కెనడా పెట్టుబడులకు భారత్ బెస్ట్.. నిర్మలా సీతారామన్
కెనడా పెట్టుబడిదారులకు భారత్ భారీ అవకాశాలను అందిస్తోందని నిర్మలా సీతారామన్ అన్నారు. భారత్-కెనడా ఆర్థిక సంబంధాలు వేగం పుంజుకున్నాయి.
India Canada Economic Ties
భారత్-కెనడా ఆర్థిక సంబంధాలు మరింత వేగం పుంజుకుంటున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కెనడా పెట్టుబడిదారులకు భారత్‌లో ఉన్న అవకాశాలను వివరించిన ఆమె.. వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందని పేర్కొన్నారు.
టొరంటోలో భారత వ్యాపార వర్గాల ప్రతినిధులతో సమావేశమైన నిర్మలా సీతారామన్.. భారీ మార్కెట్ పరిమాణం, నిరంతర ఆర్థిక వృద్ధి, యువ జనాభా, పెరుగుతున్న వినియోగం, అభివృద్ధి చెందుతున్న క్యాపిటల్ మార్కెట్లు భారత్‌కు ప్రధాన బలాలని వివరించారు.
ప్రతి రంగంలో పెట్టుబడులకు అవకాశాలు
భారత్‌లో జరుగుతున్న మార్పులు తాత్కాలికమైనవి కావని, నిర్మాణాత్మకంగా కొనసాగుతున్నాయని నిర్మలా సీతారామన్ తెలిపారు. వేగవంతమైన పట్టణీకరణ, విస్తరిస్తున్న మధ్యతరగతి, ప్రపంచస్థాయి డిజిటల్ మౌలిక సదుపాయాలు దాదాపు అన్ని రంగాల్లో కొత్త అవకాశాలను సృష్టిస్తున్నాయని చెప్పారు.
దీర్ఘకాలిక దృష్టితో భారత్‌లో పెట్టుబడులు పెట్టే కెనడా సంస్థలకు భారీ అవకాశాలు ఉన్నాయని ఆమె పేర్కొన్నారు.
UPIతో డిజిటల్ ఫైనాన్స్‌కు కొత్త ఊపు
భారత్‌లోని డిజిటల్ ఎకోసిస్టమ్ ఆర్థిక, వాణిజ్య సేవలను మరింత మందికి అందుబాటులోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషిస్తోందని ఆర్థిక మంత్రి చెప్పారు. డిజిటల్ మౌలిక సదుపాయాల వల్ల సేవలను పొందే ఖర్చు తగ్గడంతో పాటు.. వాటి పరిధి కూడా విస్తరించిందని వివరించారు.
లావాదేవీల పరిమాణం పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద రియల్‌టైమ్ పేమెంట్స్ వ్యవస్థగా UPI నిలిచిందని పేర్కొన్నారు. ఆర్థిక సమ్మిళితత్వం, సామర్థ్యం, ఆవిష్కరణలకు UPI కీలక సాధనంగా మారిందన్నారు.
కెనడా బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు, నియంత్రణ సంస్థలతో చెల్లింపులు, తదుపరి తరం డిజిటల్ ఫైనాన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో సహకారానికి గణనీయమైన అవకాశాలు ఉన్నాయని చెప్పారు.
ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై భారీ లక్ష్యం
కెనడాలోని భారతీయ ప్రవాసులను ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక వారధిగా నిర్మలా సీతారామన్ అభివర్ణించారు. కెనడా కార్పొరేట్ బోర్డులు, ఆర్థిక మార్కెట్లు, పెన్షన్ ఫండ్లలో భారతీయుల ఉనికి రెండు దేశాల మధ్య సంబంధాలకు మరింత బలం చేకూరుస్తోందని తెలిపారు.
2025 జూన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన ఒప్పందం తర్వాత భారత్-కెనడా ద్వైపాక్షిక సంబంధాల్లో కొత్త దశ ప్రారంభమైందని చెప్పారు.
ఈ భాగస్వామ్యంలో భాగంగా CEPA చర్చలు ప్రారంభం కావడం, కేమెకోతో CAD 2.6 బిలియన్ విలువైన యురేనియం ఒప్పందం కుదరడం, 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని CAD 70 బిలియన్లకు మించి పెంచాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం వంటి పరిణామాలను ఆమె ప్రస్తావించారు.
పెట్టుబడులకే పరిమితం కాని భాగస్వామ్యం
భారత్-కెనడా సంబంధాలు కేవలం మూలధన ప్రవాహాలకు మాత్రమే పరిమితం కాకుండా.. సంస్థాగత స్థాయిలో మరింత లోతైన భాగస్వామ్యంగా మారుతున్నాయని నిర్మలా సీతారామన్ అన్నారు. క్యాపిటల్ మార్కెట్లు ఈ విస్తృత ఆర్థిక భాగస్వామ్యంలో ఒక భాగం మాత్రమేనని పేర్కొన్నారు.




