Insurance: పాలసీదారు, నామినీ ఇద్దరూ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బు ఎవరికి లభిస్తుంది.?
Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో కుటుంబ ఆర్థిక భద్రత కోసం పాలసీదారు సాధారణంగా భార్య, భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులను నామినీగా నమోదు చేస్తారు.
Insurance: పాలసీదారు, నామినీ ఇద్దరూ చనిపోతే ఇన్సూరెన్స్ డబ్బు ఎవరికి లభిస్తుంది.?
Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునే సమయంలో కుటుంబ ఆర్థిక భద్రత కోసం పాలసీదారు సాధారణంగా భార్య, భర్త లేదా ఇతర కుటుంబ సభ్యులను నామినీగా నమోదు చేస్తారు. పాలసీదారు మరణించిన తర్వాత ఇన్సూరెన్స్ మొత్తాన్ని పొందేందుకు నామినీకి అవకాశం ఉంటుంది. అయితే ప్రమాదవశాత్తూ పాలసీదారు, నామినీ ఇద్దరూ ఒకేసారి లేదా కొద్ది సమయం తేడాతో మరణిస్తే పరిస్థితి ఏంటి? ఇన్సూరెన్స్ డబ్బు ఎవరికి చెందుతుందో తెలుసా?
సెకండరీ నామినీ ఉంటే వారికి మొదటి ప్రాధాన్యత
పాలసీ తీసుకునే సమయంలో ప్రధాన నామినీతో పాటు మరో వ్యక్తిని ప్రత్యామ్నాయ లేదా సెకండరీ నామినీగా చేర్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు భార్యను ప్రధాన నామినీగా, పిల్లలను ప్రత్యామ్నాయ నామినీలుగా నమోదు చేయవచ్చు. ఒకవేళ పాలసీదారు, ప్రధాన నామినీ ఇద్దరూ మరణిస్తే.. పాలసీలో ముందుగానే నమోదు చేసిన సెకండరీ నామినీకి క్లెయిమ్ మొత్తాన్ని చెల్లించే అవకాశం ఉంటుంది. అందుకే పాలసీలో ఒకరి కంటే ఎక్కువ మంది నామినీల వివరాలను నమోదు చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మరో నామినీ లేకపోతే..
పాలసీలో సెకండరీ నామినీ లేకపోతే ఇన్సూరెన్స్ కంపెనీ వెంటనే ఎవరికీ డబ్బు చెల్లించదు. అలాంటి సందర్భాల్లో పాలసీదారుడి చట్టబద్ధ వారసులు క్లెయిమ్‌కు అర్హులవుతారు. వర్తించే వారసత్వ చట్టాల ప్రకారం పిల్లలు, తల్లిదండ్రులు లేదా ఇతర చట్టబద్ధ వారసులు ఇన్సూరెన్స్ మొత్తంపై హక్కు పొందవచ్చు. అయితే ఎవరు అసలు చట్టబద్ధ వారసులో నిర్ధారించేందుకు అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.
లీగల్ హెయిర్ లేదా సక్సెషన్ సర్టిఫికెట్ అవసరం
ప్రధాన నామినీ, పాలసీదారు ఇద్దరూ మరణించి ప్రత్యామ్నాయ నామినీ లేని పరిస్థితుల్లో క్లెయిమ్ పొందడం కొంత క్లిష్టంగా మారవచ్చు. చట్టబద్ధ వారసులు తమ హక్కును నిరూపించేందుకు లీగల్ హెయిర్ సర్టిఫికెట్ లేదా అవసరాన్ని బట్టి సక్సెషన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి రావచ్చు. ఇవి మరణించిన వ్యక్తి ఆస్తులు, ఆర్థిక ప్రయోజనాలపై ఎవరికి చట్టబద్ధ హక్కు ఉందో నిర్ధారించే పత్రాలు. సాధారణంగా క్లెయిమ్ ప్రక్రియలో మరణ ధ్రువీకరణ పత్రం, ప్రమాదం జరిగితే ఎఫ్‌ఐఆర్ కాపీ, పోస్టుమార్టం నివేదిక వంటి ఇతర పత్రాలను కూడా ఇన్సూరెన్స్ కంపెనీ కోరవచ్చు.
మైనర్ పిల్లలు మాత్రమే ఉంటే ఏం జరుగుతుంది?
పాలసీదారు, నామినీ ఇద్దరూ మరణించి కుటుంబంలో చిన్న పిల్లలు మాత్రమే మిగిలితే వారి తరఫున చట్టబద్ధ సంరక్షకుడు క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేయవచ్చు. పిల్లల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని చట్టపరమైన నిబంధనలకు అనుగుణంగా ఇన్సూరెన్స్ మొత్తాన్ని చెల్లిస్తారు. ఇలాంటి అనుకోని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు ఇబ్బంది పడకుండా ఉండాలంటే పాలసీ తీసుకునే సమయంలోనే నామినీ వివరాలను జాగ్రత్తగా నమోదు చేయడం ముఖ్యం. వివాహం, పిల్లల జననం వంటి కుటుంబ పరిస్థితుల్లో మార్పులు వచ్చినప్పుడు నామినీ వివరాలను కూడా అప్డేట్ చేసుకోవాలి. ప్రధాన నామినీతో పాటు ప్రత్యామ్నాయ నామినీని చేర్చడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో క్లెయిమ్ ప్రక్రియ మరింత సులభంగా జరిగే అవకాశం ఉంటుంది.




