Airtel: ఎయిర్‌టెల్ విశ్వరూపం.. ప్రపంచంలోనే నెం.2గా రికార్డు.!

Airtel: భారతీ ఎయిర్‌టెల్ అంతర్జాతీయ స్థాయిలో 65 కోట్ల సబ్‌స్క్రైబర్ల మైలురాయిని దాటి, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం సంస్థగా అవతరించింది

Naresh.k
Published on: 3 April 2026 8:38 AM IST
Bharti Airtel Becomes World 2nd Largest Telecom Provider with 650 Million Subscribers
X

Bharti Airtel

Airtel Telecom: భారతీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ అంతర్జాతీయ స్థాయిలో సరికొత్త చరిత్ర సృష్టించింది. తన అద్భుతమైన సేవలతో ఏకంగా 65 కోట్ల మంది సబ్‌స్క్రైబర్ల మైలురాయిని అధిగమించి, ప్రపంచంలోనే రెండో అతిపెద్ద టెలికాం కంపెనీగా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. కేవలం భారతదేశంలోనే కాకుండా అంతర్జాతీయ మార్కెట్లలోనూ పాగా వేస్తూ ఎయిర్‌టెల్ ఈ స్థాయికి చేరుకోవడం విశేషం.

ఎయిర్‌టెల్ అప్రతిహత ప్రస్థానం

గ్లోబల్ సబ్‌స్క్రైబర్లు 65 కోట్లు చేరడంతో ప్రపంచంలోనే 2వ స్థానం దక్కించుకుంది. భారత్‌లోనే 36.8 కోట్లకు పైగా వినియోగదారులు. 1.3 కోట్లకు పైగా ఇళ్లకు హై-స్పీడ్ ఇంటర్నెట్ అందిస్తుంది ఎయిర్‌టెల్. సుమారు 15 కోట్ల కుటుంబాలకు ఎయిర్‌టెల్ టీవీ సేవలు అందిస్తుంది .

సాంకేతిక విప్లవానికి కేరాఫ్ అడ్రస్

దేశంలో 5G Plus సేవలను ప్రారంభించిన మొదటి కంపెనీగా ఎయిర్‌టెల్ ఇప్పటికే రికార్డు సృష్టించింది. కేవలం మొబైల్ సేవలే కాకుండా, ఎంటర్‌ప్రైజ్ విభాగంలోనూ ఎయిర్‌టెల్ తిరుగులేని శక్తిగా ఎదిగింది. 4 లక్షల కిలోమీటర్లకు పైగా సముద్రగర్భ ఫైబర్ నెట్‌వర్క్, అధునాతన గ్రీన్ డేటా సెంటర్లతో సైబర్‌సెక్యూరిటీ, క్లౌడ్ కంప్యూటింగ్, ఐఓటీ వంటి కీలక రంగాల్లో మౌలిక సదుపాయాలను నిర్వహిస్తూ వ్యాపార రంగానికి వెన్నెముకగా నిలుస్తోంది.

దీనిపై ఎయిర్‌టెల్ ఎగ్జిక్యూటివ్ వైస్-ఛైర్మన్ గోపాల్ విట్టల్ మాట్లాడుతూ.. "65 కోట్ల మంది కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకోవడం మాకు గర్వకారణం. ఈ మైలురాయి మాపై మరింత బాధ్యతను పెంచింది. వినియోగదారులకు మరింత మెరుగైన, అత్యుత్తమ నాణ్యత గల డిజిటల్ సేవలను అందించడమే మా లక్ష్యం" అని తెలిపారు. ఈ విజయంతో గ్లోబల్ టెలికాం మార్కెట్‌లో భారతీయ కంపెనీ సత్తా చాటినట్లయింది. భవిష్యత్తులో మరింత విస్తృతమైన నెట్‌వర్క్ ,వినూత్న సేవలతో ఎయిర్‌టెల్ మరిన్ని రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.

Naresh.k

Naresh.k

Next Story