Forbes : ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ జాబితాలో సత్తా చాటిన తెలుగు కుర్రాళ్లు
Forbes : ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా-2026 జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు శివ గణేష్ గడ్డం, మధులాష్ బాబు క్రొవ్విడి స్థానం దక్కించుకున్నారు.
Forbes Asia 2026
Forbes : తెలుగు యువత అంతర్జాతీయ వేదికలపై తమ సత్తా చాటుతూ రికార్డులు సృష్టిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించే ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా-2026 జాబితాలో ఇద్దరు తెలుగు యువ పారిశ్రామికవేత్తలు అద్భుత స్థానాన్ని సంపాదించుకున్నారు. సమాజంలో సరికొత్త మార్పులు తీసుకురావాలనే సంకల్పంతో వారు చేసిన వినూత్న ఆవిష్కరణలే వారిని ఈ గ్లోబల్ లిస్టులో నిలబెట్టాయి. ఆర్థిక రంగానికి సంబంధించి సరికొత్త స్టార్టప్‌ను తీసుకొచ్చిన శివ గణేష్ గడ్డం ఒకరైతే, సామాజిక సేవా రంగంలో గ్రామీణ విద్యార్థుల కోసం అద్భుతాలు సృష్టిస్తున్న మధులాష్ బాబు క్రొవ్విడి మరొకరు. ఈ ఇద్దరు యువకులు తమ ఐడియాలతో నేటి తరం యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
చిన్నతనం నుంచే పిల్లలకు డబ్బు విలువ, పొదుపు చేయడం నేర్పించాలనే ఒక గొప్ప ఆశయంతో శివగణేష్ గడ్డం తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. నేటి డిజిటల్ యుగంలో డబ్బును ఎలా మేనేజ్ చేయాలనేది చాలా ముఖ్యం. అందుకే చిన్నారులకు, యువతకు సులభంగా అర్థమయ్యేలా కామిక్స్ (బొమ్మల కథల పుస్తకాలు) రూపంలో బడ్జెట్, పెట్టుబడులు, పొదుపు, ఇన్సూరెన్స్, బిజినెస్ మెన్లుగా ఎలా మారాలి? లాంటి కఠినమైన ఆర్థికాంశాలను నేర్పించేందుకు ఆయన జెని5 అనే అంకుర సంస్థను (స్టార్టప్) స్థాపించారు. ఆయన చేసిన ఈ వినూత్న ప్రయోగం అంతర్జాతీయంగా గుర్తింపు పొంది, ఫోర్బ్స్ జాబితాలోని ఫైనాన్స్ అండ్ వెంచర్ క్యాపిటల్ విభాగంలో చోటు దక్కించుకునేలా చేసింది.
శివగణేష్‌కు చెందిన జెని5 సంస్థ ఇప్పటికే ఎమర్జెంట్ వెంచర్స్ నుంచి ప్రతిష్టాత్మకమైన గ్రాంటును సొంతం చేసుకుంది. ఈ విజయంతో మరింత ఉత్సాహంగా అడుగులు వేస్తూ, ఈ ఏడాదిలోనే సంస్థను మరింత విస్తరించడానికి అవసరమైన సీడ్ రౌండ్ నిధులను సమీకరించేందుకు సర్వం సిద్ధం చేసుకుంటోంది. దీనితో పాటు విద్యార్థులకు నేరుగా ఆర్థిక సేవలను (ఫైనాన్షియల్ సర్వీసెస్) అందించాలనే పక్కా ప్లాన్‌తో, భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నుంచి అవసరమైన అధికారిక అనుమతులు పొందేందుకు ఈ సంస్థ ప్రస్తుతం శరవేగంగా పనిచేస్తోంది.
మరోవైపు, పశ్చిమగోదావరి జిల్లా పాలకోడేరు మండలం శృంగవృక్షం గ్రామానికి చెందిన మధులాష్ బాబు క్రొవ్విడి గ్రామీణ ప్రాంత విద్యార్థుల పాలిట ఆశాదీపంగా మారారు. సాంకేతికత, ఆధునిక ల్యాబ్ పరికరాలకు దూరంగా ఉంటున్న పల్లెటూరి పిల్లలకు సైన్స్ అండ్ టెక్నాలజీని చేరువ చేయడమే లక్ష్యంగా ఆయన హైదరాబాద్ వేదికగా ఎడోద్వజ ఫౌండేషన్‌ను ఏర్పాటు చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఖరీదైన హార్డ్‌వేర్ పరికరాలు, ల్యాబ్‌లు లేకపోవడాన్ని గమనించిన మధులాష్.. ఒక వినూత్నమైన ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. అదే ఫ్యూచరిస్టిక్ ల్యాబ్ ఆన్ వీల్స్ లేదా ఫ్లో బస్. ఒక పెద్ద బస్సులోనే అత్యాధునిక ల్యాబ్‌ను ఏర్పాటు చేసి పల్లెటూళ్లకు పంపడం ఈ ప్రాజెక్ట్ ప్రత్యేకత.
మధులాష్ బాబు వినూత్నంగా డిజైన్ చేసిన ఈ ఫ్లో బస్ ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పేద విద్యార్థులకు అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తోంది. ఇప్పటివరకు ఈ మొబైల్ బస్సు ల్యాబ్ ద్వారా దాదాపు 60,000 మందికి పైగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కంప్యూటర్స్, అత్యాధునిక హార్డ్‌వేర్ పరికరాలను నేరుగా చూసి, ఆపరేట్ చేయడం నేర్చుకున్నారు. ఈ సామాజిక విప్లవమే మధులాష్ బాబును ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా సామాజిక సేవా విభాగంలో నిలబెట్టింది. తెలుగు రాష్ట్రాల ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చాటిచెప్పిన ఈ ఇద్దరు యువ పారిశ్రామికవేత్తలపై ప్రస్తుతం ప్రశంసల జల్లు కురుస్తోంది.




