Gold: ఇంట్లో బీరువాలో ఉన్న బంగారంతో డబ్బులు సంపాదించే అవకాశం.. త్వరలోనే కొత్త విధానం.
Gold: బ్యాంకుల్లో FD (ఫిక్స్డ్ డిపాజిట్) చేయడం పెట్టుబడికి చాలామంది ఎంచుకునే మార్గం.
Gold: ఇంట్లో బీరువాలో ఉన్న బంగారంతో డబ్బులు సంపాదించే అవకాశం.. త్వరలోనే కొత్త విధానం.
Gold: బ్యాంకుల్లో FD (ఫిక్స్డ్ డిపాజిట్) చేయడం పెట్టుబడికి చాలామంది ఎంచుకునే మార్గం. అయితే ఇంట్లో ఉన్న బంగారంతో కూడా ఆదాయం పొందే అవకాశం త్వరలో అందుబాటులోకి రావచ్చు. ప్రజల ఇళ్లలో ఉన్న బంగారాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం కొత్త విధానంపై కసరత్తు చేస్తోంది.
ప్రభుత్వం ఏం చేయబోతోంది?
ప్రజల వద్ద ఉన్న బంగారు ఆభరణాలు, నాణేలు, గోల్డ్ బార్లు వంటి వాటిని సమీపంలోని సర్టిఫైడ్ జ్యువెలరీ దుకాణాల్లో జమ చేసే విధంగా కొత్త విధానాన్ని తీసుకురావాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకు బదులుగా బంగారం విలువ ఆధారంగా వినియోగదారులకు వడ్డీ లేదా ఇతర ఆర్థిక ప్రయోజనం కల్పించే అవకాశం ఉంది. అయితే ఈ పథకానికి సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించలేదు. ప్రస్తుతం దీనిపై చర్చలు, కసరత్తు జరుగుతున్నట్లు సమాచారం.
జ్యువెలర్లతో ప్రభుత్వం ఎందుకు చర్చిస్తోంది?
ఈ కొత్త విధానంలో జ్యువెలరీ దుకాణాలు, బంగారం వ్యాపారులు కీలక పాత్ర పోషించనున్నారు. అందుకే ప్రభుత్వం ముందుగా జ్యువెలర్లు, గోల్డ్ వ్యాపారులతో చర్చలు జరుపుతోంది. బంగారం స్వచ్ఛతను పరీక్షించడం, దాని విలువను నిర్ణయించడం, జమ చేసుకోవడం, అవసరమైన ప్రక్రియలను పూర్తి చేయడం వంటి అంశాలపై స్పష్టమైన విధానం రూపొందించాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత పథకం ఎలా అమలు చేయాలనే దానిపై ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
ఈ పథకం ప్రధాన ఉద్దేశం ఏంటి?
భారతీయ కుటుంబాల వద్ద భారీ మొత్తంలో బంగారం ఇళ్లలోనే నిల్వగా ఉంది. ఈ బంగారంలో కొంత భాగాన్ని ఆర్థిక వ్యవస్థలోకి తీసుకురావడమే పథకం ప్రధాన ఉద్దేశం. ఇళ్లలో నిరుపయోగంగా ఉన్న బంగారం మార్కెట్లోకి వస్తే దేశానికి కూడా ప్రయోజనం కలగవచ్చు. ముఖ్యంగా బంగారం దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి ఇది ఉపయోగపడే అవకాశం ఉంది. అలాగే దేశంలో పెట్టుబడులకు అందుబాటులో ఉండే నిధులు పెరగవచ్చు.
2015లో కూడా గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్
కేంద్ర ప్రభుత్వం 2015లోనే గోల్డ్ మోనిటైజేషన్ స్కీమ్ (Gold Monetisation Scheme)ను ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ప్రజలు తమ వద్ద ఉన్న బంగారాన్ని బ్యాంకులు లేదా నిర్దేశిత కేంద్రాల్లో జమ చేసి దానిపై రాబడి పొందే అవకాశం కల్పించారు.
అయితే బంగారాన్ని జమ చేయడానికి బ్యాంకులు లేదా నిర్దేశిత టెస్టింగ్ కేంద్రాలకు వెళ్లాల్సి రావడంతో చాలామంది ఆసక్తి చూపలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, 2015 నుంచి 2025 వరకు సుమారు 38 టన్నుల బంగారం మాత్రమే ఈ పథకం ద్వారా జమ అయింది.
కొత్త విధానంతో ఏం మారొచ్చు?
గతంలో ఎదురైన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని, కొత్త విధానాన్ని మరింత సులభంగా, ప్రజలకు అందుబాటులో ఉండేలా రూపొందించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ప్రజలకు సమీపంలోని సర్టిఫైడ్ జ్యువెలర్ల ద్వారా బంగారాన్ని జమ చేసే విధానం అమలు చేస్తే ప్రక్రియ సులభం కావచ్చు. అయితే వడ్డీ రేటు ఎంత ఉంటుంది, బంగారాన్ని ఎలా అంచనా వేస్తారు, ఎంతకాలానికి జమ చేయాలి, ఎలాంటి నిబంధనలు ఉంటాయి వంటి వివరాలను ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.




