Money Transfer: గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు శుభవార్త
Money Transfer: మీ మొబైల్‌లో ఇంటర్నెట్ లేదా డేటా లేదా? నో టెన్షన్.
Money Transfer: గూగుల్ పే, ఫోన్‌పే యూజర్లకు శుభవార్త
UPI Without Internet : ఈ రోజుల్లో జేబులో పర్స్ లేకపోయినా నడిచిపోతుంది కానీ, చేతిలో మొబైల్ లేకపోతే క్షణం గడవదు. రూపాయి చాక్లెట్ దగ్గరి నుండి షోరూమ్‌లో కార్లు, బంగారం కొనే వరకు అంతా డిజిటల్ మాయాజాలమే! గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎంల ద్వారా రోజూ కోట్ల లావాదేవీలు జరుగుతున్నాయి. కానీ, సరిగ్గా అర్జంట్‌గా డబ్బులు పంపాల్సిన సమయంలో నో ఇంటర్నెట్ అని వస్తే? లేదా సిగ్నల్స్ లేక యాప్స్ తిరుగుతూనే ఉంటే? గుండె గుభేల్ వంటుంది కదూ. ముఖ్యంగా నెట్‌వర్క్ సరిగ్గా లేని గ్రామీణ ప్రాంతాల్లో, కొండ ప్రాంతాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా కనిపిస్తుంది.
సరిగ్గా ఇలాంటి ఇబ్బందుల నుంచే మనల్ని గట్టెక్కించడానికి నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఒక అద్భుతమైన సదుపాయాన్ని తీసుకొచ్చింది. ఇప్పుడు మీ మొబైల్‌లో ఇంటర్నెట్ లేకపోయినా.. సాధారణ కీప్యాడ్ ఫోన్ ద్వారా కూడా చాలా సులభంగా డబ్బులు పంపవచ్చు. ఈ ఆఫ్‌లైన్ యూపీఐ సేవను ఉపయోగించాలంటే మీ మొబైల్‌లో ఈ విషయాలు కరెక్ట్‌గా ఉండాలి. మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా మీ బ్యాంక్ ఖాతాకు అనుసంధానమై ఉండాలి. మీరు గతంలోనే ఆ నంబర్‌పై UPI సేవలను ఆక్టివేట్ చేసి ఉండాలి. డేటా లేకపోయినా పర్వాలేదు కానీ, ఫోన్‌కు సాధారణ సిగ్నల్ మాత్రం ఉండాలి. మీ మొబైల్‌లో నార్మల్ కాల్స్ మాట్లాడటానికి, ఎస్ఎంఎస్ పంపడానికి వీలుగా బ్యాలెన్స్ లేదా ప్లాన్ ఉండాలి.
ఇంటర్నెట్ కనెక్షన్ లేనప్పుడు, మీ మొబైల్ కీప్యాడ్ ద్వారా ఈ కింది 5 స్టెప్స్ ఫాలో అయితే చాలు.. క్షణాల్లో మనీ ట్రాన్స్‌ఫర్ అయిపోతుంది. మొదట మీ బ్యాంక్ ఖాతాకు లింక్ అయిన మొబైల్ నంబర్ నుండి *99# కు డయల్ చేయండి. భారతదేశంలోని దాదాపు అన్ని ప్రముఖ బ్యాంకులకు ఈ సేవ వర్తిస్తుంది. డయల్ చేయగానే మీ మొబైల్ స్క్రీన్‌పై యూపీఐ సేవలకు సంబంధించిన ఒక పాప్ అప్ మెనూ కనిపిస్తుంది. స్క్రీన్‌పై మీకు.. డబ్బు పంపండి , డబ్బు అభ్యర్థన, బ్యాలెన్స్ చెక్, మై ప్రొఫైల్ వంటి ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో 'డబ్బు పంపండి' ఆప్షన్‌కు ఎదురుగా ఉన్న నంబర్‌ను టైప్ చేసి సబ్మిట్ చేయండి.
ఇప్పుడు డబ్బు పంపడానికి మీకు UPI ID, మొబైల్ నంబర్, బ్యాంక్ ఖాతా నంబర్, IFSC కోడ్ వంటి ఆప్షన్లు స్క్రీన్‌పై వస్తాయి. వీటిలో మీకు అందుబాటులో ఉన్న ఒక ఎంపికను ఎంచుకోండి. మీరు ఎవరికైతే డబ్బు పంపాలనుకుంటున్నారో.. వారి సరైన వివరాలను ఎంటర్ చేయాలి. ఆ తర్వాత మీరు పంపాలనుకుంటున్న అమౌంట్‌ను టైప్ చేయండి. చివరగా మీ సీక్రెట్ UPI పిన్ నంబర్‌ను ఎంటర్ చేసి కన్ఫర్మ్ చేయండి. అంతే.. క్షణాల్లో మీ డబ్బు అవతలి వ్యక్తి ఖాతాలోకి చేరుకుంటుంది. ట్రాన్సాక్షన్ సక్సెస్ అయినట్లు స్క్రీన్‌పై మెసేజ్ రావడంతో పాటు మీ మొబైల్‌కు సాధారణ SMS కూడా వస్తుంది.
యాప్స్ ద్వారా పంపేదానికి, ఈ ఆఫ్‌లైన్ విధానానికి చిన్న తేడాలు ఉన్నాయి. ఈ ఆఫ్‌లైన్ సేవను ఉపయోగించినందుకు కొన్ని టెలికాం కంపెనీలు సాధారణ SMS లేదా కాల్ రుసుములను వసూలు చేసే అవకాశం ఉంది. స్మార్ట్‌ఫోన్ యాప్‌లలో లాగా ఇందులో అవతలి వ్యక్తి పేరు ముందే స్క్రీన్‌పై కనిపించకపోవచ్చు. కాబట్టి తప్పుడు నంబర్ ఎంటర్ చేస్తే డబ్బు వేరే ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉంది. వివరాలు టైప్ చేసేటప్పుడు ఒకటికి రెండుసార్లు చూసుకోండి.




