Cooking Oil Prices: వంటగదిలో వార్‌సెగ...సామాన్యుల జేబుకు చిల్లులు
Cooking Oil Prices: భారతదేశంలో వంట నూనెలను అధికంగా వినియోగిస్తుంటారు. యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యుల బడ్జెట్ అదుపుతప్పుతోంది.
Cooking Oil Prices: వంటగదిలో వార్‌సెగ...సామాన్యుల జేబుకు చిల్లులు
Cooking Oil Prices : ప్రపంచ వ్యాప్తంగా కొనసాగుతున్న యుద్ధ ప్రభావం ఇప్పుడు భారతీయుల వంటగదిలో స్పష్టంగా కనిపిస్తున్నది. భారతదేశంలో వంట నూనెలను అధికంగా వినియోగిస్తుంటారు. యుద్ధం కారణంగా వంట నూనెల ధరలు ఒక్కసారిగా పెరగడంతో సామాన్యుల బడ్జెట్ అదుపుతప్పుతోంది. నెల క్రితం వరకు రూ. 150కి లభించిన సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర ఇప్పుడు లీటర్ రూ. 190 నుంచి రూ. 202 వరకు పెరిగింది. ఆన్‌లైన్ మార్కెట్లో ఈ ధరలు మరింత ఎక్కువగా కనిపిస్తుండటం విశేషం.
భారీగా పెరిగిన ధరలు
యుద్ధ ప్రభావం ఒక్క సన్‌ఫ్లవర్ ఆయిల్‌పై మాత్రమై పడలేదు. దీనితో పాటుగా వేరుశనగనూనె, ఆవనూనె, పామాయిల్ వంటివాటిపై కూడా ప్రభావం చూపింది. వేరుశనగనూనె లీటర్ రూ. 220కి చేరగా, ఆవనూనె రూ. 190, పామాయిల్ రూ.150కి చేరింది. ధరల ఈ పెరుగుదల వెనుక ప్రధాన కారణం దిగుమతులపై ఆధారపడటం. భారత్‌లో వినియోగించే సన్‌ఫ్లవర్ ఆయిల్‌లో సుమారు 70% వరకు రష్యా, ఉక్రెయిన్ దేశాల నుంచే దిగుమతి అవుతుంది. ప్రస్తుతం యుద్ధ పరిస్థితుల వల్ల నౌకా రవాణాలో ఆటంకాలు ఏర్పడి, ట్రాన్స్‌పోర్ట్ ఖర్చులు పెరగడం ధరలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతోంది. ఇదొక్కటే కాదు... రూపాయి విలువ పడిపోవడం కూడా దిగుమతుల ఖర్చును పెంచి, వినియోగదారులపై భారం మోపుతోంది. ఈ పరిస్థితుల్లో మధ్యతరగతి కుటుంబాలు ఖర్చులను తగ్గించుకునేందుకు పామాయిల్ వంటి తక్కువ ధరలో లభించే ప్రత్యామ్నాయాలను ఎంచుకుంటున్నాయి. క్రిసిల్ నివేదికల ప్రకారం, సన్‌ఫ్లవర్ ఆయిల్ వినియోగం వచ్చే ఆర్థిక సంవత్సరంలో 10% వరకు తగ్గే అవకాశం ఉంది.
తగ్గిన నూనె నిల్వలు
భవిష్యత్ భరోసా కోసం దేశాలు నిల్వలు పెంచుకుంటూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైనపుడు ఈ నిల్వలను వినియోగించుకుంటాయి. అయితే, భారత దేశంలో వ్యూహాత్మక నూనెల నిల్వలు తగ్గుముఖం పట్టినట్టుగా వార్తలు వస్తున్నాయి. సాధారణంగా 45 రోజులకు సరిపడా నిల్వలు ఉండాలి. కానీ, ఇప్పుడు ఆ నిల్వలు కేవలం 20 నుంచి 30 రోజులకు సరిపడా మాత్రమే ఉండటం ఆందోళనకరం. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రాబోయే రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే యుద్ధ ప్రభావం కేవలం సరిహద్దుల వరకు మాత్రమే పరిమితం కాకుండా, ప్రతి ఇంటి వంటగదిలోనూ ప్రభావం చూపుతోంది. ధరలను పెరగకుండా నియంత్రించాలని సామాన్య ప్రజలు కోరుకుంటున్నారు.




