UPI : యూపీఐ ఛార్జీలపై వార్తల్లో నిజమెంత?.. క్లారిటీ ఇచ్చిన నిర్మలా సీతారామన్
UPI : యూపీఐ లావాదేవీల ఛార్జీలపై వ్యాపిస్తున్న ప్రచారాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఖండించారు.
UPI
UPI : భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన యూపీఐ సర్వీసుల మీద ఛార్జీలు విధించబోతున్నారనే వార్తలు గత కొన్ని రోజులుగా చర్చనీయాంశమయ్యాయి. ఈ విషయమై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోషల్ మీడియా వేదికగా ఘాటుగా సమాధానమిచ్చారు. డిజిటల్ పేమెంట్స్ జరిపే సామాన్య వినియోగదారులపై రూపాయి కూడా అదనపు భారం పడదని, యూపీఐ సేవలు గతంలో లాగే ఉచితంగా అందుబాటులో ఉంటాయని ఆమె స్పష్టం చేశారు.
ఎండీఆర్ ఛార్జీల అసలు నిజమేంటి?
కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన చట్ట సవరణల వల్ల మర్చంట్ డిస్కౌంట్ రేట్ (MDR) అమల్లోకి వస్తుందని, దానివల్ల వినియోగదారులు కూడా ఛార్జీలు చెల్లించాల్సి వస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆర్థిక మంత్రి తీవ్రంగా తోసిపుచ్చారు. ఎండీఆర్ అనేది కేవలం వ్యాపారులకు మాత్రమే వర్తిస్తుందని, సాధారణ ప్రజలకు దీనితో ఎలాంటి సంబంధం లేదని క్లారిటీ ఇచ్చారు. డిజిటల్ లావాదేవీలకు సంబంధించిన మౌలిక సదుపాయాలు మెరుగుపరచడం, సైబర్ భద్రతను బలోపేతం చేయడం, బ్యాంకులు, ఫిన్‌టెక్ సంస్థలు కొత్త టెక్నాలజీ పై పెట్టుబడులు పెట్టడానికి వీలుగానే ఈ నిర్ణయాలు ఉంటాయని తెలిపారు. పేమెంట్ అండ్ సెటిల్‌మెంట్ యాక్ట్ సవరణ బిల్లు పార్లమెంట్ ఆమోదం పొందిన తర్వాతే దీనిపై ఎన్‌పిసిఐ తుది నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు.
కాంగ్రెస్ నేత జైరామ్ రమేశ్ తీవ్ర ఆరోపణలు
ఈ వివాదంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరామ్ రమేశ్ ఆందోళన వ్యక్తం చేస్తూ ట్విట్టర్‌లో సుదీర్ఘ సందేశాన్ని పోస్ట్ చేశారు. మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన పన్నులు, ఇతర చట్టాల (సవరణ) బిల్లు, 2026 వల్ల ఇప్పటివరకు ఉన్న రుసుం రహిత యూపీఐ వ్యవస్థకు చట్టబద్ధమైన రక్షణ లేకుండా పోతుందని ఆరోపించారు. క్రమంగా అన్ని డిజిటల్ చెల్లింపులకు ఈ ఛార్జీలు వర్తింపజేసి, చివరికి ఆ భారాన్ని సామాన్య ప్రజల తలపైనే మోపుతారని విమర్శించారు. యూపీఐ వ్యవస్థను ఉచితంగా నడపడానికి ఆర్‌బిఐకి తగినంత ఆర్థిక సామర్థ్యం ఉందని, ఇటీవలే ఆర్‌బిఐ రూ.2.86 లక్షల కోట్ల మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.
అమెరికా ఒత్తిడి వ్యాఖ్యలపై రాజుకున్న రాజకీయ రచ్చ
స్వదేశీ పేమెంట్ ప్లాట్‌ఫామ్‌లైన యూపీఐ, రూపే వంటి వ్యవస్థల వల్ల వీసా, మాస్టర్‌కార్డ్ వంటి అమెరికన్ కంపెనీలు నష్టపోతున్నాయని యూఎస్ ట్రేడ్ రిప్రజెంటేటివ్ 2026 నివేదికలో పేర్కొన్న అంశాలను జైరామ్ రమేశ్ ప్రస్తావించారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒత్తిడికి తలొగ్గే భారత ప్రభుత్వం యూపీఐ వ్యవస్థను బలహీనపరిచేలా నిర్ణయాలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు. గతంలో కూడా సుంకాల బెదిరింపులు, రష్యా చమురు దిగుమతుల తగ్గింపు, భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందాల విషయంలో మోదీ ప్రభుత్వం ఒత్తిళ్లకు లొంగిపోయిందని విమర్శించారు. అయితే విపక్షాలు ఏమీ లేని విషయాన్ని పట్టుకుని పార్లమెంట్‌ను సజావుగా సాగనివ్వకుండా అనవసర రచ్చ చేస్తున్నాయని నిర్మలా సీతారామన్ మండిపడ్డారు.




