EPF: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖాతాలో ఎప్పుడు జమ కానుందంటే.?
EPF: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో ఖాతాలు కలిగిన కోట్లాది మంది ఉద్యోగులు తమ PF ఖాతాల్లో వడ్డీ జమ కోసం ఎదురుచూస్తున్నారు.
EPF: పీఎఫ్ అకౌంట్ ఉన్న వారికి గుడ్ న్యూస్.. 8.25 శాతం వడ్డీ ఖాతాలో ఎప్పుడు జమ కానుందంటే.?
EPF: ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (EPFO)లో ఖాతాలు కలిగిన కోట్లాది మంది ఉద్యోగులు తమ PF ఖాతాల్లో వడ్డీ జమ కోసం ఎదురుచూస్తున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తున్నట్లు EPFO ఇప్పటికే ప్రకటించింది. అయితే ఇంకా చాలామంది ఖాతాల్లో వడ్డీ కనిపించకపోవడంతో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది?
2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ
ఈ ఏడాది మార్చిలో EPFO తన సభ్యులకు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 8.25 శాతం వడ్డీ రేటును కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది దేశవ్యాప్తంగా PF ఖాతాదారులకు వర్తిస్తుంది. అయితే వడ్డీ రేటు ప్రకటించిన వెంటనే డబ్బులు ఖాతాల్లో జమ కావు. దీనికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం అవసరం. ఆ తర్వాత లక్షలాది ఖాతాల వివరాలను పరిశీలించి, రికార్డులను నవీకరించే ప్రక్రియ జరుగుతుంది.
PF ఖాతాల్లో వడ్డీ ఎప్పుడు జమ అవుతుంది?
సాధారణంగా గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వడ్డీని జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యకాలంలో సభ్యుల ఖాతాల్లో జమ చేస్తుంటారు. అందువల్ల ఈ ఏడాది కూడా రాబోయే నెలల్లో వడ్డీ ఎంట్రీలు కనిపించే అవకాశం ఉంది.
అన్ని ఖాతాల్లో ఒకేసారి వడ్డీ జమ కాకపోవచ్చు. కొన్ని ఖాతాల్లో ముందుగా కనిపిస్తే, మరికొన్ని ఖాతాల్లో కొంత ఆలస్యంగా అప్‌డేట్ కావచ్చు. ఇది సాధారణ ప్రక్రియలో భాగమేనని EPFO స్పష్టం చేసింది.
ఆలస్యంగా జమ అయితే నష్టం ఉంటుందా?
వడ్డీ ఖాతాలో కనిపించడానికి ఆలస్యం అయినా సభ్యులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వడ్డీ లెక్కింపు ఇప్పటికే నిర్ణయించిన తేదీ నుంచి అమలులో ఉంటుంది. EPF పథకం నిబంధనల ప్రకారం ఖాతాలో ఉన్న నిల్వ మొత్తంపై నెలవారీగా వడ్డీ లెక్కిస్తారు. ఆ తర్వాత సంవత్సరాంతంలో చక్రవడ్డీ రూపంలో జమ చేస్తారు. కాబట్టి ఎంట్రీ ఆలస్యమైనా సభ్యులకు రావాల్సిన పూర్తి వడ్డీ మొత్తం అందుతుంది.
వడ్డీ అప్‌డేట్‌ను ఎలా గుర్తించాలి?
EPFO ఖాతాలో వడ్డీ జమ అయిన తర్వాత పాస్‌బుక్‌లో "Interest Updated up to 31/03/2026" వంటి సమాచారం కనిపిస్తుంది. ఈ అప్‌డేట్ ద్వారా వడ్డీ జమ అయిన విషయాన్ని సభ్యులు తెలుసుకోవచ్చు. ఖాతా వివరాలు అప్డేట్ కావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వెంటనే ఎంట్రీ కనిపించకపోయినా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
ఇంట్లో నుంచే PF బ్యాలెన్స్ చెక్ చేసే మార్గాలు
PF ఖాతాదారులు తమ బ్యాలెన్స్, వడ్డీ వివరాలను పలు మార్గాల్లో సులభంగా తెలుసుకోవచ్చు. UMANG యాప్ ద్వారా డిజిటల్ పాస్‌బుక్ చూడవచ్చు. EPFO సభ్యుల ఈ-సేవా పోర్టల్‌లో లాగిన్ అయి వివరాలు పరిశీలించవచ్చు.
రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 9966044425 కు మిస్డ్ కాల్ ఇస్తే బ్యాలెన్స్ సమాచారం అందుతుంది. 7738299899 నంబర్‌కు "UAN EPFOHO ENG" అనే సందేశాన్ని SMS రూపంలో పంపినా వివరాలు పొందవచ్చు. అయితే ఈ సేవలను ఉపయోగించాలంటే UAN యాక్టివ్‌గా ఉండాలి.
అలాగే PAN, బ్యాంకు ఖాతా వివరాలు UANతో అనుసంధానమై ఉండటం తప్పనిసరి. EPFO సభ్యులు వడ్డీ జమ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ప్రక్రియ పూర్తయ్యాక 8.25 శాతం వడ్డీ మొత్తం వారి ఖాతాల్లో జమ అవుతుందని అధికారులు చెబుతున్నారు.




