ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త పేమెంట్ యాప్.. క్రెడిట్ కార్డు లేకుండానే నో కాస్ట్ EMIతో షాపింగ్
Flipkart: ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభంగా మార్చేందుకు ఫ్లిప్‌కార్ట్ కొత్త అడుగు వేస్తోంది.
ఫ్లిప్‌కార్ట్ నుంచి కొత్త పేమెంట్ యాప్.. క్రెడిట్ కార్డు లేకుండానే నో కాస్ట్ EMIతో షాపింగ్
Flipkart: ఆన్‌లైన్ షాపింగ్‌ను మరింత సులభంగా మార్చేందుకు ఫ్లిప్‌కార్ట్ కొత్త అడుగు వేస్తోంది. ఇప్పటి వరకు UPI చెల్లింపుల కోసం ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌లను ఉపయోగిస్తున్న వినియోగదారులకు ప్రత్యామ్నాయంగా Super.money యాప్‌ను మరింత విస్తృత సేవలతో అందుబాటులోకి తీసుకురానుంది.
Super.money యాప్‌లో కొత్త షాపింగ్ ఫీచర్
ఫ్లిప్‌కార్ట్ తన Super.money యాప్‌లో 'స్ప్లిట్ స్టోర్' పేరుతో కొత్త ఆన్‌లైన్ షాపింగ్ ఫీచర్‌ను ప్రారంభించింది. దీని ద్వారా స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఫ్యాషన్ ఉత్పత్తులు, గృహోపకరణాలు వంటి అనేక వస్తువులను యాప్‌లోనే కొనుగోలు చేయవచ్చు. అంటే ప్రత్యేకంగా మరో ఈ-కామర్స్ యాప్‌లోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా షాపింగ్ పూర్తి చేసే అవకాశం ఉంటుంది.
క్రెడిట్ కార్డు లేకుండానే నో కాస్ట్ EMI సౌకర్యం
ఈ యాప్‌లోని ప్రధాన ఆకర్షణ నో కాస్ట్ EMI సౌకర్యం. కొన్ని ఎంపిక చేసిన ఉత్పత్తులను వడ్డీ లేకుండా ఈఎంఐలపై కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇందుకోసం తప్పనిసరిగా క్రెడిట్ కార్డు ఉండాల్సిన పనిలేదు. అలాగే యాప్‌లోనే UPI, పీర్-టు-పీర్ (P2P) చెల్లింపుల ద్వారా డబ్బు పంపడం, చెల్లింపులు చేయడం కూడా సులభంగా చేయవచ్చు. ఒకే యాప్‌లో షాపింగ్‌తో పాటు పేమెంట్లు కూడా పూర్తి చేసుకునేలా ఫ్లిప్‌కార్ట్ ఈ సేవలను రూపొందిస్తోంది.
తొలుత కొంతమందికే..
Super.money సీఈఓ ప్రకాశ్ సికారియా మాట్లాడుతూ, UPI రంగంలో తమ యాప్ ఇప్పటికే మంచి స్థానం సంపాదించిందని తెలిపారు. ఫ్లిప్‌కార్ట్ బలమైన నెట్‌వర్క్, సాంకేతిక సామర్థ్యంతో ఈ సేవలను మరింత విస్తరిస్తామని చెప్పారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను కొంతమంది ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంచామని, త్వరలో దేశవ్యాప్తంగా అందరికీ అందిస్తామని వెల్లడించారు.
యువతకు, కొత్త క్రెడిట్ వినియోగదారులకు ఎక్కువ ప్రయోజనం
ఈ కొత్త ప్లాట్‌ఫామ్ ముఖ్యంగా Gen Z యువతతో పాటు మొదటిసారి క్రెడిట్ సౌకర్యాన్ని ఉపయోగించాలనుకునే వారికి ఉపయోగపడుతుందని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. బ్యాంకుల నుంచి సులభంగా రుణాలు లేదా క్రెడిట్ పొందలేని వారికి కూడా ఈ సేవలు ఉపయోగకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే వివిధ బ్రాండ్లు తమ ఉత్పత్తులను నేరుగా ఈ ప్లాట్‌ఫామ్‌లో విక్రయించగలవు. డెలివరీని కూడా ఆయా బ్రాండ్లే నిర్వహిస్తాయి.




