Gold Price Today: తగ్గినట్టే తగ్గి సడన్‌గా షాకిచ్చిన పసిడి ధరలు.. రాబోయే రోజుల్లో రేట్లు తగ్గుతాయా?

Gold Price Today: అంతర్జాతీయ ఉద్రిక్తతలు తగ్గేవరకు బంగారం, వెండి ధరలలో ఊరట లభించడం కష్టంగానే కనిపిస్తోంది.

CR Reddy
Published on: 18 Aug 2026 7:29 AM IST
Gold Price Today
X

Gold Price Today

Gold Price Today: పుత్తడి కొనాలనుకునే వారికి మళ్లీ నిరాశే ఎదురవుతోంది. కొద్ది రోజులుగా తగ్గు ముఖం పట్టిన బంగారం ధరలు మళ్లీ ఆకాశాన్ని తాకేందుకు పరుగెడుతున్నాయి. అంతర్జాతీయంగా నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావంతో ఆభరణాల ధరలు ఎగబాకుతుండటంతో కొనుగోలుదారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. పసిడి బాటలోనే వెండి పయనిస్తూ షాక్ ఇస్తోంది. గత కొన్ని రోజులుగా స్వల్పంగా తగ్గుతూ ఊరటనిచ్చిన పసిడి ధరలు ఉన్నట్టుండి మళ్లీ ఎగబాకుతున్నాయి. వారం వ్యవధిలోనే తులం బంగారంపై రూ.3 వేలకు పైగా పెరగడం విశేషం. మంగళవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం 24 క్యారెట్ల ప్యూర్ గోల్డ్ 10 గ్రాములపై రూ.10 పెరిగి రూ.1,55,670 మార్కును చేరింది. ఆభరణాల తయారీకి వాడే 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర కూడా రూ.10 స్వల్పంగా పెరిగి రూ.1,42,710 వద్ద కొనసాగుతోంది. వెండి కిలో ధరపై రూ.100 తగ్గి రూ.2,49,900గా నమోదైంది.

పసిడి మంటకు అసలు కారణాలు ఇవే

గ్లోబల్ మార్కెట్‌లో నెలకొన్న విపరీతమైన మార్పులే దేశీయంగా ధరలు పెరగడానికి ప్రధాన కారణమని బులియన్ విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికా-ఇరాన్ మధ్య మొదలైన పోరుతో పాటు రష్యా-ఉక్రెయిన్ నడుమ యుద్ధం మళ్లీ తీవ్రరూపం దాల్చడం అంతర్జాతీయ పరిణామాలను గందరగోళంలోకి నెట్టింది. ఇటువంటి ఉద్రిక్త పరిస్థితుల్లో పెట్టుబడిదారులు సురక్షితమైన మార్గంగా భావించే బంగారంపై భారీగా పెట్టుబడులు పెడతారు. ఫలితంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్, పసిడికి డిమాండ్ పెరిగి స్థానిక మార్కెట్లలో ధరలు భానుడి భగభగలను గుర్తుచేస్తున్నాయి.

తెలుగు నగరాల్లో బంగారం తులానికి ఎంతంటే?

స్థానిక పన్నులు, రవాణా ఖర్చులు బట్టి ప్రాంతాల వారీగా పసిడి ధరల్లో వ్యత్యాసాలు ఉంటాయి. మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.1,55,670 కాగా, 22 క్యారెట్ల ధర రూ.1,42,710గా ఉంది. ఇక్కడ వెండి కిలో ధర రూ.2,54,900గా ఉంది. ఇతర మెట్రో నగరాలైన ఢిల్లీలో 24 క్యారెట్లు రూ.1,55,820, ముంబై, చెన్నై, బెంగళూరు నగరాల్లో రూ.1,55,670 వద్ద వర్తకం అవుతోంది. ధరలు రోజురోజుకూ సరికొత్త రికార్డులను తాకుతుండటంతో పెళ్లిళ్లు, శుభకార్యాలకు బంగారం కొనాలనుకునే సామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఈ ధరలు మరింత పెరిగే సూచనలే కనిపిస్తున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

CR Reddy

CR Reddy

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, ఆటోమొబైల్, స్పోర్ట్స్, మూవీస్, టెక్నాలజీ, పాలిటిక్స్, వైరల్, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా ఆటోమొబైల్, బిజినెస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story