Gold: ఊరిస్తున్న బంగారం...అయోమయంలో కొనుగోలుదారులు

అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్తతలకు చెక్‌ పడబోతుందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో ఊరటనిచ్చిన బంగారం ధరలు మరలా పుంజుకుంటాయని నిపుణులు చెబుతున్నారు.

Balachander
Published on: 3 Aug 2026 8:29 AM IST
Gold: ఊరిస్తున్న బంగారం...అయోమయంలో కొనుగోలుదారులు
X

Gold: భారతీయ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు పసిడి ప్రియులకు, కొనుగోలుదారులకు తీవ్ర అయోమయాన్ని కలిగిస్తున్నాయి. గతవారం పసిడి ధర స్వల్పంగా రూ.710 మేర తగ్గినప్పటికీ, భౌగోళిక రాజకీయ పరిణామాలు మళ్లీ ధరల పెరుగుదలకు దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్‌పై ప్రణాళికాబద్ధమైన దాడులను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తాత్కాలికంగా నిలిపివేయడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం వంటి అంశాలు అంతర్జాతీయ మార్కెట్‌ను ప్రభావితం చేస్తున్నాయి. ఈ పరిస్థితుల నేపథ్యంలో విశ్లేషకులు పసిడి ధరలు మళ్లీ పుంజుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

ఆగస్టు 3న హైదరాబాద్, ఏపీ నగరాల్లో పసిడి ధరలు

బులియన్‌ మార్కెట్‌ వివరాల ప్రకారం... ఆగస్టు 3న ఉదయం హైదరాబాద్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని ప్రధాన నగరాలైన విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, కాకినాడ, తిరుపతిలలో 10 గ్రాముల బంగారం ధరలు ఒకే రీతిగా నమోదయ్యాయి. తాజా సమాచారం ప్రకారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,44,210 వద్ద ఉండగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,32,190గా నమోదయింది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 1,08,150గా ఉండటం విశేషం.

కొనుగోలుదారుల్లో పెరుగుతున్న ఆందోళన

ధరలు స్వల్పంగా తగ్గిన సమయంలో ఆభరణాలు కొనుగోలు చేద్దామని భావించిన వినియోగదారులు, అంతర్జాతీయ మార్కెట్లలోని మార్పులతో మళ్లీ పెరుగుతాయేమోనని వెనకడుగు వేస్తున్నారు. ధరలు మరింత తగ్గుతాయా లేక దౌత్యపరమైన ఉద్రిక్తతల వల్ల ఆకాశాన్నంటుతాయా అనేది స్పష్టత లేకపోవడంతో సామాన్య కొనుగోలుదారులు వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు. బంగారం ధరల్లో స్వల్ప మార్పులు మాత్రమే ఉంటాయని, అవసరాలకు తగినవిధంగా కొనుగోలు దారులు కొనుగోలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారని తాజా గణాంకాలు చెబుతున్నాయి. అంతర్జాతీయంగా క్రూడ్‌ ఆయిల్‌ ధరలు పెరిగితే...బంగారం ధరలు తగ్గుతాయి. క్రూడ్‌ ఆయిల్‌ ధరలు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి.

Balachander

Balachander

బాలచందర్ పెళ్లూరి తెలుగు మీడియా రంగంలో 12 ఏళ్లకు పైగా అనుభవం కలిగిన సీనియర్ న్యూస్, పొలిటికల్, భక్తి కంటెంట్ రైటర్, ఎడిటర్. హైదరాబాద్ కేంద్రంగా టీవీ, డిజిటల్ జర్నలిజంలో పనిచేశారు. పొలిటికల్ విశ్లేషణ, ఆధ్యాత్మిక రచనల్లో నైపుణ్యం కలిగి, పొలిటికోస్, ఎన్‌టీవీ డిజిటల్, మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్‌లో సేవలందించారు. ఎడిటోరియల్ లీడర్‌షిప్, కథనం చెప్పే శైలిలో ప్రత్యేక గుర్తింపు పొందారు.

Next Story