EPFO: EPS పెన్షన్ పొందాలంటే ప్రైవేట్ ఉద్యోగులు ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి?
EPFO: ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన పథకాల్లో EPS (ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్) ఒకటి.
EPFO: EPS పెన్షన్ పొందాలంటే ప్రైవేట్ ఉద్యోగులు ఎన్ని సంవత్సరాలు పనిచేయాలి?
EPFO: ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భరోసా కల్పించే ముఖ్యమైన పథకాల్లో EPS (ఎంప్లాయిస్ పెన్షన్ స్కీమ్) ఒకటి. ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ఉద్యోగులకు నెలవారీ పెన్షన్ అందుతుంది. అయితే EPS పెన్షన్ పొందాలంటే కొన్ని నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. ముఖ్యంగా ఉద్యోగి కనీసం ఎన్ని సంవత్సరాలు పనిచేయాలనే విషయం తెలుసుకోవడం చాలా ముఖ్యం.
EPS పెన్షన్‌కు ఏన్నేళ్ల సర్వీస్ తప్పనిసరి
EPS పథకం కింద నెలవారీ పెన్షన్ పొందాలంటే ఉద్యోగి కనీసం 10 సంవత్సరాల అర్హత కలిగిన సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. అయితే ఈ 10 సంవత్సరాలు ఒకే సంస్థలో పనిచేసి ఉండాల్సిన అవసరం లేదు. ఒక ఉద్యోగి వివిధ ప్రైవేట్ కంపెనీల్లో పనిచేసినప్పటికీ, ఆయా ఉద్యోగ కాలాల్లో EPSకు సంబంధించిన సేవా వివరాలు కొనసాగితే.. ఆ సర్వీస్ మొత్తం కలిపి పరిగణనలోకి తీసుకుంటారు. కాబట్టి ఉద్యోగం మారిన సమయంలో కొంత విరామం వచ్చినా.. అర్హత కలిగిన మొత్తం సర్వీస్ 10 సంవత్సరాలు ఉంటే EPS పెన్షన్‌కు అవసరమైన సర్వీస్‌ను పూర్తి చేసినట్లే.
పీఎఫ్‌లోని డబ్బులో కొంత EPSకు
ఉద్యోగి జీతం నుంచి PF ఖాతాకు చేసే కాంట్రిబ్యూషన్‌లో నిబంధనల ప్రకారం కొంత మొత్తం EPS పథకానికి వెళ్తుంది. దీనివల్ల ఉద్యోగి పెన్షన్‌కు సంబంధించిన సర్వీస్ కాలం ఏర్పడుతుంది. ఉద్యోగి ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకి మారినప్పుడు PF, EPS సేవా వివరాలు సరిగ్గా కొనసాగడం ముఖ్యమైన విషయం. ఇలా వివిధ సంస్థల్లో పనిచేసిన కాలాన్ని కలిపి ఉద్యోగి తన మొత్తం EPS సర్వీస్‌ను పూర్తి చేసుకోవచ్చు.
10 ఏళ్ల సర్వీస్ పూర్తయితే వెంటనే పెన్షన్ వస్తుందా?
10 సంవత్సరాల అర్హత కలిగిన సర్వీస్ పూర్తయినంత మాత్రాన వెంటనే నెలవారీ పెన్షన్ రావడం ప్రారంభం కాదు. పెన్షన్ పొందే వయసు సహా EPS నిబంధనలను కూడా ఉద్యోగి పూర్తి చేయాలి. సాధారణంగా 58 సంవత్సరాల వయసు పూర్తైన తర్వాత EPS కింద నెలవారీ పెన్షన్ పొందేందుకు అర్హత ఉంటుంది.
10 ఏళ్ల సర్వీస్ పూర్తి కాకపోతే?
EPS పెన్షన్‌కు అవసరమైన 10 సంవత్సరాల అర్హత కలిగిన సర్వీస్ పూర్తి చేయని ఉద్యోగికి సాధారణంగా నెలవారీ EPS పెన్షన్ లభించదు. అందుకే ప్రైవేట్ ఉద్యోగులు తమ PF ఖాతాలో EPS కాంట్రిబ్యూషన్, మొత్తం పెన్షన్ సర్వీస్ వివరాలను ఎప్పటికప్పుడు పరిశీలించుకోవడం మంచిది. అలాగే ఉద్యోగం మారినప్పుడు PF ఖాతా, సేవా వివరాలు సరిగ్గా కొనసాగుతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. భవిష్యత్తులో EPS పెన్షన్ ప్రయోజనం పొందేందుకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది.




