పాత వాహనదారులకు ఊరట లభించేనా?: E10 పెట్రోల్‌ను తిరిగితేవాలని CEA సూచన!
Anantha Nageswaran: E20 పెట్రోల్ విధానంపై కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత నాగేశ్వరన్ కీలక వ్యాఖ్యలు.
పాత వాహనదారులకు ఊరట లభించేనా?: E10 పెట్రోల్‌ను తిరిగితేవాలని CEA సూచన!
Anantha Nageswaran: దేశవ్యాప్తంగా E20 (20 శాతం ఎథనాల్ కలిపిన పెట్రోల్) అమలు, పాత వాహనదారుల నుంచి వస్తున్న అభ్యంతరాల నడుమ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు (CEA) వి. అనంత నాగేశ్వరన్ ఇంధన విధానంపై కీలకమైన చర్చను లేవనెత్తారు. ఎథనాల్ బ్లెండింగ్‌ను 20 శాతానికి మించి (E27, E30 వంటివి) పెంచే ముందు "ఆహారం వర్సెస్ ఇంధనం" అలాగే "నీటి లభ్యత" వంటి అంశాలను సమగ్రంగా పరిశీలించాలని ప్రభుత్వం మరియు విధానకర్తలను హెచ్చరించారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌లో రాసిన కథనంలో నాగేశ్వరన్ మరియు ఆర్థిక వ్యవహారాల శాఖ కన్సల్టెంట్ ఆకాష్ పూజారి తమ విశ్లేషణను వివరించారు.
పాత వాహనాల కోసం E10 పెట్రోల్ తిరిగితేవాలి
దేశంలో బిఎస్-IV (BS-IV) కంటే ముందు తయారైన దాదాపు 7.5 కోట్ల నుంచి 8 కోట్ల వరకు పాత కార్బొరేటర్ ఆధారిత ద్విచక్ర వాహనాలు ఉన్నాయని రచయితలు పేర్కొన్నారు. ఇటువంటి వాహనాలలో ఎయిర్-ఫ్యూయల్ మిశ్రమాన్ని సరిచేసే ఆటోమేటిక్ సెన్సార్లు ఉండవు. కాబట్టి E20 పెట్రోల్ వల్ల ఇంజిన్లు వేడెక్కడం, రబ్బరు భాగాలు దెబ్బతినడం వంటి సమస్యలు రావచ్చు. ఇన్ని కోట్ల వాహనాలను రీట్రోఫిట్ (భాగాలు మార్చడం) చేయడం సమయంతో కూడుకున్న పని అయినందున, ఈ పాత వాహనాల కోసం E10 పెట్రోల్‌ను తిరిగి అందుబాటులోకి తేవాలని వారు సూచించారు.
ఆహారం వర్సెస్ ఇంధనం
ప్రస్తుతం ఎథనాల్ ఉత్పత్తికి చెరకుతో పాటు జొన్నలు, మొక్కజొన్న, బియ్యం వంటి ధాన్యాలను వాడుతున్నారు. ఎథనాల్ డిమాండ్ పెరిగేకొద్దీ డిస్టిలరీల నుంచి ఈ పంటలకు డిమాండ్ పెరుగుతుంది.
పౌల్ట్రీ, పశుగ్రాసంపై ప్రభావం
ఉదాహరణకు మొక్కజొన్నను ఎథనాల్ తయారీకి ఎక్కువగా ఉపయోగిస్తే, పౌల్ట్రీ మరియు పశుగ్రాసం పరిశ్రమకు లభ్యత తగ్గి ధరలు పెరుగుతాయి. ఇది పరోక్షంగా ఆహార వ్యవస్థపై ప్రభావం చూపుతుంది.
చెరకు వినియోగం పరిమితి
చక్కెర ధరలను అదుపు చేయడానికి ప్రభుత్వం ఎథనాల్ కోసం చెరకు వినియోగాన్ని నియంత్రించాలని భావిస్తే, ఆ లోటును భర్తీ చేయడానికి ధాన్యాలపైనే ఆధారపడాల్సి వస్తుంది.
భూమి, నీటి వినియోగాన్ని మార్చడం కష్టం
ఒకసారి భూమిని, నీటిని ఇంధన అవసరాల కోసం పంటల వైపు మళ్లిస్తే, ఆ పంటల నమూనాలను మరియు డిస్టిలరీలను మళ్లీ పాత స్థితికి తీసుకురావడం చాలా కష్టమని నాగేశ్వరన్ హెచ్చరించారు. చమురు దిగుమతులు తగ్గడం, విదేశీ మారక ద్రవ్యం ఆదా కావడం వంటి లాభాలను మాత్రమే చూడకుండా, వ్యవసాయ రంగం, నీటి వనరులపై పడే భారాన్ని కూడా గణించాలన్నారు.
ప్రభుత్వం మరియు విమర్శకుల వాదన
ప్రభుత్వ వర్గాలు E20 పెట్రోల్‌ను సమర్థిస్తూ, ఇది రైతుల రాబడిని పెంచుతుందని, ఇంధన స్వయంసమృద్ధికి దోహదపడుతుందని స్పష్టం చేస్తున్నప్పటికీ, E20ని దాటి ముందుకు వెళ్లేముందు సమగ్రంగా ఆలోచించాలని, ప్రస్తుతానికి E20 వద్దే ఉంటూ పాత వాహనాలకు E10 లభించేలా చేయాలని విశ్లేషకులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.




