ఫ్రీలాన్లర్లుగా పని చేస్తుంటారా.? ఐటీ రిటర్న్ ఫైల్ చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
freelancer: ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ ఆదాయం పొందుతున్న వారు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను గడువులోగా దాఖలు చేయడం చాలా ముఖ్యం.
ఫ్రీలాన్లర్లుగా పని చేస్తుంటారా.? ఐటీ రిటర్న్ ఫైల్ చేసేప్పుడు ఈ జాగ్రత్తలు తప్పనిసరి
freelancer: ఫ్రీలాన్సర్‌గా పని చేస్తూ ఆదాయం పొందుతున్న వారు ఆదాయపు పన్ను రిటర్న్ (ITR)ను గడువులోగా దాఖలు చేయడం చాలా ముఖ్యం. అసెస్‌మెంట్ ఇయర్ (AY) 2026-27 కోసం ట్యాక్స్ ఆడిట్ అవసరం లేని వారికి ఆగస్టు 31 వరకు గడువు ఉంది. ట్యాక్స్ ఆడిట్ వర్తించే వారికి అక్టోబర్ 31 వరకు అవకాశం ఉంటుంది.
ఫ్రీలాన్సర్లు ఏ ITR ఫామ్ ఎంచుకోవాలి?
ఫ్రీలాన్సర్లు తమ ఆదాయం, అకౌంటింగ్ విధానాన్ని బట్టి ITR ఫారం ఎంపిక చేసుకోవాలి. పూర్తి ఆదాయ-వ్యయ లెక్కలు నిర్వహిస్తూ అకౌంట్ బుక్స్ నిర్వహిస్తున్నవారు ITR-3 దాఖలు చేయాలి. అయితే ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 44ADA కింద ఉండే ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ స్కీమ్‌ను ఎంచుకున్నవారికి ITR-4 సరిపోతుంది. ఈ విధానంలో పూర్తి స్థాయి అకౌంటింగ్ రికార్డులు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. ప్రభుత్వం నిర్దేశించిన నిబంధనల ప్రకారం ఆదాయాన్ని పరిగణనలోకి తీసుకుని పన్ను లెక్కిస్తారు.
ITR దాఖలు చేసే ముందు ఈ వివరాలు తప్పనిసరిగా సరిచూసుకోవాలి
ఫ్రీలాన్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని ఆదాయపు పన్ను రిటర్న్‌లో వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చిన ఆదాయంగా చూపించాలి. రిటర్న్ దాఖలు చేసే ముందు జారీ చేసిన ఇన్‌వాయిస్‌లు, అందుకున్న చెల్లింపులు, బ్యాంక్ స్టేట్‌మెంట్లు, Form 26AS, అన్యువల్ ఇన్ఫర్మేషన్ స్టేట్‌మెంట్ (AIS), TDS సర్టిఫికెట్లు, అకౌంట్ బుక్స్ వంటి అన్ని వివరాలను ఒకసారి పరిశీలించాలి. విదేశీ క్లయింట్ల నుంచి ఆదాయం వచ్చినట్లయితే, బ్యాంక్ ఖాతాలో జమ అయిన విదేశీ చెల్లింపుల వివరాలు కూడా సరిపోల్చుకోవాలి. ఇలా చేయడం వల్ల ఆదాయపు పన్ను శాఖ రికార్డులకు, మీరు సమర్పించే వివరాలకు మధ్య తేడాలు ఉండవు.
ఫ్రీలాన్స్ ఆదాయంపై పన్ను ఎలా లెక్కిస్తారు?
ఫ్రీలాన్స్ ద్వారా వచ్చిన ఆదాయాన్ని బిజినెస్ లేదా ప్రొఫెషనల్ ఆదాయంగా పరిగణిస్తారు. ఈ ఆదాయంలో వృత్తికి సంబంధించిన అర్హత కలిగిన ఖర్చులను తీసివేసిన తర్వాత మిగిలిన మొత్తంపైనే పన్ను విధిస్తారు. సెక్షన్ 44ADA కింద అర్హత ఉన్నవారు ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ విధానాన్ని ఎంచుకుంటే తక్కువ రికార్డులు నిర్వహిస్తే సరిపోతుంది.
ITR దాఖలు చేయడం కూడా సులభంగా ఉంటుంది. అయితే పని కోసం చేసే ఖర్చులు ఎక్కువగా ఉంటే రెగ్యులర్ ట్యాక్స్ విధానం ఎంచుకోవడం ద్వారా వాస్తవ ఖర్చులపై మినహాయింపులు పొందే అవకాశం ఉంటుంది. అందువల్ల ఏ విధానం మీకు ప్రయోజనకరమో ముందుగానే అంచనా వేసుకోవడం మంచిది.
విదేశీ ఆదాయం, పన్ను మినహాయింపుల విషయంలో గుర్తుంచుకోవాల్సిన విషయాలు
రెగ్యులర్ ట్యాక్స్ విధానంలో ఆఫీసు రెంట్, ఇంటర్నెట్, మొబైల్ బిల్లులు, సాఫ్ట్‌వేర్ ఖర్చులు, ప్రొఫెషనల్ ఫీజులు, పని కోసం చేసిన ప్రయాణ ఖర్చులు, వ్యాపారంలో ఉపయోగించే ఆస్తులపై డిప్రెషియేషన్, ఉద్యోగుల జీతాలు వంటి వృత్తికి సంబంధించిన ఖర్చులను మినహాయింపుగా చూపించవచ్చు. అయితే వ్యక్తిగత ఖర్చులకు పన్ను మినహాయింపు ఉండదు. విదేశీ క్లయింట్ల నుంచి ఆదాయం పొందిన వారు క్లయింట్‌తో చేసుకున్న ఒప్పందం, ఇన్‌వాయిస్‌లు, బ్యాంక్ చెల్లింపు రికార్డులు, విదేశీ చెల్లింపుల ధ్రువీకరణ పత్రాలు భద్రంగా ఉంచుకోవాలి.
ఒకవేళ అదే ఆదాయంపై విదేశాల్లో ఇప్పటికే పన్ను చెల్లించి ఉంటే, భారత్‌తో ఆయా దేశాలకు ఉన్న డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్ (DTAA) ప్రకారం రెండుసార్లు పన్ను చెల్లించాల్సిన అవసరం లేకుండా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది. అయితే ఈ విషయంలో తుది నిర్ణయం తీసుకునే ముందు ట్యాక్స్ నిపుణులను సంప్రదించడం ఉత్తమం.




