DMart: ఫార్మసీ రంగంలోకి డీమార్ట్ గ్రాండ్ ఎంట్రీ..ఇక తట్టా బుట్టా సర్దుకోవడమే..!
DMart: డీమార్ట్ ఫార్మసీ రిటైల్ రంగంలోకి అడుగుపెట్టింది.
DMart: ఫార్మసీ రంగంలోకి డీమార్ట్ గ్రాండ్ ఎంట్రీ..ఇక తట్టా బుట్టా సర్దుకోవడమే..!
DMart Pharmacy: నిత్యావసర వస్తువుల వ్యాపారంలో తక్కువ ధరల వ్యూహంతో సంచలనం సృష్టించిన డీమార్ట్, ఇప్పుడు మరో కొత్త రంగాన్ని కుదిపేసేందుకు సిద్ధమైంది. ఇప్పటివరకు కిరాణా, డిపార్ట్‌మెంటల్ స్టోర్స్‌కే పరిమితమైన డీమార్ట్.. తాజాగా ఫార్మసీ రిటైల్ రంగంలోకి అధికారికంగా అడుగుపెట్టింది. తన పూర్తి యాజమాన్య అనుబంధ సంస్థ రిఫ్లెక్ట్ హెల్త్‌కేర్ అండ్ రిటైల్ ద్వారా డీమార్ట్ ఈ కొత్త వెంచర్‌ను ప్రారంభించింది.
ఎలాంటి ప్రచార ఆర్భాటాలు, ప్రకటనలు లేకుండా ముంబైలోని ఎంపిక చేసిన డీమార్ట్ స్టోర్లలో షాప్-ఇన్-షాప్ పద్ధతిలో మెడికల్ కౌంటర్లను ఏర్పాటు చేసింది. మందుల కొనుగోలుపై ఏకంగా 20% డిస్కౌంట్ ఆఫర్ చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. డీమార్ట్ తీసుకున్న ఈ నిర్ణయం ఫార్మా రిటైల్ మార్కెట్‌లో పెద్ద కలకలమే రేపుతోంది:
సాధారణంగా ఎంఆర్‌పీ ధరలకే మందులు విక్రయించే స్థానిక మెడికల్ షాపులకు డీమార్ట్ 20% డిస్కౌంట్ మోడల్ పెద్ద సవాలుగా మారనుంది.ఇప్పటికే భారీ ఆర్థిక నష్టాల్లో ఉంటూ లాభాల బాట పట్టేందుకు తంటాలు పడుతున్న ఆన్‌లైన్ మెడికల్ యాప్‌లకు ఇది కోలుకోలేని దెబ్బ కావచ్చు.
డీమార్ట్ ఈ నిర్ణయం వెనుక బలమైన బిజినెస్ క్యాలిక్యులేషన్ ఉంది. సంప్రదాయ కిరాణా వ్యాపారంలో ప్రాఫిట్ మార్జిన్లు కేవలం 7% నుండి 8% మాత్రమే ఉంటాయి. కానీ బ్రాండెడ్ జెనెరిక్స్ ఉన్న ఫార్మా రంగంలో ఏకంగా 25% నుండి 30% వరకు మార్జిన్లు లభిస్తాయి. డీమార్ట్‌కు ఇప్పటికే దేశవ్యాప్తంగా 503 హైపర్‌మార్కెట్ల భారీ నెట్‌వర్క్ ఉంది.
కొత్తగా మెడికల్ షాపుల కోసం అద్దెలు చెల్లించాల్సిన పనిలేదు. అలాగే రోజూ వేల సంఖ్యలో వచ్చే కస్టమర్లే ఈ కౌంటర్లకు ప్రధాన బలం. కస్టమర్లను ఆకర్షించేందుకు ప్రత్యేకంగా యాడ్స్ ఇవ్వాల్సిన అవసరం కూడా లేకపోవడంతో, 20% డిస్కౌంట్ ఇచ్చినా డీమార్ట్ సులువుగా లాభాలు గడించగలదని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.
సూపర్ మార్కెట్ రంగంలో చిన్న వ్యాపారులకు గట్టి పోటీ ఇచ్చిన డీమార్ట్, ఇప్పుడు మెడికల్ రంగంలో కూడా తన ముద్ర వేయబోతోంది. ఈ పవర్ ప్లే రాబోయే రోజుల్లో భారత ఫార్మా రిటైల్ స్వరూపాన్నే మార్చివేసేలా కనిపిస్తోంది.




