Elon Musk : చరిత్ర సృష్టించిన ఎలాన్ మస్క్.. ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‎గా రికార్డు!

Elon Musk : స్పేస్‌ఎక్స్ కంపెనీ షేర్లు అమెరికా స్టాక్ మార్కెట్లో లిస్ట్ అవ్వడంతో, ఆ సంస్థ అధినేత ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్‌గా అవతరించి సరికొత్త చరిత్ర సృష్టించారు.

CR Reddy
Published on: 13 Jun 2026 7:47 AM IST
Elon Musk
X

Elon Musk 

Elon Musk : ప్రపంచ ఆర్థిక చరిత్రలో 2026 జూన్ 12వ తేదీ ఒక మరుపురాని మైలురాయిగా నిలిచిపోనుంది. ఈ తేదీని అంత సులభంగా ఎవరూ మర్చిపోలేరు. ఎందుకంటే, ప్రపంచవ్యాప్తంగా ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ప్రముఖ అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్‌ఎక్స్ షేర్లు అమెరికా స్టాక్ మార్కెట్లో అధికారికంగా నమోదయ్యాయి. ఈ అద్భుత పరిణామంతో ఆ కంపెనీ సృష్టించిన రికార్డుల కంటే, దాని అధిపతి ఎలాన్ మస్క్ సృష్టించిన రికార్డే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్టింగ్ ద్వారా ఎలాన్ మస్క్ ప్రపంచంలోనే మొట్టమొదటి ట్రిలియనీర్(లక్ష కోట్ల డాలర్లు.. అంటే మన భారతీయ కరెన్సీలో సుమారు రూ.95 లక్షల కోట్లకు పైగా సంపద కలిగిన వ్యక్తి)గా అవతరించారు. ఇప్పటివరకు మానవ చరిత్రలో ఈ స్థాయి సంపదను సొంతం చేసుకున్న ఏకైక వ్యక్తి మస్క్ మాత్రమే కావడం విశేషం.

నాస్‌డాక్‌లో స్పేస్‌ఎక్స్ షేర్ల ఊచకోత

ఈ అద్భుతం ఎలా సాధ్యమైందనే విషయానికి వస్తే.. శుక్రవారం అమెరికాలోని ప్రముఖ స్టాక్ ఎక్స్ఛేంజ్ నాస్‌డాక్‎లో స్పేస్‌ఎక్స్ షేరు ఏకంగా 150 డాలర్ల వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. కంపెనీ నిర్ణయించిన పబ్లిక్ ఇష్యూ ధర 135 డాలర్లతో పోలిస్తే ఇది 11 శాతం కంటే ఎక్కువ లాభం. ఈ భారీ ఓపెనింగ్‌తో ఏరోస్పేస్ దిగ్గజం స్పేస్‌ఎక్స్ కంపెనీ మొత్తం మార్కెట్ విలువ ఒక్కసారిగా 1.96 లక్షల కోట్ల డాలర్లకు (మన కరెన్సీలో రూ.186 లక్షల కోట్లకు పైగా) చేరుకుంది. దీనితో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా అమెరికాలోనే అతిపెద్ద ఆరవ కంపెనీగా స్పేస్‌ఎక్స్ నిలిచింది. ఈ మెగా ఐపీఓ ద్వారా కంపెనీ దాదాపు 75 బిలియన్ డాలర్ల విలువైన షేర్లను విజయవంతంగా విక్రయించింది. బ్లూమ్‌బర్గ్ న్యూస్ నివేదిక ప్రకారం.. ఈ ఐపీఓలో ఇన్వెస్ట్ చేసిన సంస్థాగత మదుపర్లలో 70 శాతం మంది దీర్ఘకాలిక లాభాల కోసమే పెట్టుబడులు పెట్టడం విశేషం. న్యూయార్క్ నగరంలోని నాస్‌డాక్ మార్కెట్‌సైట్ వేదికగా కంపెనీ ప్రెసిడెంట్ గ్విన్ షాట్‌వెల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ బ్రెట్ జాన్సన్ సాంప్రదాయ ప్రారంభ గంటను మోగించి ట్రేడింగ్‌ను ప్రారంభించారు.

లక్షన్నర కోట్లకు చేరిన ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద

ఎలాన్ మస్క్ సంపద కేవలం ఒక్క రోజులోనే ఈ స్థాయికి చేరలేదు, దానికి స్పేస్‌ఎక్స్ ఐపీఓ అగ్నికి ఆజ్యం పోసినట్లు అయింది. ఐపీఓ షేరు విలువను 135 డాలర్లుగా ఖరారు చేసిన గురువారం నాటికే మస్క్ మొత్తం ఆస్తుల విలువ 982 బిలియన్ డాలర్ల పై నిలిచింది. ఇక శుక్రవారం మార్కెట్లు ప్రారంభమై షేరు 150 డాలర్ల మార్కును తాకగానే మస్క్ సంపద ట్రిలియన్ డాలర్ల క్లబ్‌ను దాటేసింది. స్పేస్‌ఎక్స్ కంపెనీలో ఎలాన్ మస్క్‌కు సొంతంగా 480 కోట్ల షేర్లు ఉన్నాయి. దీనితో ఆయన కేవలం స్పేస్‌ఎక్స్ ద్వారానే భారీ లబ్ధి పొందారని, ఆయన మొత్తం సంపద 1.1 ట్రిలియన్ డాలర్లకు చేరిందని ప్రముఖ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ అంచనా వేసింది. మస్క్‌కు కేవలం స్పేస్‌ఎక్స్ మాత్రమే కాదు, 1.5 లక్షల కోట్ల డాలర్ల విలువైన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాలో 10 శాతం నేరుగా వాటా, 8 శాతం స్టాక్ ఆప్షన్స్ ఉన్నాయి. దీనితో పాటు మానవ మెదడులో చిప్‌లు అమర్చే మరో విప్లవాత్మక అంకుర సంస్థ న్యూరాలింక్, సొరంగాల నిర్మాణ సంస్థ బోరింగ్ కంపెనీలలో కూడా భారీగా వాటాలు ఉన్నాయి.

రాత్రికి రాత్రే పెరిగిన రేటు

శుక్రవారం రాత్రి ట్రేడింగ్ ముగిసే సమయానికి స్పేస్‌ఎక్స్ షేర్లు ఇన్వెస్టర్లను మరింత ఆశ్చర్యపరిచాయి. రాత్రి 11:45 గంటల ప్రాంతంలో నాస్‌డాక్ మార్కెట్లో స్పేస్‌ఎక్స్ షేరు ధర ఏకంగా 169.85 డాలర్ల వద్ద ట్రేడ్ అవుతూ కనిపించింది. ఈ సూపర్ ట్రెండ్ కారణంగా కంపెనీ మొత్తం మార్కెట్ విలువ అంతకంతకూ పెరిగి ఏకంగా 2.22 లక్షల కోట్ల డాలర్ల మార్కును తాకింది. కంపెనీ షేర్లు రాకెట్ వేగంతో దూసుకుపోవడంతో, దానికి అనుగుణంగానే మన ట్రిలియనీర్ ఎలాన్ మస్క్ వ్యక్తిగత సంపద విలువ రాత్రికి రాత్రే 1.2 ట్రిలియన్ డాలర్లకు (రూ.100 లక్షల కోట్లపైనే) చేరింది. ఈ అద్భుతమైన మార్కెట్ ఎంట్రీతో అంతరిక్ష రంగంలోనే కాకుండా ప్రపంచ బిజినెస్ మార్కెట్లోనూ ఎలాన్ మస్క్ తిరుగులేని చక్రవర్తిగా మారిపోయారని చెప్పవచ్చు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story