E20 Petrol: ఈ20 పెట్రోల్‌తో మైలేజీ 2–6% తగ్గొచ్చు: గడ్కరీ
ఈ20 పెట్రోల్‌తో వాహనాల మైలేజీ 2–6% తగ్గొచ్చని గడ్కరీ తెలిపారు. ఇంజిన్ పనితీరుపై విస్తృత ఫిర్యాదులు లేవని స్పష్టం చేశారు.
E20 Petrol Mileage
ఈ20 పెట్రోల్ వాడకంతో వాహనాల ఇంజిన్ పనితీరు, ఫ్యూయల్ పంపులు, తుప్పు, నీటి కలుషితం వంటి సమస్యలపై దేశవ్యాప్తంగా ఎలాంటి విస్తృతమైన, నిర్ధారణ అయిన ఫిర్యాదులు అందలేదని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. ఈ20 ఇంధనంపై ఆందోళనలను శాస్త్రీయ అధ్యయనాలు, క్షేత్రస్థాయి పరీక్షల ద్వారా పరిశీలించినట్లు రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో ఆగస్టు 5న వెల్లడించారు.
ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏఆర్‌ఏఐ), సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (సియామ్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ), వాహన తయారీ సంస్థలు కలిసి పలు పరీక్షలు నిర్వహించినట్లు గడ్కరీ తెలిపారు.
ఇంజిన్ మన్నిక, డ్రైవింగ్ పనితీరు, వాహనం స్టార్ట్ అయ్యే సామర్థ్యం, తుప్పు నిరోధకత, విడిభాగాలతో ఇంధనం అనుకూలత, ఉద్గారాలు వంటి అంశాలను ఈ అధ్యయనాల్లో పరిశీలించినట్లు చెప్పారు. నిర్దేశిత ప్రమాణాల ప్రకారం ఈ20 ఇంధనం వాడటం సురక్షితమేనని అధ్యయనాలు నిర్ధారించినట్లు వెల్లడించారు.
ఈ20తో మైలేజీ ఎంత తగ్గొచ్చు?
ఈ20 పెట్రోల్ వాడకంతో వాహనాల ఇంధన సామర్థ్యం 2–6 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అధ్యయనాలు సూచించినట్లు గడ్కరీ తెలిపారు. అయితే వాహనం మైలేజీ కేవలం ఇంధన రకంపైనే ఆధారపడదని చెప్పారు.
డ్రైవింగ్ అలవాట్లు, వాహన నిర్వహణ, ఇంజిన్ ఆయిల్ మార్పులు, ఎయిర్ ఫిల్టర్ శుభ్రత, టైర్లలో గాలి ఒత్తిడి, వీల్ అలైన్‌మెంట్, ఎయిర్ కండిషనర్ వినియోగం వంటి అంశాలు కూడా మైలేజీపై ప్రభావం చూపుతాయని వివరించారు.
పాత వాహనాలకు నష్టం జరుగుతుందా?
ఈ20 ఇంధనం వాడుతున్న పాత వాహనాల్లో పనితీరులో ఎలాంటి అసాధారణ మార్పులు లేదా విడిభాగాల్లో సాధారణానికి మించిన అరుగుదల కనిపించలేదని అధ్యయనాలు వెల్లడించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు.
దేశవ్యాప్తంగా ఈ15 కంటే ఎక్కువ ఇథనాల్ కలిగిన పెట్రోల్ మిశ్రమాలు మూడున్నరేళ్లకు పైగా వినియోగంలో ఉన్నాయని, ఈ19–ఈ20 ఇంధనం రెండున్నరేళ్లకు పైగా వాడుతున్నారని చెప్పారు.
ఈ20 వల్ల ప్రయోజనాలు ఏంటి?
ఈ10తో పోలిస్తే ఈ20 ఇంధనం మెరుగైన వేగం అందించడంతో పాటు వాహనం నడిపే అనుభూతిని మెరుగుపరుస్తుందని గడ్కరీ తెలిపారు. ఈ10తో పోలిస్తే కార్బన్ ఉద్గారాలను సుమారు 30 శాతం తగ్గించే అవకాశం ఉందని చెప్పారు.
అధిక ఇథనాల్ మిశ్రమాలు ఇంధనం మరింత శుభ్రంగా, పూర్తిస్థాయిలో దహనం కావడానికి సహాయపడతాయని, దాంతో సూక్ష్మ రేణువుల ఉద్గారాలు దాదాపు శూన్య స్థాయికి చేరి నగరాల్లో గాలి నాణ్యత మెరుగుపడుతుందని వివరించారు.
ఈ20 ఇంధనం ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చింది?
భారత్‌లో ఇథనాల్ కలిపిన పెట్రోల్ కార్యక్రమాన్ని 2001లో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. 2006లో ఈ5 పెట్రోల్‌ను ప్రవేశపెట్టారు. 2018లో ప్రకటించిన జాతీయ జీవ ఇంధన విధానాన్ని 2022లో సవరించి.. పెట్రోల్‌లో 20 శాతం ఇథనాల్ కలపాలనే లక్ష్యాన్ని 2030 నుంచి 2025–26కు ముందుకు తీసుకొచ్చారు.
ప్రభుత్వ రంగ చమురు సంస్థలు 2022 జూన్‌లో 10 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యాన్ని సాధించాయి. 2023 ఫిబ్రవరిలో 11 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 84 పెట్రోల్ బంకుల్లో తొలిసారిగా ఈ20 ఇంధనాన్ని ప్రవేశపెట్టారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకొచ్చారు.
ఇథనాల్ మిశ్రమం 20 శాతానికి మించి పెంచుతారా?
ప్రస్తుతం ఇథనాల్ మిశ్రమాన్ని 20 శాతానికి మించి వెంటనే పెంచే ఆలోచన లేదని కేంద్రం స్పష్టం చేసింది. భవిష్యత్తులో అధిక మిశ్రమంపై నిర్ణయం తీసుకునే ముందు సమగ్ర శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు నిర్వహించి, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతామని తెలిపింది.




