Gas Charges: హోటళ్లలో గ్యాస్ ఛార్జీలపై నిషేధం..బిల్లులో ఆ ఛార్జీ వేస్తే ఇలా చేయండి
Gas Charges: మధ్య ప్రాచ్యంలో యుద్ధం నేపథ్యంలో ఎల్పీజీ ధరలు పెరగడాన్ని సాకుగా చూపి, హోటళ్లు రెస్టారెంట్లు గ్యాస్ ఛార్జీ వసూలు చేయకూడదని కేంద్రం చెప్పింది.
Gas Charges
Gas Charges: మధ్య ప్రాచ్యంలో యుద్ధం మొదలు కాగానే, ప్రభుత్వం ఎల్పీజీ (LPG) పై అనేక నియమ నిబంధనలు విధించింది. కమర్షియల్ ఎల్పీజీ ధరలను ప్రభుత్వం పెంచింది. అలాగే కమర్షియల్ సిలిండర్లను కొన్ని రోజుల పాటు నిషేధించింది. సరిగ్గా ఇదే అదనుగా హోటళ్ల వారు బిల్లులపై ఐదు శాతం ఛార్జీని విధిస్తూ బిల్లులు ఇవ్వడం జరిగింది. పైగా ఆ ఛార్జీపై కూడా జీఎస్టీ (GST) వసూలు చేశారు హోటల్స్ నిర్వాహకులు.
ఈ నేపథ్యంలో హోటల్ లో కాఫీ తాగినా 5శాతం అధికంగా డబ్బు చెల్లించాల్సి వచ్చింది వినియోగదారులకు. ఈ నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు తమ ఆహార బిల్లులలో ధరతో పాటు అదనంగా గ్యాస్ ఛార్జీలు విధించరాదని ప్రభుత్వం నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఏ హోటల్ లేదా రెస్టారెంట్ అయినా ఈ నిబంధనలను ఉల్లంఘించి, గ్యాస్ సర్‌ఛార్జీ పేరుతో డబ్బులు వసూలు చేసినట్లు తెలిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ప్రభుత్వం ప్రకటించింది.
హోటళ్లు, రెస్టారెంట్లు ఇకపై వినియోగదారుల నుండి "ఎల్పిజి ఛార్జీ"ని వసూలు చేయలేవు. రెస్టారెంట్లు తమ ఆహార బిల్లులకు ధరతో పాటు కేవలం టాక్స్ లు మాత్రేమే యాడ్ చేయాలి. అంతకు మించి ఎటువంటి చార్జీలను విధించడానికి వీలు లేదని కేంద్రం స్పష్టం చేసింది.
ఎల్పీజీ సంక్షోభం నేపథ్యంలో, హోటళ్లు, రెస్టారెంట్లు తమ మెనూలో ఇచ్చే ధరలలో తమ ముడిసరుకు ఖర్చులన్నింటినీ తప్పనిసరిగా చేర్చాలని కేంద్ర వినియోగదారుల పరిరక్షణ అథారిటీ (సీసీపీఏ) పేర్కొంది. పెరుగుతున్న గ్యాస్ ధరలు లేదా ఇతర నిర్వహణ ఖర్చులను కారణంగా చూపి ఒక రెస్టారెంట్ బిల్లుకు అదనపు ఛార్జీని జోడిస్తే, దానిని నిబంధనల ఉల్లంఘనగా పరిగణిస్తారు.
ఇటీవల బెంగళూరులోని ఒక కేఫ్, ఒక కస్టమర్ ఆర్డర్ చేసిన రెండు మింట్ లెమనేడ్ల మొత్తం ₹358 బిల్లుపై, లెమనేడ్ బిల్లుపై 5% "గ్యాస్ సంక్షోభ ఛార్జీ"ని విధించింది. ఆ కేఫ్ ₹17.90 (5%) డిస్కౌంట్ చూపించి, తరువాత దానిపై 5% GST, 'గ్యాస్ సంక్షోభ ఛార్జ్' అంటే ₹17.01 జోడించింది. దీంతో మొత్తం బిల్లు ₹374 అయ్యింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలా దాదాపుగా అన్ని నగరాల్లోనూ జరిగింది.
సర్వీస్ ఛార్జీలను తప్పించుకునే ప్రయత్నాలు
'సర్వీస్ ఛార్జ్' ను తప్పించుకోవడానికి అనేక హోటళ్లు, రెస్టారెంట్లు కొత్త పేర్లను వాడుతున్నాయని CCPA దర్యాప్తులో తేలింది. ఇది వినియోగదారుల హక్కుల ఉల్లంఘన అని పేర్కొంటూ, కఠినమైన పర్యవేక్షణ, చర్యలు తీసుకోవాలని ఆ సంస్థ పిలుపునిచ్చింది.
బిల్లులో అలాంటి ఛార్జీలు కనిపిస్తే ఏం చేయాలి?
మీ బిల్లులో LPG ఛార్జ్, ఫ్యూయల్ ఛార్జ్ లేదా మరేదైనా అదనపు ఛార్జీలు కనిపిస్తే, దానిని తొలగించమని మీరు ముందుగా హోటల్ లేదా రెస్టారెంట్ యాజమాన్యాన్ని అడగాలని CCPA పేర్కొంది. వారు అలా చేయడానికి నిరాకరిస్తే, వినియోగదారులు నాలుగు విధాలుగా ఫిర్యాదు చేయవచ్చు.
- హెల్ప్‌లైన్ నంబర్: ఫిర్యాదు చేయడానికి జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ 1915కు కాల్ చేయండి.
- మొబైల్ యాప్: NCH యాప్ ద్వారా కూడా ఫిర్యాదును నమోదు చేయవచ్చు.
- ఇ-జాగృతి పోర్టల్: ఆన్లైన్ ఫిర్యాదు కోసం ఇ-జాగృతి పోర్టల్‌ని ఉపయోగించండి .
- కలెక్టర్‌కు ఫిర్యాదు: మీరు జిల్లా కలెక్టర్‌కు లేదా సీసీపీఏకు కూడా ఫిర్యాదు చేయవచ్చు.




