Gold Price Today : బులియన్ మార్కెట్‌లో మళ్లీ మొదలైన పసిడి పరుగు.. సామాన్యులకు షాకిస్తున్న బంగారం ధరలు
Gold Price Today : హైదరాబాద్, విజయవాడలో బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,46,080 గా ఉండగా, కిలో వెండి ధర రూ.2,55,000 మార్కును తాకింది.
Gold Price Today
Gold Price Today : బంగారం, వెండి ధరలు ఎప్పుడూ ఒకేలా ఉండవు అనే విషయం అందరికీ తెలిసిందే. బులియన్ మార్కెట్‌లో తగ్గినట్లే తగ్గిన పసిడి, వెండి ధరలు క్రమంగా మళ్లీ పెరగడం ప్రారంభించాయి. వాస్తవానికి అంతర్జాతీయంగా జరుగుతున్న రకరకాల రాజకీయ, ఆర్థిక పరిణామాల ప్రకారం ప్రతిరోజూ గోల్డ్, సిల్వర్ ధరల్లో హెచ్చుతగ్గులు చోటుచేసుకుంటూ ఉంటాయి. అయితే గత కొన్ని రోజులుగా ఇరాన్, అమెరికా మధ్య నడుస్తున్న యుద్ధ వాతావరణం, అలాగే ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో చోటుచేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల బంగారం, వెండి ధరలు హిస్టారికల్ రికార్డు స్థాయికి చేరుకున్నాయి.
భారీ తగ్గుదల తర్వాత మళ్లీ పెరుగుదల
ఈ వారం మధ్యలో బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. ఈ క్రమంలోనే శుక్రవారం రోజున పది గ్రాముల బంగారంపై ఏకంగా రూ.3,600 మేర భారీగా ధర తగ్గడంతో కొనుగోలుదారులు ఎంతో సంతోషించారు. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. శనివారం నాటికి మళ్లీ రూ.230 వరకు స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్‌లో మళ్లీ యుద్ధ తీవ్రత పెరగడం, పరస్పర దాడులు చేసుకోవడం, కీలకమైన హర్మూజ్ జలసంధిని మళ్లీ మూసేయడం లాంటి పరిస్థితుల వల్ల మున్ముందు బంగారం ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.
ఆదివారం దేశీయంగా బంగారం, వెండి ధరలు
ఆదివారం ఉదయానికి గోల్డ్, సిల్వర్ రేట్లు మార్కెట్‌లో స్థిరంగా కొనసాగుతున్నాయి. ప్రముఖ వెబ్‌సైట్ల ఆధారంగా అందుబాటులో ఉన్న ధరల ప్రకారం దేశీయంగా అత్యంత స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,46,080 వద్ద ట్రేడ్ అవుతోంది. అదే సమయంలో ఆభరణాల తయారీకి ఉపయోగించే 22 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.1,33,900లుగా నమోదైంది. ఇక వెండి ధరల విషయానికి వస్తే దేశంలో సగటున కిలో వెండి ధర ఏకంగా రూ.2,50,000 ల వద్ద కొనసాగుతోంది. అయితే ఈ ధరలు వివిధ రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా స్థానిక పన్నులను బట్టి మారుతుంటాయి.
తెలుగు రాష్ట్రాల్లో పసిడి, వెండి రేట్ల హల్చల్
మన తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల విషయానికి వస్తే.. హైదరాబాద్‌లో ఈరోజు 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,46,080 గా ఉంది. అలాగే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,33,900గా కొనసాగుతోంది. అయితే భాగ్యనగరంలో వెండి ధర దేశ సగటు కంటే కాస్త ఎక్కువగా కిలో రూ.2,55,000 లుగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ నగరాలైన విజయవాడ, విశాఖపట్నంలో కూడా ఇవే ధరలు వర్తిస్తున్నాయి. అక్కడ కూడా 24 క్యారెట్ల పసిడి రూ.1,46,080 మరియు 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,33,900 వద్ద ఉండగా, కిలో వెండి ధర రూ.2,55,000 లుగా రికార్డు అయింది.
దేశంలోని ఇతర మెట్రో నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయంటే
దేశ రాజధాని ఢిల్లీలో మిగిలిన నగరాల కంటే బంగారం ధర కాస్త ఎక్కువగా ఉంది. అక్కడ 24 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర రూ.1,46,230 గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.1,34,050 గా ఉంది. ఢిల్లీలో కిలో వెండి ధర రూ.2,50,000 లుగా ఉంది. ఆర్థిక రాజధాని ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,46,080 గా, 22 క్యారెట్ల ధర రూ.1,33,900 గా ట్రేడ్ అవుతోంది. చెన్నై నగరంలో ఎప్పుడూ బంగారం రేట్లు ఎక్కువగా ఉంటాయి, అక్కడ 24 క్యారెట్ల ధర రూ.1,48,370 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,36,000 లుగా ఉంది. ఐటీ హబ్ బెంగళూరులో 24 క్యారెట్లకు రూ.1,46,080, 22 క్యారెట్లకు రూ.1,33,900 ధరలు ఉన్నాయి.




