EPF: UAN లేకపోయినా పీఎఫ్ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చని తెలుసా.? ఎలాగంటే.?
EPF: ఉద్యోగం మారిన తర్వాత పాత ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాను చాలామంది పట్టించుకోరు.
EPF: UAN లేకపోయినా పీఎఫ్ డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చని తెలుసా.? ఎలాగంటే.?
EPF: ఉద్యోగం మారిన తర్వాత పాత ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (EPF) ఖాతాను చాలామంది పట్టించుకోరు. కొత్త ఉద్యోగంలో చేరిన తర్వాత కొత్త PF ఖాతాతో బిజీ అయిపోవడంతో పాత ఖాతాలోని డబ్బు అలాగే ఉండిపోతుంది. ఇలా దేశవ్యాప్తంగా కోట్లాది రూపాయలు ఇప్పటికీ ఉద్యోగులు క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయాయి.
ఇన్ఆపరేటివ్ PF ఖాతా అంటే ఏంటి?
ఉద్యోగి ఒక సంస్థ నుంచి మరో సంస్థకు మారినప్పుడు పాత PF ఖాతాను కొత్త సంస్థకు బదిలీ చేయకపోవడం లేదా చాలా కాలం పాటు ఎలాంటి లావాదేవీలు జరగకపోవడం వల్ల ఆ ఖాతా ఇన్ఆపరేటివ్గా మారుతుంది. అయితే దీనర్థం ఆ డబ్బు ప్రభుత్వానికి వెళ్లిపోతుందన్నది కాదు. EPFO స్పష్టంగా చెబుతున్న విషయం ఏమిటంటే.. ఇన్ఆపరేటివ్ ఖాతాలోని సొమ్ముపై ఉద్యోగి హక్కు పూర్తిగా కొనసాగుతుంది. అవసరమైన ప్రక్రియ పూర్తి చేసిన తర్వాత ఎప్పుడైనా ఆ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. తాజా గణాంకాల ప్రకారం, 2026 మార్చి 31 నాటికి ఇన్ఆపరేటివ్ EPF ఖాతాలు, క్లెయిమ్ చేయని LIC పాలసీల్లో కలిపి రూ.16,649 కోట్లు ఉన్నాయి. ఇందులో రూ.9,330 కోట్లు ఇన్ఆపరేటివ్ EPF ఖాతాల్లోనే ఉండటం గమనార్హం.
PF డబ్బు తీసుకోవాలంటే ఈ నిబంధనలు
పూర్తి PF మొత్తాన్ని ఉపసంహరించుకోవడానికి ఉద్యోగం వదిలిన తర్వాత కనీసం రెండు నెలలు గడవాలి. అంతకుముందు ఇల్లు కొనుగోలు, వైద్యం, విద్య వంటి ప్రత్యేక అవసరాల కోసం మాత్రమే కొంత మొత్తాన్ని ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది. అలాగే UANతో ఆధార్, పాన్, బ్యాంక్ ఖాతా వంటి KYC వివరాలు సరిగా అనుసంధానమై ఉండాలి. ఒకవేళ PF ఖాతా చాలా సంవత్సరాలుగా ఇన్ఆపరేటివ్గా ఉంటే, అదనపు ధ్రువపత్రాలు సమర్పించాలని అధికారులు కోరే అవకాశం ఉంటుంది.
ఆన్లైన్లో క్లెయిమ్ చేయడం ఎలా?
ఇంట్లో నుంచే EPF డబ్బును క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా మీ UAN, మెంబర్ ఐడీ, PF ఖాతా వివరాలు సిద్ధంగా ఉంచుకోవాలి. ఆ తర్వాత EPFO పోర్టల్‌లో లాగిన్ అయ్యి Form-19 (Final Settlement), Form-10C (Pension Withdrawal Benefit) అవసరాన్ని బట్టి ఆన్లైన్లో సమర్పించాలి. అన్ని వివరాలు సరిగా నమోదు చేసి డిజిటల్‌గా దరఖాస్తు పూర్తి చేస్తే క్లెయిమ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది.
UAN లేకపోయినా క్లెయిమ్ చేసే అవకాశం..
UAN యాక్టివేట్ కాకపోయినా లేదా అందుబాటులో లేకపోయినా PF డబ్బు కోల్పోవాల్సిన అవసరం లేదు. EPFO అధికారిక వెబ్సైట్ నుంచి Form-19, Form-10C డౌన్లోడ్ చేసుకుని వాటిని పూర్తి చేసి, అవసరమైన పత్రాలతో కలిసి సమీప EPFO కార్యాలయంలో సమర్పించవచ్చు. దరఖాస్తు సమర్పించిన తర్వాత EPFO పోర్టల్‌లోని 'Track Claim Status' సేవ ద్వారా క్లెయిమ్ ఏ దశలో ఉందో తెలుసుకోవచ్చు. క్లెయిమ్ పెండింగ్‌లో ఉందా, ఆమోదించారా, తిరస్కరించారా లేదా డబ్బు బ్యాంక్ ఖాతాలో జమ అయిందా అనే వివరాలు అక్కడ కనిపిస్తాయి. పాత ఉద్యోగాల్లో పనిచేసిన వారికి PF ఖాతాలు మిగిలి ఉన్నాయేమో ఒకసారి పరిశీలించడం మంచిది. మీ సొంత కష్టార్జిత డబ్బును నిర్లక్ష్యం చేయకుండా అవసరమైన ప్రక్రియ పూర్తి చేసి వీలైనంత త్వరగా క్లెయిమ్ చేసుకోవచ్చు.




