Gold Rate: పసిడి ప్రియులకు పండగే.. భారీగా దిగివచ్చిన బంగారం ధరలు..!

Gold Rate: మే 6, 2026న బంగారం ధరలు భారీగా తగ్గాయి. పది గ్రాముల బంగారం లక్షన్నర లోపుకు చేరుకుంది.

Naresh.k
Published on: 6 May 2026 8:58 AM IST
Gold Rate
X

Gold Rate: పసిడి ప్రియులకు పండగే.. భారీగా దిగివచ్చిన బంగారం ధరలు..!

Gold Price: గత కొద్ది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోతున్న బంగారం ధరలు నేడు సామాన్యులకు కాస్త ఊరటనిచ్చాయి. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో పసిడి ధరలు తగ్గడం కొనుగోలుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఈరోజు పసిడి మరియు వెండి ధరలు గణనీయంగా క్షీణించాయి.

నగరాల వారీగా పసిడి సందడి

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం పది గ్రాముల ధర లక్షా నలభై తొమ్మిది వేల నూట డెబ్బై రూపాయలకు పడిపోయింది. అలాగే ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములకు లక్షా ముప్పై ఆరు వేల ఏడు వందల నలభై రూపాయలకు చేరుకుంది. హైదరాబాద్, ముంబై ,బెంగళూరు నగరాల్లో పసిడి ధరలు ఇవే స్థాయిలో కొనసాగుతుండగా, దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర లక్షా నలభై తొమ్మిది వేల రెండు వందల ఇరవై రూపాయలుగా నమోదైంది. చెన్నైలో మాత్రం ధర కొంత ఎక్కువగా ఉండి లక్షా యాభై వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. విజయవాడ, విశాఖపట్నంలలో కూడా ధరలు హైదరాబాద్‌కు సమానంగానే ఉన్నాయి.

వెండి ధరల పరిస్థితి

బంగారంతో పాటే వెండి కూడా తన పరుగును తగ్గించింది. భారత మార్కెట్‌లో కిలో వెండి ధర ప్రస్తుతం రెండు లక్షల అరవై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద కొనసాగుతోంది. అయితే ఢిల్లీ, ముంబై ,బెంగళూరు వంటి నగరాల్లో కిలో వెండి ధర రెండు లక్షల యాభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయల వద్ద లభిస్తోంది. నగరాలను బట్టి వెండి ధరల్లో సుమారు పది వేల రూపాయల వరకు వ్యత్యాసం కనిపిస్తోంది.

ధరలు తగ్గడానికి కారణాలేంటి?

పసిడి ధరలు ఇంతలా దిగిరావడానికి ప్రధానంగా అంతర్జాతీయ పరిణామాలు కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత సడలడంతో పెట్టుబడిదారులు సురక్షితమైన బంగారం నుంచి తమ నిధులను ఇతర ఆస్తుల వైపు మళ్లిస్తున్నారు. దీనికి తోడు అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు ,డాలర్ ఇండెక్స్ బలోపేతం కావడం పసిడిపై ఒత్తిడి పెంచింది. ముఖ్యంగా ధరలు గరిష్ట స్థాయికి చేరడంతో ఇన్వెస్టర్లు భారీగా లాభాలను స్వీకరించడానికి అమ్మకాలకు మొగ్గు చూపడం కూడా ధరల తగ్గుదలకు మరో ప్రధాన కారణం.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story