EV Sector: ఈవీ రంగంలో 4 కోట్ల ఉద్యోగాల సునామీ..!

EV Sector: భారతదేశంలో ఈవీ రంగం దూసుకెళ్తోంది. 2030 నాటికి 3-4 కోట్ల ఉద్యోగావకాశాలు రానున్నాయని అడెకో ఇండియా నివేదిక వెల్లడించింది.

Naresh.k
Updated on: 10 Aug 2026 12:03 PM IST
EV Sector
X

EV Sector: ఈవీ రంగంలో 4 కోట్ల ఉద్యోగాల సునామీ..!

EV Jobs: భారతదేశంలో విద్యుత్ వాహన (ఈవీ) విప్లవం వేగంగా పుంజుకుంటోంది. పర్యావరణ పరిరక్షణతో పాటు దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేలా ఎలక్ట్రిక్ వాహనాల రంగానికి ఆదరణ పెరుగుతోంది. ప్రముఖ నియామకాల సంస్థ 'అడెకో ఇండియా' 100కు పైగా కంపెనీల సమాచారంతో రూపొందించిన నివేదిక ప్రకారం, 2030 నాటికి ఈవీ ఎకోసిస్టమ్‌లో ఏకంగా 3 నుంచి 4 కోట్ల ఉద్యోగావకాశాలు రానున్నాయి.

అసలేం చెప్తోంది అడెకో నివేదిక? ఏటా 15–20% పెరుగుదల: ఈవీ రంగంలో నియామకాలు ఏటా 15-20 శాతం చొప్పున పెరిగే అవకాశం ఉంది. మొత్తం ఉద్యోగాల్లో 10–15 శాతం మాత్రమే ప్రత్యక్ష ఉపాధి కాగా, మిగిలిన 85–90 శాతం ఉద్యోగాలు పరోక్షంగా అంటే సప్లై చైన్, సర్వీసింగ్, ఛార్జింగ్ నెట్‌వర్క్, లాజిస్టిక్స్ మొదలైన రూపాల్లో లభించనున్నాయి. కేవలం అసెంబ్లీ లైన్ వర్కర్లకే కాకుండా.. బ్యాటరీ టెక్నాలజీ, పవర్ ఎలక్ట్రానిక్స్, స్పెషల్ ఇంజనీరింగ్, మోటార్లు, సెమీకండక్టర్స్ వంటి హైటెక్ విభాగాల్లో ఉన్న నిపుణులకు భారీగా డిమాండ్ పెరగనుంది.

ప్రస్తుతం అంతర్జాతీయ ఈవీ ప్యాసింజర్ కార్ల మార్కెట్‌లో భారత్‌ వాటా 4 శాతంగా ఉండగా, ద్విచక్ర వాహనాల విభాగంలో ఏకంగా 17 శాతం వాటాతో దూసుకెళ్తోంది. ప్రపంచ మార్కెట్‌లో భారత్‌ తన వాటాను మరింత పెంచుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఈవీ విధానాలు, పారిశ్రామిక పెట్టుబడులు ఎంతగానో తోడ్పడుతున్నాయి. ఈవీ తయారీ రంగంలో ప్రస్తుతం 50–55 శాతం డిమాండ్ తమిళనాడు, మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తెలంగాణ, ఢిల్లీ-ఎన్‌సీఆర్ వంటి సాంప్రదాయ ఆటోమొబైల్ క్లస్టర్లలోనే కేంద్రీకృతమై ఉంది.

అయితే రాబోయే రోజుల్లో గిగాఫ్యాక్టరీలు, బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్లు, విడిభాగాల పార్కులు టైర్-2, టైర్-3 నగరాలకు వేగంగా విస్తరిస్తున్నాయి. కొత్తగా రాబోయే నియామకాల్లో దాదాపు 70 శాతం ఉద్యోగాలు సంప్రదాయ ఆటో హబ్‌ల బయట ప్రాంతాల నుంచే రానున్నాయి. అంతేకాకుండా, తొలి దశలో 40–50 శాతం నియామకాలు కాంట్రాక్ట్ లేదా ఫ్లెక్సీ-స్టాఫింగ్ పద్ధతిలో ప్రారంభమై, ఆ తర్వాత శాశ్వత ఉద్యోగాలుగా మారతాయని నివేదిక స్పష్టం చేస్తోంది. మొత్తానికి, రాబోయే ఐదేళ్లలో ఈవీ రంగం భారతీయ యువతకు ఊహించని రీతిలో భారీ ఆశాకిరణంగా మారబోతోంది.

Naresh.k

Naresh.k

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.

Next Story