాయం లేకపోయినా తప్పనిసరిగా ఐటీఆర్ దాఖలు చేయాలి. లేకపోతే బ్లాక్ మనీ చట్టం-2015 ప్రకారం కఠినమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఐటీఆర్ ఫైలింగ్‌ను చివరి నిమిషానికి వాయిదా వేయకుండా వీలైనంత త్వరగా పూర్తి చేయడం మంచిది. దీంతో జరిమానాలు, వడ్డీలు తప్పించుకోవడమే కాకుండా భవిష్యత్తులో రుణాలు, వీసాలు, ఆదాయ ధ్రువీకరణ వంటి అవసరాలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు.




