Fake App: ప్లేస్టోర్‌లోనే నకిలీ యాప్..గూగుల్‌పై కేసు..!

Fake App: గూగుల్ ప్లేస్టోర్‌లోని 'జీవీఎస్ ఇన్‌స్టిట్యూషన్' అనే నకిలీ యాప్ ద్వారా బిడిఎల్ ఉద్యోగి రూ. 7.95 లక్షలు నష్టపోయారు.

Naresh.k
Published on: 27 July 2026 11:47 AM IST
Fake App
X

Fake App: ప్లేస్టోర్‌లోనే నకిలీ యాప్..గూగుల్‌పై కేసు..!

Google Play Store: సైబర్ నేరగాళ్లు సరికొత్త పద్ధతుల్లో రెచ్చిపోతున్నారు. గూగుల్ ప్లేస్టోర్‌లో లభ్యమయ్యే యాప్‌లు సురక్షితమైనవేననే ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని లక్షల రూపాయలు కొల్లగొడుతున్నారు. ప్లేస్టోర్‌లోనే ఉన్న ఓ నకిలీ ఇన్వెస్ట్‌మెంట్ యాప్ ముసుగులో పడి, రామచంద్రాపురానికి చెందిన ఓ ప్రభుత్వ రంగ సంస్థ విశ్రాంత విభాగానికి చెందిన 58 ఏళ్ల ఉద్యోగి ఏకంగా రూ. 7.95 లక్షలు పోగొట్టుకున్నారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

రామచంద్రాపురానికి చెందిన బాధితుడికి ఇటీవల మార్కెట్ రీసెర్చ్ గ్రూప్ పేరుతో వాట్సప్‌లో ఓ సందేశం వచ్చింది. స్టాక్ మార్కెట్ ట్రేడింగ్, భారీ లాభాల పేరుతో సలహాలు ఇస్తూ ఆ గ్రూప్ సభ్యులు ఆయనను బురిడీ కొట్టించారు. అనంతరం ట్రేడింగ్ చేయడం కోసమంటూ గూగుల్ ప్లేస్టోర్ నుంచి జీవీఎస్ ఇన్‌స్టిట్యూషన్ అనే యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.

సాధారణంగా అనధికారిక ఏపీకే ఫైల్స్ కాకుండా, స్వయంగా అధికారిక గూగుల్ ప్లేస్టోర్‌లోనే లభ్యమవుతుండటంతో ఆ యాప్ సంపూర్ణంగా సురక్షితమైనదని బాధితుడు భావించారు. దాంతో ఈ నెల 10 నుంచి 26వ తేదీ మధ్య విడతల వారీగా మొత్తం రూ. 7.95 లక్షలు ఆ యాప్ సూచించిన ఖాతాల్లో పెట్టుబడి పెట్టారు. బాధితుడు పెట్టిన పెట్టుబడికి సదరు నకిలీ యాప్‌లో వర్చువల్‌గా ఏకంగా రూ. 27.75 లక్షల లాభం వచ్చినట్లు చూపించారు. దీంతో ఎంతో సంతోషపడిన బాధితుడు ఆ సొమ్మును తన బ్యాంకు ఖాతాకు విత్‌డ్రా చేసుకునేందుకు ప్రయత్నించారు. అయితే అక్కడే సైబర్ కేటుగాళ్లు తమ అసలు రంగు బయటపెట్టారు.

ఆ డబ్బు ఉపసంహరించుకోవాలంటే పన్నుల రూపంలో అదనంగా మరో రూ. 9.26 లక్షలు చెల్లించాలని కండిషన్ పెట్టారు. అదనపు డబ్బులు చెల్లిస్తే తప్ప విత్‌డ్రా కాదని స్పష్టం చేయడంతో, తాను తీవ్రంగా మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ముందస్తు తనిఖీలు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా మోసపూరితమైన నకిలీ యాప్‌ను తమ ప్లాట్‌ఫామ్‌పైకి అనుమతించిన గూగుల్ ఇండియా నోడల్ హెడ్‌పై, ,ఈ మోసానికి పాల్పడిన సైబర్ ముఠాపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, నకిలీ యాప్ క్రియేటర్లు , వాట్సప్ గ్రూప్ నిర్వాహకుల మూలాల కోసం వేట ప్రారంభించారు.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story