IRCTC: ఒకేరోజు 20 లక్షలకు పైగా ట్రైన్ టికెట్ల బుకింగ్.. సరికొత్త రికార్డు!
IRCTC Sets Record: పండుగల వేళ ఐఆర్‌సీటీసీ సరికొత్త రికార్డు సృష్టించింది. ఒక్కరోజులోనే 20 లక్షలకు పైగా రైలు టికెట్లు బుక్ అయినట్లు వెల్లడించింది.
IRCTC: ఒకేరోజు 20 లక్షలకు పైగా ట్రైన్ టికెట్ల బుకింగ్.. సరికొత్త రికార్డు!
IRCTC: పండుగల సీజన్ సమీపిస్తుండటంతో దేశంలో రైలు ప్రయాణాలకు ఊహించని రీతిలో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ఆన్‌లైన్ టికెట్ బుకింగ్స్‌లో సరికొత్త ఆల్-టైమ్ రికార్డును నమోదు చేసింది. సెప్టెంబర్ 7న ఒక్క రోజే ఏకంగా 20,06,353 టికెట్లు బుక్ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఐఆర్‌సీటీసీ చరిత్రలోనే ఒకేరోజు 20 లక్షల మార్కును దాటడం ఇదే తొలిసారి కాగా, మరుసటి రోజు సెప్టెంబర్ 8న కూడా 19.5 లక్షలకు పైగా టికెట్లు అమ్ముడయ్యాయి.
గత ఏడాది పండుగల సమయంలో నమోదైన అత్యధిక రోజువారీ రికార్డు (18.4 లక్షలు) కంటే ఈసారి బుకింగ్స్ దాదాపు 6 శాతం పెరగడం గమనార్హం. ప్రస్తుతం రైల్వే రిజర్వ్‌డ్ టికెట్లలో సుమారు 89 శాతం ఆన్‌లైన్ ద్వారానే బుక్ అవుతున్నాయని సంస్థ తెలిపింది. ఈ భారీ డిమాండ్‌ను తట్టుకునేందుకు వీలుగా 2026 జూలై 15న అధునాతన వెబ్‌సైట్, నూతన యూజర్ ఇంటర్‌ఫేస్‌ను అందుబాటులోకి తెచ్చామని, నూతన సర్వర్ల ద్వారా బుకింగ్ సామర్థ్యాన్ని రెట్టింపు చేశామని ఐఆర్‌సీటీసీ స్పష్టం చేసింది.
మరోవైపు టికెట్ బుకింగ్‌లలో జరిగే అక్రమాలను అరికట్టేందుకు ఐఆర్‌సీటీసీ కఠిన చర్యలు చేపట్టింది. ఉదయం 8 గంటలకు తత్కాల్/సాధారణ రిజర్వేషన్ ప్రారంభమైన తొలి 10 నిమిషాల పాటు ఏజెంట్ల బుకింగ్‌లపై నిషేధం విధించడంతో పాటు సాధారణ వినియోగదారులకు ఆధార్ వెరిఫికేషన్‌ను నిర్బంధం చేసింది. మోసపూరిత చర్యలకు పాల్పడుతున్నట్లు గుర్తించిన 3.04 కోట్ల యూజర్ ఐడీలను డీయాక్టివేట్ చేసినట్లు, మరో 6.33 కోట్ల ఖాతాలను రీ-వెరిఫికేషన్ కోసం ఫ్లాగ్ చేసినట్లు అధికారులు వివరించారు.




