Credit Card: పోగొట్టుకున్న క్రెడిట్ కార్డులో ట్రాన్సాక్షన్ జరిగితే.. బిల్ ఎవరు కట్టాలి.?
Credit Card: క్రెడిట్ కార్డు పోయిందంటే చాలామందికి ముందుగా వచ్చే భయం.. ఎవరైనా ఆ కార్డుతో ఖర్చు చేస్తే ఆ డబ్బులు మనమే కట్టాలా?
Credit Card: పోగొట్టుకున్న క్రెడిట్ కార్డులో ట్రాన్సాక్షన్ జరిగితే.. బిల్ ఎవరు కట్టాలి.?
Credit Card: క్రెడిట్ కార్డు పోయిందంటే చాలామందికి ముందుగా వచ్చే భయం.. ఎవరైనా ఆ కార్డుతో ఖర్చు చేస్తే ఆ డబ్బులు మనమే కట్టాలా? అని. అయితే ప్రతిసారీ ఆ మొత్తాన్ని కార్డుదారుడే భరించాల్సిన అవసరం ఉండదు. అనధికార లావాదేవీ ఎలా జరిగింది, బ్యాంకుకు ఎంత త్వరగా సమాచారం ఇచ్చారు అనే అంశాలపై బాధ్యత ఆధారపడి ఉంటుంది.
కార్డు పోయిన వెంటనే ఏం చేయాలి?
క్రెడిట్ కార్డు కనిపించకపోతే ముందుగా ఆలస్యం చేయకుండా కార్డును బ్లాక్ చేయాలి. బ్యాంక్ మొబైల్ యాప్, వెబ్‌సైట్ లేదా కస్టమర్ కేర్ ద్వారా కార్డును వెంటనే బ్లాక్ చేయవచ్చు. కార్డు ఎక్కడో పడిపోయిందేమోనని అనిపించినా, తాత్కాలికంగా ఫ్రీజ్ చేయడం మంచిది.
ఆ తర్వాత బ్యాంక్ యాప్ లేదా స్టేట్‌మెంట్‌లో ఇటీవల జరిగిన లావాదేవీలను పరిశీలించాలి. మీరు చేయని లావాదేవీ ఏదైనా కనిపిస్తే వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయాలి. ఫిర్యాదు చేసిన తేదీ, సమయం, బ్యాంక్ ఇచ్చిన కంప్లైంట్ నంబర్‌ను తప్పకుండా భద్రపరుచుకోవాలి.
కార్డు పోయిన తర్వాత చేసిన ఖర్చులకు ఎవరు బాధ్యత?
కార్డు పోయిందని బ్యాంకుకు సమాచారం ఇచ్చి, కార్డును బ్లాక్ చేసిన తర్వాత జరిగిన అనధికార లావాదేవీలకు సాధారణంగా కార్డుదారుడి బాధ్యత ఉండదు. అయితే కార్డు బ్లాక్ చేయడానికి ముందే ఫ్రాడ్ జరిగితే పరిస్థితి వేరుగా ఉంటుంది. RBI నిబంధనల ప్రకారం బ్యాంక్ నిర్లక్ష్యం లేదా బ్యాంకింగ్ వ్యవస్థలో లోపం వల్ల అనధికార లావాదేవీ జరిగితే కస్టమర్‌పై బాధ్యత ఉండదు.
కొన్ని సందర్భాల్లో బ్యాంకు తప్పు లేకపోయినా, థార్డ్ పార్టీ కారణంగా ఫ్రాడ్ జరిగితే కస్టమర్ సకాలంలో బ్యాంకుకు సమాచారం ఇవ్వడం కీలకం.
పని దినాల్లో ఫిర్యాదు చేస్తే ఏం జరుగుతుంది?
అనధికార లావాదేవీ గురించి బ్యాంకు నుంచి సమాచారం అందిన తర్వాత 3 పని దినాల్లోపు బ్యాంకుకు తెలియజేస్తే కొన్ని పరిస్థితుల్లో కస్టమర్‌కు ‘జీరో లయబిలిటీ’ వర్తించవచ్చు. అంటే ఫ్రాడ్ జరిగిన మొత్తాన్ని కస్టమర్ భరించాల్సిన అవసరం లేకపోవచ్చు. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ 3 రోజులు కార్డు పోయిన రోజు నుంచి లెక్కించరు.
అనధికార లావాదేవీ గురించి బ్యాంకు నుంచి సమాచారం అందిన తర్వాతి వ్యవధి కీలకం. 4 నుంచి 7 పని దినాల్లో ఫిర్యాదు చేస్తే, నిబంధనల ప్రకారం కొన్ని సందర్భాల్లో కస్టమర్ బాధ్యత పరిమితంగా ఉండొచ్చు. అందుకే ఫ్రాడ్ విషయం తెలిసిన వెంటనే ఫిర్యాదు చేయడం అత్యంత సురక్షితం.
కార్డు పోతే పోలీస్‌లకు ఫిర్యాదు చేయాలా?
కార్డు పోయిన వెంటనే బ్యాంకుకు సమాచారం ఇచ్చి కార్డును బ్లాక్ చేయడంతో పాటు, అనుమానాస్పద లావాదేవీలను ఫ్రాడ్‌గా నమోదు చేయించాలి. కార్డు దొంగతనానికి గురైనట్లయితే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయడం మంచిది. ఆర్థిక మోసం జరిగితే 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు వెంటనే కాల్ చేయవచ్చు. అలాగే జాతీయ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయవచ్చు.
ముఖ్యంగా కార్డు పోయిన విషయం తెలిసిన వెంటనే స్పందిస్తే నష్టాన్ని తగ్గించుకోవచ్చు. కాబట్టి క్రెడిట్ కార్డు కనిపించకపోతే ముందుగా బ్లాక్ చేయడం, తర్వాత లావాదేవీలను పరిశీలించడం, ఫ్రాడ్ ఉంటే వెంటనే బ్యాంకుకు ఫిర్యాదు చేయడం అనే మూడు పనులు తప్పనిసరిగా చేయాలి.




