Copper Price: కొత్త బంగారంగా రాగి..ఇన్వెస్టర్ల కన్ను ఇక కాపర్ పైనే!
Copper Price: డిమాండ్ పెరగడంతో లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో టన్ను రాగి ధర రూ. 14 లక్షలకు చేరింది. ఇన్వెస్టర్లలో పెరిగిన ఆసక్తి.
Copper Price: కొత్త బంగారంగా రాగి..ఇన్వెస్టర్ల కన్ను ఇక కాపర్ పైనే!
Copper Price: సంప్రదాయ పెట్టుబడి మార్గాలుగా ఉన్న బంగారం, వెండి సరసన ఇప్పుడు ‘రాగి’ (కాపర్) చేరింది. రికార్డు స్థాయిలో పెరుగుతున్న ధరలు, అంతర్జాతీయంగా డిమాండ్‌కు తగ్గ సరఫరా లేకపోవడంతో పెట్టుబడిదారులు రాగిని "కొత్త బంగారం"గా అభివర్ణిస్తున్నారు. లండన్ మెటల్ ఎక్స్ఛేంజ్‌లో ఒకానొక దశలో మెట్రిక్ టన్ను రాగి ధర ఏకంగా 14,737 డాలర్లకు (భారత కరెన్సీలో సుమారు రూ. 14 లక్షలు) చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది.
ఈ ఏడాది ఇప్పటివరకు రాగి ధరలు 16 శాతం మేర పుంజుకున్నాయి. శుద్ధి చేసిన రాగి దిగుమతులపై అమెరికా సుంకాలు పెంచే అవకాశముందన్న వార్తలతో కొనుగోలుదారులు పెద్ద ఎత్తున కాపర్‌ను కొనుగోలు చేసి నిల్వ చేసుకోవడం ఈ ధరల పరుగుకు ఒక కారణమైంది. దీనికి తోడు పాత రాగి గనుల నుంచి ఉత్పత్తి తగ్గడం, ప్రధాన ఉత్పత్తి దేశాల్లో రవాణా సమస్యలు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపాయి.
మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) విస్తరణతో ప్రపంచవ్యాప్తంగా ఏర్పాటవుతున్న భారీ డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రాగి వినియోగం అమాంతం పెరిగింది. భవిష్యత్తు సాంకేతిక, పునరుత్పాదక ఇంధన రంగాల వృద్ధి అంతా కాపర్ పైనే ఆధారపడి ఉండటంతో, ఇన్వెస్టర్లు బంగారం తరహాలోనే రాగిపై తీవ్ర ఆసక్తి చూపుతున్నారు.




