EPFO: UAN యాక్టివేషన్‌కు కొత్త విధానం.. ఇక UMANG యాప్‌లోనే సేవలు

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించిన సేవలను మరింత సులభంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేస్తోంది.

Mokshith
Published on: 10 Sept 2026 5:27 PM IST
EPFO
X

EPFO: UAN యాక్టివేషన్‌కు కొత్త విధానం.. ఇక UMANG యాప్‌లోనే సేవలు

EPFO: ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌కు సంబంధించిన సేవలను మరింత సులభంగా అందించేందుకు ఈపీఎఫ్ఓ కీలక మార్పులు చేస్తోంది. ఇప్పటివరకు పీఎఫ్ పోర్టల్ ద్వారా అందుబాటులో ఉన్న కొన్ని సేవలను మొబైల్‌ ఆధారితంగా మార్చింది.

UAN యాక్టివేషన్‌కు UMANG యాప్ తప్పనిసరి

UAN అనేది ఉద్యోగి పీఎఫ్ ఖాతాలకు సంబంధించిన ముఖ్యమైన గుర్తింపు నంబర్. ఉద్యోగం మారినప్పుడు కూడా పీఎఫ్ వివరాలను ఒకే ఖాతాతో అనుసంధానించేందుకు ఇది ఉపయోగపడుతుంది. గతంలో UAN యాక్టివేషన్ కోసం ఈపీఎఫ్ఓ పోర్టల్‌ను ఉపయోగించే అవకాశం ఉండేది. తాజాగా తీసుకొచ్చిన మార్పులతో ఈ ప్రక్రియను UMANG యాప్‌కు మార్చారు. ఇప్పటికే UAN నంబర్ ఉండి యాక్టివేట్ చేసుకోని ఉద్యోగులతో పాటు కొత్తగా ఉద్యోగంలో చేరేవారు కూడా మొబైల్‌ ద్వారానే ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. UAN లేని వారికి కొత్త నంబర్‌ పొందే సదుపాయం కూడా యాప్‌లోనే అందుబాటులో ఉంటుంది.

ఆధార్ ఫేస్ ఆథెంటికేషన్‌తో వెరిఫికేషన్

UAN కేటాయింపు, యాక్టివేషన్‌లో ఆధార్ ఆధారిత గుర్తింపు ప్రక్రియను ఉపయోగిస్తున్నారు. ఇందుకోసం ఉద్యోగి ఆధార్ నంబర్‌తో పాటు మొబైల్ నంబర్‌ను నమోదు చేయాలి. మొబైల్‌కు వచ్చిన OTP ద్వారా ప్రాథమిక ధ్రువీకరణ పూర్తవుతుంది. ఆ తర్వాత ఆధార్ ఫేస్ ఆర్డీ (Face RD) యాప్ సహాయంతో ముఖాన్ని స్కాన్ చేయాల్సి ఉంటుంది. ఈ బయోమెట్రిక్ ఆధారిత వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత వివరాలు సరిపోలితే UAN జనరేట్ లేదా యాక్టివేట్ అవుతుంది. కొత్త UAN కేటాయించిన సందర్భంలో ఆ నంబర్‌ను మొబైల్‌కు SMS ద్వారా పంపిస్తారు.

కొత్త UAN నంబర్‌ పొందడం ఎలా.?

ముందుగా మొబైల్‌లో UMANG యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఓపెన్ చేయాలి. అందులోని సెర్చ్ బార్‌లో EPFO అని టైప్ చేసి సంబంధిత సేవలను ఎంచుకోవాలి. అనంతరం UAN అలాట్‌మెంట్ అండ్ యాక్టివేష‌న్ ఆప్షన్‌లోకి వెళ్లాలి. అక్కడ అడిగిన ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ వివరాలను నమోదు చేసి OTP ద్వారా ధ్రువీకరించాలి. అవసరమైతే ఆధార్ ఫేస్ ఆర్డీ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసి ఫేస్ స్కాన్ పూర్తి చేయాలి. గుర్తింపు ప్రక్రియ విజయవంతంగా పూర్తయిన తర్వాత కొత్త UAN కేటాయిస్తారు. ఈ నంబర్‌ ఉద్యోగి రిజిస్టర్ చేసిన మొబైల్‌కు SMS రూపంలో వస్తుంది.

UAN యాక్టివేట్ అయితే ఎన్నో పీఎఫ్ సేవలు

ఇప్పటికే UAN నంబర్ ఉన్న ఉద్యోగులు కూడా ఇదే విధానంలో యాక్టివేషన్ పూర్తి చేసుకోవచ్చు. UMANGలో UAN Activation ఆప్షన్‌ను ఎంచుకుని ఆధార్, మొబైల్ వివరాలు నమోదు చేసిన తర్వాత ఫేస్ ఆథెంటికేషన్ చేయాలి. ప్రక్రియ పూర్తయిన అనంతరం పీఎఫ్‌కు సంబంధించిన పలు డిజిటల్ సేవలను మొబైల్ నుంచే ఉపయోగించుకోవచ్చు. పీఎఫ్ ఖాతాలో ఉన్న బ్యాలెన్స్ తెలుసుకోవడం, పాస్‌బుక్‌ చూడటం, క్లెయిమ్‌కు సంబంధించిన సేవలను వినియోగించడం వంటి పనులు సులభంగా చేసుకోవచ్చు. దీంతో పీఎఫ్ సేవల కోసం ప్రత్యేకంగా కార్యాలయాలను లేదా వెబ్ పోర్టల్‌ను ఆశ్రయించాల్సిన అవసరం తగ్గుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.

Next Story