Petrol Price : భగ్గుమంటున్న ముడి చమురు ధరలు.. మళ్లీ పెట్రోల్, డీజిల్ రేట్లు పెరగనున్నాయా?

Petrol Price : హోర్ముజ్ జలసంధి మూసివేతతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. అయితే ప్రస్తుతం భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా ఉన్నాయి, తక్షణమే పెరిగే అవకాశం లేదు.

CR Reddy
Published on: 22 Jun 2026 7:41 AM IST
Petrol Price
X

Petrol Price

Petrol Price : అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు మళ్లీ శరవేగంగా పుంజుకుంటున్నాయి. సోమవారం ట్రేడింగ్ ప్రారంభంలోనే చమురు ధరలు సుమారు 3 శాతం మేర పెరిగాయి. దీనికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. మొదటిది, అమెరికా-ఇరాన్ దేశాల మధ్య కుదిరిన శాంతి ఒప్పందాన్ని ఇజ్రాయెల్, అమెరికాలు ఉల్లంఘిస్తున్నాయని ఆరోపిస్తూ ఇరాన్ ప్రభుత్వం హోర్ముజ్ జలసంధిని మరోసారి బంద్ చేసింది. రెండో కారణం ఈ రూట్ గుండా వెళ్లే కార్గో షిప్పుల సంఖ్య భారీగా పడిపోవడం కాగా, మూడోది అమెరికా-ఇరాన్ అధికారుల మధ్య జరుగుతున్న మొదటి విడత శాంతి చర్చలు అత్యంత కఠినంగా మారడమే.

బారెల్ క్రూడ్ ఆయిల్ లేటెస్ట్ రేట్లు ఇవే

ఈ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ ధర బారెల్‌కు 82.30 డాలర్ల గరిష్ట స్థాయిని తాకి, ప్రస్తుతం 81.11 డాలర్ల వద్ద కొనసాగుతోంది. అలాగే అమెరికాకు చెందిన వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ రేట్లు 2.64 శాతం పెరిగి బారెల్‌కు 78.62 డాలర్లకు చేరుకున్నాయి. గత వారంలో చమురు సరఫరా పెరుగుతుందనే ఆశలతో ధరలు 8 శాతం వరకు తగ్గినప్పటికీ, ఆదివారం ఇరాన్ తీసుకున్న ఆకస్మిక నిర్ణయంతో మార్కెట్ మళ్లీ వేడెక్కింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ ఇరాన్ అధికారులతో చర్చలు జరుపుతున్నప్పటికీ, లెబనాన్‌లో ఇజ్రాయెల్ దాడుల వల్ల కనీసం 20 మంది మరణించడంతో ఈ ఒప్పందం ప్రమాదంలో పడింది.

భారత్‌లో పెట్రోల్, డీజిల్ రేట్లు పెరుగుతాయా?

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరుగుతుండటంతో భారత్‌లో ఇంధన ధరలు మళ్లీ పెరిగే ప్రమాదం ఉందా అనే టెన్షన్ వాహనదారుల్లో మొదలైంది. అయితే మార్కెట్ రంగ నిపుణుల ప్రకారం ప్రస్తుతం అలాంటి ముప్పేమీ లేదు. క్రూడ్ ఆయిల్ ధరలు బారెల్‌కు 80 నుంచి 81 డాలర్ల రేంజ్‌లో ఉన్నంతవరకు మన దేశంలో ధరలు పెరగవని వారు స్పష్టం చేస్తున్నారు. ముడి చమురు ధరలు బారెల్‌కు 95 లేదా 100 డాలర్లు దాటితేనే దేశీయ చమురు సంస్థలపై భారం పడుతుంది. ఇరాన్ తన పట్టు నిలుపుకోవడానికి హోర్ముజ్ జలసంధిని అమెరికాపై ఒత్తిడి తెచ్చే ఆయుధంగా వాడుకుంటోందని, రాబోయే రోజుల్లో ఇలాంటి హెచ్చుతగ్గులు సహజమని ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు.

హైదరాబాద్, ప్రధాన నగరాల్లో నేటి ధరలు

భారతదేశంలో మే 25వ తేదీ తర్వాత నుంచి పెట్రోల్, డీజిల్ ధరలపై చమురు కంపెనీలు ఫ్రీజ్ బటన్ నొక్కాయి. అంటే గత దాదాపు ఒక నెల రోజులుగా దేశంలో ఇంధన ధరల్లో ఎలాంటి మార్పు లేదు. హైదరాబాద్‎లో లీటర్ పెట్రోల్ ధర రూ. 115.69 వద్ద స్థిరంగా ఉండగా, డీజిల్ ధర లీటర్‌కు రూ.103.82 వద్ద కొనసాగుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.102.12, డీజిల్ రూ.95.20 గా ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.111.21 కాగా, డీజిల్ ధర రూ.97.83 గా రికార్డైంది. కోల్‌కతాలో పెట్రోల్ లీటర్ రూ.113.51 వద్ద, డీజిల్ రూ.99.82 వద్ద ట్రేడవుతోంది. చెన్నై నగరంలో లీటర్ పెట్రోల్ రేటు రూ.107.77 గాను, డీజిల్ రేటు రూ.99.55 గాను కొనసాగుతోంది. గత మే నెలలో ఇంధన ధరలు 7 నుంచి 8 శాతం పెరిగినప్పటికీ, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ హెచ్చుతగ్గుల వల్ల తక్షణమే ధరలు పెరిగే అవకాశం లేకపోవడం మన దేశ వాహనదారులకు పెద్ద ఊరటనిచ్చే విషయమే.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story