India Oil Import Strategy: భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయమే...చమురు కొరత నుంచి కాపాడిందా?

India Oil Import Strategy: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది.

Balachander
Published on: 5 April 2026 11:40 AM IST
India Oil Import Strategy: భారత్‌ తీసుకున్న ఈ నిర్ణయమే...చమురు కొరత నుంచి కాపాడిందా?
X

India Oil Import Strategy: పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ ఉద్రిక్తతల మధ్య ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 100 డాలర్లను దాటింది. నిపుణుల అంచనాల ప్రకారం ఈ పరిస్థితి కొనసాగితే ధర 150 నుంచి 170 డాలర్ల వరకు చేరే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితి వస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడటం ఖాయం.

85 శాతం దిగుమతిపైనే ఆధారం

ఇలాంటి క్లిష్ట సమయంలో భారత్‌ ముందుగానే తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలు దేశాన్ని కొంతవరకు చమురు కొరత నుంచి కాపాడుతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రస్తుతం భారత్‌ తన మొత్తం చమురు అవసరాల్లో దాదాపు 85% వరకు దిగుమతులపై ఆధారపడుతోంది . ప్రపంచంలోనే మూడో అతిపెద్ద చమురు దిగుమతి దేశంగా భారత్‌ నిలుస్తోంది. భారత్‌ ఒకే దేశంపై ఆధారపడకుండా వివిధ దేశాల నుంచి చమురు దిగుమతులు చేసుకోవడం విశేషం. ఈ విధానం వల్లే ప్రస్తుతం సంక్షోభ సమయంలో కూడా సరఫరాలో పెద్ద అంతరాయం రాలేదు.

భారత్‌కు చమురు సరఫరా చేస్తున్న ప్రధాన దేశాలు

రష్యానుంచి 30 శాతం, ఇరాక్‌ నుంచి 20 శాతం, సౌదీ అరేబియా నుంచి 16 శాతం, యూఏఈ నుంచి 10 శాతం, యూఎస్‌ నుంచి 7 శాతం, కువైట్‌ నుంచి 5 శాతం, ఇతర దేశాల నుంచి 12 శాతం క్రూడ్‌ ఆయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఈ గణాంకాలను ఒకసారి పరిశీలిస్తే ఓ విషయం స్పష్టంగా అర్ధమౌతుంది. భారత్‌ తన దిగుమతులను విస్తృతంగా విభజించుకుంది. ముఖ్యంగా రష్యా నుంచి తక్కువ ధరకు భారీగా చమురును కొనుగోలు చేయడం వలన చమురు కొరతను కొంతమేర తగ్గించుకుంది. పశ్చిమ దేశాల ఆంక్షలు ఉన్నప్పటికీ తక్కువ ధరలు రష్యన్‌ క్రూడ్‌ను భారత్‌ కొనుగోలు చేయడం వలన భారీగా ఖర్చులు తగ్గాయి.

హోర్మూజ్‌ జలసంధి ప్రభావం

గల్ఫ్‌ దేశాల నుంచి వచ్చే చమురులో 60 శాతం వరకు ఈ హోర్మూజ్‌ జలసంధి మార్గం ద్వారానే భారత్‌కు చేరుతుంది. అయితే, ప్రస్తుతం అక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఉన్నప్పటికీ ప్రత్యామ్నాయ మార్గాలు, నిల్వలు, ఇతర దేశాల నుంచి దిగుమతుల వలన ప్రభావం పూర్తిగా పడకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. దీంతో పాటు అదనంగా వ్యూహాత్మక నిల్వలను కూడా పెంచుకునే ప్రయత్నం చేస్తున్నది. ప్రస్తుతం దేశంలో సుమారు 20 రోజులకు సరిపడా అత్యవసర నిల్వలు ఉన్నట్టుగా అంచనా. సంక్షోభ సమయంలో ఈ నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి. ఒక దేశంపై పూర్తిగా ఆధారపడకుండా బహుళ వనరుల నుంచి చమురును దిగుమతి చేయడం, తక్కువ ధరల మార్కెట్‌ను వినియోగించుకోవడం, వ్యూహాత్మక నిల్వలను పెంచుకోవడం వంటి నిర్ణయాలే భారత్‌ను ప్రస్తుతం చమురు సంక్షోభం నుంచి కొంత వరకు బయటపడేశాయని చెప్పొచ్చు. అయితే, పశ్చిమాసియాలో యుద్ధం దీర్ఘకాలంపాటు కొనసాగితే పరిస్థితులు మరింత కఠినంగా మారే అవకాశం ఉంటుంది. దాని ప్రభావం నేరుగా సామాన్యుల జీవితాలపై పడే అవకాశం ఉంటుంది.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story