Egg: కోడే కాదు దాని గుడ్డు కూడా చాలా హాట్ గురు..!
తెలంగాణలో కోడిగుడ్డు ధరలు భారీగా పెరిగాయి.
Egg: కోడే కాదు దాని గుడ్డు కూడా చాలా హాట్ గురు..!
Egg Prices: వీకెండ్ వచ్చిందంటే చాలు.. ముక్క లేనిదే ముద్ద దిగని నాన్-వెజ్ ప్రియులు చికెన్, మటన్ షాపుల ముందు క్యూ కడతారు. ధరలు కొద్దిగా అటుఇటైనా సండే కదా.. కాస్త అడ్జస్ట్ అయిపోదాం అనుకుంటారు. కానీ ఇప్పుడు చికెన్ కంటే ఎక్కువగా.. అందరి ఇళ్లల్లో నిత్యం ఉండే కోడిగుడ్డు సామాన్యుడికి గట్టి షాకే ఇస్తోంది.
నిన్నమొన్నటి వరకు నాలుగు రూపాయలు పలికిన గుడ్డు.. ఇప్పుడు డబుల్ సెంచరీ దిశగా దూసుకుపోతోంది. ఏప్రిల్‌లో రూ.4 ఉన్న గుడ్డు, మే నాటికి రూ.5 అయింది. జూన్ మొదటి వారంలో రూ.6 దాటి.. ఇప్పుడు జూన్ చివరి వారానికి వచ్చేసరికి ఏకంగా రూ.8 కి చేరింది. ఈ జోరు చూస్తుంటే త్వరలోనే ఒక్కో గుడ్డు ధర రూ.10 మార్కును తాకినా ఆశ్చర్యపోనక్కర్లేదు. పిల్లల నుంచి పెద్దల దాకా ప్రతిరోజూ తినే పౌష్టికాహారమైన గుడ్డు ధర ఇలా చుక్కలు చూపిస్తుంటే.. ఇక ఏం కొనాలి? ఏం తినాలి? అని సామాన్యుడు వాపోతున్నాడు.
తెలంగాణలో దాదాపు 4 వేల పౌల్ట్రీ లేయర్ పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ రోజుకు సుమారు 4 కోట్ల కోడిగుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇందులో 50 శాతం రాష్ట్ర అవసరాలకు పోగా, మిగిలిన 50 శాతం ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంటాయి. మరి ఇంత భారీ ఉత్పత్తి ఉన్నా ధరలు ఎందుకు పెరిగాయి? దీని వెనుక బలమైన కారణాలు ఉన్నాయి.
ఈ ఏడాది వేసవి కాలంలో ఎండలు మండిపోయాయి. ఆ తీవ్రమైన వేడిని తట్టుకోలేక సుమారు 10 శాతం కోళ్లు చనిపోయాయి. దీనివల్ల గుడ్ల ప్రొడక్షన్ ఒక్కసారిగా పడిపోయింది. మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సప్లై లేకపోవడంతో ధరలు రెక్కలొచ్చాయి. కోళ్లకు పెట్టే మేత, వాటికి వాడే మెడిసిన్ ధరలు భారీగా పెరిగాయి. పౌల్ట్రీ నిర్వాహకులకు నిర్వహణ ఖర్చులు తడిసి మోపెడవుతున్నాయి. మొన్నటి వరకు పశ్చిమాసియాలో జరిగిన యుద్ధ వాతావరణం కారణంగా కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయి.. పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాలను చవిచూశారు.
ఈ ధరల పెరుగుదలపై నేషనల్ ఉత్తర తెలంగాణ ఎగ్ కో-ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ప్రస్తుతం ఒక కోడి గుడ్డు పెట్టడానికి అయ్యే మేత, మెడిసిన్ ఖర్చే రైతుకు రూ.7 వరకు పడుతోంది. ఎగ్ రైతుకు కోడిగుడ్డుపై రూ.6 వస్తుంటే.. అది రవాణా ఖర్చులు, వ్యాపారుల లాభాలు దాటుకుని రిటైల్ మార్కెట్‌కు వచ్చేసరికి రూ.8 పలుకుతోంది.
గత కొన్ని నెలలుగా పౌల్ట్రీ రైతులు తీవ్ర నష్టాల్లో ఉన్నారని, ఇప్పుడు గుడ్డు ధర పెరగడం వల్ల వారు ఆ నష్టాల నుంచి కొంతవరకు బయటపడే అవకాశం ఉందన్నారు. అయితే, రైతులు నష్టపోకుండా ఉండాలంటే.. ఆ భారం వినియోగదారులపై పడక తప్పని పరిస్థితి ఏర్పడిందని ఆయన అభిప్రాయపడ్డారు.
చిరుద్యోగులు, దినసరి కూలీలు, హాస్టల్ విద్యార్థులకు తక్కువ ధరలో ఎక్కువ ప్రోటీన్ అందించే ఏకైక ఆధారం కోడిగుడ్డు. కానీ ఇప్పుడు రోజుకు నాలుగు గుడ్లు కొనాలన్నా ముప్పై రూపాయలు దాటిపోతోంది. ఒకవైపు కూరగాయల ధరలు మండిపోతుంటే.. ఇంకోవైపు గుడ్డు కూడా ఇలా హాట్ కేక్‌లా మారిపోవడంతో మధ్యతరగతి ఇళ్లల్లో బడ్జెట్ లెక్కలు తలకిందులవుతున్నాయి. పౌల్ట్రీ రంగాన్ని ప్రభుత్వం ఆదుకుని, ధరలను నియంత్రణలోకి తెస్తే తప్ప సామాన్యుడికి గుడ్డు గండం తప్పేలా లేదు.




