New Home Checklist: కొత్త ఇల్లు కొన్న తర్వాత ఈ 8 పనులు తప్పక పూర్తి చేయండి.. లేదంటే సమస్యలే!

New Home Checklist: కొత్త ఇల్లు కొన్న తర్వాత తాళాలు మార్చడం నుంచి ఆస్తి మ్యుటేషన్‌, పన్ను రికార్డుల వరకు ఈ ముఖ్యమైన పనులు తప్పక పూర్తి చేయండి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 30 Aug 2026 1:18 PM IST
New Home Checklist
X

New Home Checklist: కొత్త ఇల్లు కొన్న తర్వాత ఈ 8 పనులు తప్పక పూర్తి చేయండి.. లేదంటే సమస్యలే!

New Home Checklist: కలల ఇంటిని సొంతం చేసుకున్న తర్వాత ఇక ఇంటీరియర్‌, ఫర్నిచర్‌, గృహప్రవేశం వంటి వాటిపై దృష్టి పెడుతుంటారు. అయితే రిజిస్ట్రేషన్‌ పూర్తయి ఇంటి తాళాలు చేతికి వచ్చినంత మాత్రాన ప్రక్రియ పూర్తయినట్లు కాదు. ఇంటిని స్వాధీనం చేసుకున్న తర్వాత కొన్ని ముఖ్యమైన పనులను వెంటనే పూర్తి చేయడం అవసరం. ఇవి ఆస్తి భద్రతతో పాటు యాజమాన్య హక్కులు, భవిష్యత్‌ చెల్లింపులు, ప్రభుత్వ రికార్డులకు సంబంధించిన సమస్యలను నివారించడంలో సహాయపడతాయి.

1. ఇంటి తాళాలు మార్చండి: కొత్త ఇంట్లోకి వెళ్లే ముందు ప్రధాన ద్వారం తాళాలను మార్చుకోవడం మంచిది. పాత యజమాని, బ్రోకర్‌, కాంట్రాక్టర్‌ లేదా ఇతరుల వద్ద అదనపు తాళాలు ఉండే అవకాశం ఉంటుంది. అందుకే కొత్త లాక్‌ ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఇంటి భద్రతను పెంచుకోవచ్చు.

2. విద్యుత్‌, నీటి కనెక్షన్లు మీ పేరుపైకి మార్చుకోండి: మొదటి బిల్లు వచ్చే వరకు వేచి ఉండకుండా విద్యుత్‌, నీటి కనెక్షన్లను మీ పేరుపైకి బదిలీ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల భవిష్యత్‌ బిల్లులు, సంబంధిత రికార్డులు మీ పేరుతోనే ఉంటాయి.

3. ఆస్తి మ్యుటేషన్‌ చేయించుకోండి: ఆస్తి రిజిస్ట్రేషన్‌ పూర్తయిన తర్వాత కూడా కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ రెవెన్యూ లేదా మున్సిపల్‌ రికార్డుల్లో యాజమాన్య వివరాలను అప్‌డేట్‌ చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం సంబంధిత స్థానిక సంస్థలో ప్రాపర్టీ మ్యుటేషన్‌ కోసం దరఖాస్తు చేయడం అవసరం.

4. సొసైటీ రికార్డుల్లో యాజమాన్యాన్ని మార్చండి: అపార్ట్‌మెంట్‌ లేదా గేటెడ్‌ కమ్యూనిటీలో ఇల్లు కొనుగోలు చేసినట్లయితే హౌసింగ్‌ సొసైటీ రికార్డుల్లోనూ యాజమాన్య వివరాలను మార్చుకోవాలి. అవసరమైన చోట సొసైటీ నుంచి NOC కూడా తీసుకోవడం మంచిది.

5. పాత బకాయిలను చెక్‌ చేయండి: ఇల్లు కొనుగోలు చేసిన తర్వాత గత యజమానికి సంబంధించిన బకాయిలు మీపై పడకుండా ముందుగానే నిర్ధారించుకోవాలి. మెయింటెనెన్స్‌ ఛార్జీలు, విద్యుత్‌, నీటి బిల్లులు, ఆస్తి పన్ను వంటి వాటిలో బకాయిలు ఉన్నాయా లేదా పరిశీలించాలి.

6. ఆస్తి పన్ను రికార్డులను అప్‌డేట్‌ చేయండి: స్థానిక మున్సిపాలిటీలో ఆస్తి పన్నుకు సంబంధించిన యాజమాన్య వివరాలను మీ పేరుతో అప్‌డేట్‌ చేసుకోవాలి. దీంతో భవిష్యత్‌లో పన్ను నోటీసులు, రసీదులు సరైన యజమాని పేరుపై వచ్చే అవకాశం ఉంటుంది.

7. ఇంటిని పూర్తిగా తనిఖీ చేయండి: కొత్త ఇంట్లో పూర్తిగా స్థిరపడే ముందు ఇంటిని ఒకసారి క్షుణ్ణంగా పరిశీలించడం మంచిది. ముఖ్యంగా ప్లంబింగ్‌లో లీకేజీలు, విద్యుత్‌ సమస్యలు, గోడల్లో తేమ, నీరు కారడం, వాటర్‌ప్రూఫింగ్‌ లోపాలు ఉన్నాయా లేదా చూడాలి. అవసరమైతే సంబంధిత నిపుణులతో తనిఖీ చేయించుకోవచ్చు.

8. ఆస్తి పత్రాలను భద్రంగా ఉంచండి: సేల్‌ డీడ్‌, రిజిస్ట్రేషన్‌ పత్రాలు, హోమ్‌ లోన్‌ డాక్యుమెంట్లు, పొసెషన్‌ లెటర్‌, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్‌ (OC), కంప్లీషన్‌ సర్టిఫికేట్‌ (CC), బిల్డర్‌ NOC వంటి ముఖ్యమైన పత్రాలను భద్రంగా భద్రపరచాలి. ఒరిజినల్‌ పత్రాలతో పాటు డిజిటల్‌ కాపీలను కూడా సురక్షితంగా ఉంచుకోవడం ఉపయోగకరం.

ఈ పనులను ఇంటి స్వాధీనం తీసుకున్న వెంటనే పూర్తి చేసుకోవడం వల్ల భవిష్యత్‌లో ఆస్తి యాజమాన్యం, బిల్లులు, పన్నులు, సొసైటీ రికార్డులకు సంబంధించిన సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇంటిని అలంకరించుకోవడం ఎంత ముఖ్యమో, దానికి సంబంధించిన చట్టపరమైన, పరిపాలనా ప్రక్రియలను పూర్తి చేయడం కూడా అంతే ముఖ్యం.

ఢిల్లీ ఆస్తి రిజిస్ట్రేషన్‌లో మార్పులు?

ఇదిలా ఉంటే ఢిల్లీలో ఆస్తి రిజిస్ట్రేషన్‌ నిబంధనలను మరింత కఠినతరం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నట్లు నివేదికలు వెలువడ్డాయి. భూ యజమానులు, బిల్డర్ల మధ్య కుదిరే ఒప్పందాలను సబ్‌-రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నమోదు చేయాల్సిన విధానాన్ని తీసుకురావడంపై ప్రతిపాదనలు ఉన్నట్లు సమాచారం. ప్రతిపాదిత విధానంలో ఇలాంటి ఒప్పందాలపై 1 శాతం రిజిస్ట్రేషన్‌ ఫీజు విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆస్తి విభజన, యాజమాన్య హక్కులకు సంబంధించిన వివాదాలను తగ్గించడమే ఈ చర్య ఉద్దేశంగా భావిస్తున్నారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story