IPO: భారత స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఐపీఓ.. ఎస్బీఐకి పండగే..!
IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓకు ఎన్‌ఎస్‌ఈ సిద్ధమైంది.
IPO: భారత స్టాక్ మార్కెట్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఐపీఓ.. ఎస్బీఐకి పండగే..!
Stock Exchange : భారతీయ మూలధన మార్కెట్ చరిత్రలోనే సరికొత్త అధ్యాయం లిఖించబడబోతోంది. దేశంలోనే అతిపెద్ద స్టాక్ ఎక్స్చేంజ్ అయిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ ఐపీఓకు ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ వారం శుక్రవారం లోపుగానే ఎన్‌ఎస్‌ఈ తన ముసాయిదా పత్రాలను మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీకి సమర్పించేందుకు సర్వం సిద్ధం చేసుకుంది.
పశ్చిమాసియా ఉద్రిక్తతలకు తెరపడుతూ, ఇరాన్-అమెరికా మధ్య డీల్ కుదరడంతో దేశీయ మార్కెట్లలో మళ్లీ జోష్ వచ్చింది. వరుసగా 4 సెషన్ల పాటు సూచీలు దూసుకెళ్లడంతో.. వాయిదా పడ్డాయనుకున్న ముకేశ్ అంబానీకి చెందిన రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్, జెప్టో వంటి దిగ్గజాలతో పాటు ఇప్పుడు NSE కూడా ఐపీఓ రేసులోకి దూసుకొచ్చింది.
ఈ ఐపీఓ ద్వారా ఎన్‌ఎస్‌ఈ ఏకంగా రూ. 30,000 కోట్ల వరకు నిధులను సమీకరించాలని యోచిస్తోంది. సంస్థ మార్కెట్ విలువను సుమారు రూ. 5 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. భారత కార్పొరేట్ చరిత్రలోనే ఇది అత్యంత భారీ ఐపీఓల్లో ఒకటిగా నిలవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఐపీఓ పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ విధానంలో రాబోతోంది. అంటే కంపెనీ కొత్త షేర్లను జారీ చేయకుండా, ప్రస్తుతం ఉన్న వాటాదారులే తమ షేర్లను విక్రయిస్తారు.
ఎన్‌ఎస్‌ఈలో అత్యధికంగా 10.72 శాతం వాటాతో ప్రభుత్వ బీమా దిగ్గజం ఎల్ఐసీ అతిపెద్ద వాటాదారుగా ఉంది. అయితే, ఈ మెగా ఐపీఓలో తన వాటాను విక్రయించకూడదని ఎల్ఐసీ నిర్ణయించుకోవడం విశేషం. మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా , దాని సబ్సిడరీ ఎస్బీఐ క్యాప్స్ కలిసి మొత్తంగా 7.5 శాతం వాటాను కలిగి ఉన్నాయి. ఇందులోంచి సుమారు 6 శాతం వాటాను ఓఎఫ్ఎస్ రూపంలో విక్రయించేందుకు సిద్ధమయ్యారు.
ఎన్‌ఎస్‌ఈ ఐపీఓ వార్తలతో బుధవారం ట్రేడింగ్‌లో మార్కెట్ విచిత్రమైన స్పందనను చూసింది. ఒకవైపు ఎన్‌ఎస్‌ఈలో వాటాలున్న కంపెనీల షేర్లు పరుగెడితే.. దానికి పోటీగా ఉన్న ఏకైక లిస్టెడ్ ఎక్స్చేంజ్ బీఎస్ఈ షేరు కుప్పకూలింది. ఐపీఓ ద్వారా భారీగా లాభపడనున్న SBI షేరు 1% పైగా పెరిగి రూ. 1,026.50 వద్ద స్థిరపడింది. వాటాను విక్రయించకపోయినా అతిపెద్ద వాటాదారుగా ఉన్న LIC షేరు కూడా 1.70% పెరిగి రూ. 418 కి చేరింది.
ఇప్పటివరకు మార్కెట్లో ఏకఛత్రాధిపత్యం చలాయించిన BSE షేరు ఏకంగా 4% పతనమై రూ. 4,004 వద్ద ముగిసింది. ఎన్‌ఎస్‌ఈ లిస్టింగ్ అయితే తన మార్కెట్ వాటా ఎక్కడ తగ్గుతుందోనన్న ఆందోళన బీఎస్ఈలో స్పష్టంగా కనిపించింది. దేశీయ స్టాక్ మార్కెట్ చరిత్రలో నిలిచిపోయే ఈ మెగా ఐపీఓ కోసం అటు ఇన్వెస్టర్లు, ఇటు ట్రేడర్లు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎన్‌ఎస్‌ఈ ఎంట్రీతో మార్కెట్ ముఖచిత్రం ఎలా మారబోతుందో చూడాలి.




