LPG Cylinder : ఇక గ్యాస్ సిలిండర్ కోసం రోజులు వేచి చూడక్కర్లేదు.. కేవలం 4 గంటల్లోనే డెలివరీ
LPG Cylinder : ఇండియన్ ఆయిల్ సంస్థ ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ పేరుతో ఎక్స్‌ప్రెస్ సర్వీస్ తెచ్చింది. బుక్ చేసిన 4 గంటల్లోనే ఇంటికి గ్యాస్ సిలిండర్ వచ్చేస్తుంది.
LPG Cylinder
LPG Cylinder : ఇంట్లో వంట చేసుకునేటప్పుడు అకస్మాత్తుగా గ్యాస్ సిలిండర్ అయిపోతే ఇకపై గంటల తరబడి, రోజుల తరబడి వేచి చూడాల్సిన అవసరం లేదు. తమ వినియోగదారుల కష్టాలను తీర్చేందుకు ప్రముఖ ప్రభుత్వ రంగ చమురు సంస్థ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (IOCL) ఒక అద్భుతమైన ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవను అందుబాటులోకి తెచ్చింది. ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ పేరుతో ప్రారంభించిన ఈ కొత్త సర్వీస్ ద్వారా గ్యాస్ సిలిండర్ బుక్ చేసిన కేవలం 4 గంటల వ్యవధిలోనే నేరుగా మీ ఇంటి తలుపు తట్టనుంది. ప్రస్తుతానికి ఈ సర్వీస్‌ను పూణే, గుర్గావ్, ఇండోర్, కోయంబత్తూర్ నగరాల్లో ప్రారంభించారు. రాబోయే రోజుల్లో దేశంలోని ఇతర ప్రధాన నగరాలకు కూడా దీనిని విస్తరించనున్నట్లు కంపెనీ వెల్లడించింది.
10 కిలోల తేలికపాటి కాంపొజిట్ సిలిండర్ ఆవిష్కరణ
ఈ వేగవంతమైన డెలివరీ సేవతో పాటు ఇండియన్ ఆయిల్ 10 కిలోల బరువుండే సరికొత్త కాంపొజిట్ ఎల్పీజీ సిలిండర్‌ను కూడా మార్కెట్లోకి తీసుకొచ్చింది. మనం సాధారణంగా వాడే బరువైన ఇనుప సిలిండర్లతో పోలిస్తే ఇది చాలా తేలికగా ఉంటుంది. సులువుగా ఒక చోటు నుంచి మరో చోటుకి ఎత్తుకెళ్లేలా దీనిని డిజైన్ చేశారు. ముఖ్యంగా బరువైన సిలిండర్లను మోయలేని వారికి, చిన్న కుటుంబాలకు ఈ తేలికపాటి ఫైబర్ సిలిండర్ ఎంతగానో ఉపయోగపడుతుందని కంపెనీ తెలిపింది.
సమయం మీదే.. డెలివరీ కూడా మీ ఇష్టమే
ఈ ఇండేన్ ఎక్స్‌ట్రాలైట్ నౌ సేవలోని ప్రధాన ప్రత్యేకత ఏంటంటే.. వినియోగదారులు బుకింగ్ చేసుకున్న 4 గంటల్లోనే సిలిండర్ డెలివరీ అవుతుంది. దీంతో పాటు కస్టమర్లు తమ సౌకర్యానికి తగిన సమయాన్ని కూడా ఎంచుకునే వెసులుబాటును కల్పించారు. దీనివల్ల డెలివరీ బాయ్ ఎప్పుడొస్తాడో అని రోజంతా ఇంట్లోనే కూర్చుని ఎదురుచూసే అవసరం తప్పనుంది. పూర్తిగా డిజిటల్ పద్ధతిలో మొబైల్ యాప్ లేదా ఆన్‌లైన్ ద్వారా చాలా సులభంగా గ్యాస్ బుకింగ్ చేసుకోవచ్చు. డెలివరీ స్టేటస్‌ను ఎప్పటికప్పుడు ట్రాక్ చేసుకునే సదుపాయం కూడా ఇందులో ఉంటుంది.
ఇండేన్ ఛోటూ 5 కేజీల సిలిండర్‌కూ 4 గంటల డెలివరీ
కేవలం 10 కిలోల ఎక్స్‌ట్రాలైట్ సిలిండర్‌కే కాకుండా, చిన్న కుటుంబాలు, విద్యార్థులు, రోడ్డు పక్కన వ్యాపారం చేసుకునే వారు, ఫుడ్ స్టాల్ నిర్వాహకులు ఎక్కువగా వాడే 5 కిలోల ఇండేన్ ఛోటూ ఎల్పీజీ సిలిండర్‌కు కూడా ఈ 4 గంటల ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవను వర్తింపజేశారు. దీనివల్ల చిన్న వ్యాపారస్తులకు గ్యాస్ అయిపోవడం వల్ల వ్యాపారం ఆగకుండా తక్షణమే సిలిండర్ అందుతుంది. త్వరిత డెలివరీ, సులువైన బుకింగ్, తేలికపాటి సిలిండర్లు కలిసి కస్టమర్లకు మునుపెన్నడూ లేని సరికొత్త అనుభూతిని ఇస్తాయని ఇండియన్ ఆయిల్ ప్రతినిధులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.




